ఈ-సంజీవని సేవలలో దేశంలోనే అగ్రగామిగా ఏపీ

23 Jul, 2021 17:53 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ఈ-సంజీవని సేవలలో దేశంలోనే అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్‌ నిలిచిందని కోవిడ్ కమాండ్ కంట్రోల్ ప్రత్యేకాధికారి ఆర్జా శ్రీకాంత్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్‌లో భాగంగా ఏపీలో ఈ-సంజీవని టెలీకన్సల్టేషన్‌ ఏర్పాటయ్యిందన్నారు. 13 జిల్లాల్లోని వైద్యకళాశాల్లో 13 టెలీమెడిసిన్‌ హబ్‌ల ఏర్పాటు చేశామని తెలిపారు.

ప్రతి టెలిమెడిసిన్‌ హబ్‌లో ఇద్దరు మెడికల్‌ ఆఫీసర్లు, ముగ్గురు స్పెషలిస్టులు సేవలందిస్తున్నారన్నారు. 1145 పీహెచ్‌సీలు, 2914 వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌లకు అనుసంధానం చేశామని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పేషెంట్లకు ప్రిస్క్రిప్షన్లు, వైద్యులు సూచించిన మందులు పేషెంట్ల ఇంటికే పంపిణీ వంటి సేవలు అందించామన్నారు. 20,13,248 మందికి టెలిమెడిసిన్ కన్సల్టేషన్ సేవలందించి దేశంలోనే టాప్‌లో ఏపీ నిలిచిందని ఆర్జా శ్రీకాంత్ వెల్లడించారు.

మరిన్ని వార్తలు