కోవిడ్‌ కట్టడిలో కేరళ కంటే.. ఏపీ చర్యలు భేష్‌

5 Sep, 2021 03:24 IST|Sakshi

ఎక్కువ మంది కోవిడ్‌ బాధితులకు ఉచితంగా వైద్యం అందించిన ఘనత ఏపీదే

కేరళలో ఇప్పటికీ 50 శాతం మంది ప్రజలు డబుల్‌ మాస్కులు వాడుతున్నారు  

అక్కడ ప్రజారోగ్య వ్యవస్థ పటిష్టంగా ఉంది 

ఇ–హెల్త్‌ విధానాన్ని మనం అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది 

కేరళలో పర్యటించి వచ్చిన డాక్టర్‌ సాంబశివారెడ్డి వెల్లడి

సాక్షి, అమరావతి: ‘దక్షిణాది రాష్ట్రాల్లో బలమైన ప్రజారోగ్య వ్యవస్థ కేరళలో మాత్రమే ఉంది. అయినా సరే.. కోవిడ్‌ కట్టడి, నిర్వహణ విషయంలో ఏపీ సర్కారు తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన చర్యలు మంచి ఫలితాలిచ్చాయి’ అన్నారు ప్రముఖ న్యూరో సర్జన్, ఆరోగ్యశ్రీ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ చైర్మన్‌ డా.సాంబశివారెడ్డి. మన రాష్ట్రంలో ఫస్ట్‌ వేవ్, సెకండ్‌ వేవ్‌లో కోవిడ్‌ బాధితులపై ఆర్థిక భారం పడకుండా ప్రభుత్వమే అన్ని ఖర్చులు భరించి.. మెరుగైన చికిత్స అందించడంలో కీలక పాత్ర పోషించిందన్నారు. ఉచితంగా టెస్టులు చేయడం, స్వల్ప లక్షణాలున్న వారిని కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో ఉంచడం, హోం ఐసొలేషన్‌ కిట్‌లు అందించడం ఇలా అన్ని విధాలా కోవిడ్‌ సమయంలో ఏపీ తీసుకున్న నిర్ణయాలు పేద ప్రజలకు అండగా నిలిచాయని చెప్పారు. మిగతా రాష్ట్రాలు కోవిడ్‌ విషయంలో ఇంత పెద్ద నిర్ణయాలు తీసుకోలేక పోయాయని, ఈ విషయంలో మన రాష్ట్రాన్ని చూసి ఆ రాష్ట్రాలు నేర్చుకోవాల్సింది చాలా ఉందని అన్నారు. కేరళలో ఆరోగ్య పరిస్థితులు, పద్ధతులను పరిశీలించేందుకు వెళ్లిన బృందంలో సాంబశివారెడ్డి ఒకరు. కేరళ వెళ్లివచ్చిన అనంతరం ఆయన శనివారం ‘సాక్షి’తో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. 

ప్రాథమిక వైద్యం స్థానిక సంస్థల ఆధ్వర్యంలోనే.. 
కేరళలో రెండే విధానాలున్నాయి. మొదటిది ప్రాథమిక వైద్యం కాగా.. రెండోది బోధనాస్పత్రులు. ప్రాథమిక ఆస్పత్రులన్నీ పంచాయతీల ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి. ప్రాథమిక వైద్య వ్యవస్థ అక్కడ చాలా బాగుంది. మెడికల్‌ కాలేజీలు చక్కగా ఉన్నాయి. అక్కడ ఇ–హెల్త్‌ సిస్టం అమలు చేస్తున్నారు. దీనివల్ల రోగులు వచ్చినప్పుడు రద్దీ ఉండదు. టోకెన్‌ తీసుకోవడం, సమయానికి ఆస్పత్రికి వెళ్లడం చేస్తున్నారు. ఈ విధానాన్ని మనమూ అనుసరించాల్సిన అవసరం ఉంది. 

అక్కడ ప్రైవేట్‌ ప్రాక్టీస్‌కు అనుమతి లేదు 
కేరళలోని వైద్య బోధనాస్పత్రుల్లో పనిచేసే వైద్యులెవరైనా సరే ప్రైవేట్‌ ప్రాక్టీస్‌ చేయడానికి ప్రభుత్వ అనుమతి లేదు. ప్రభుత్వ పరిధిలో లేనివారు మాత్రమే ప్రైవేటు వైద్యం చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ పరిధిలో పనిచేసే వైద్యులకు అక్కడెక్కడా క్లినిక్‌లు కనిపించనే కనిపించవు. కేరళ ప్రజల్లో మంచి అవగాహన ఉంది. కోవిడ్‌ నిబంధనలు పాటించడంలో వాళ్లు చాలా ముందున్నారు. ఇప్పటికీ 50 శాతం మంది డబుల్‌ మాస్క్‌ వినియోగిస్తున్నారు. 

కేరళలో ఇంకా  కేరళలో ఇంకా 
కేరళలో చాలామంది థర్డ్‌వేవ్‌ అనుకుంటున్నారు. అది వాస్తవం కాదు. ఇప్పుడు అక్కడ సెకండ్‌ వేవ్‌ నడుస్తోంది. అక్కడ లాక్‌డౌన్‌ ఎక్కువ సమయం పెట్టారు. దీంతో మొదటి వేవ్‌లో పెద్దగా కేసులు రాలేదు. లాక్‌డౌన్‌ ఎత్తేశాక ఓనం పండుగలతో పాటు రకరకాల స్థానిక వేడుకలు జరిగాయి. దీంతో అక్కడ సెకండ్‌ వేవ్‌ ఆలస్యంగా మొదలైంది. సెకండ్‌ వేవ్‌ నాటికి అక్కడ 42 శాతమే సీరో సర్వెలెన్స్‌ ఉంది. అప్పటికే మన దగ్గర 70 శాతం పైగా ఉంది. 

అక్కడ సర్వీస్‌ కమిషన్‌ యాక్టివ్‌గా ఉంది 
ఆంధ్రప్రదేశ్‌లో వైద్య ఆరోగ్య శాఖలో నియామకాలన్నీ ఆరోగ్య శాఖ పరిధిలోనే జరుగుతాయి. కానీ.. అక్కడ వైద్యులు, సిబ్బంది నియామకాన్ని సర్వీస్‌ కమిషన్‌ చేపడుతుంది. వైద్య శాఖలో ఖాళీలు ఏర్పడగానే నియామకాలు చేపడుతుంది. అక్కడ సర్వీస్‌ కమిషన్‌ చాలా యాక్టివ్‌గా ఉంది. డాక్టర్లకు కొరత లేదు. వైద్యులకు ఇక్కడ మనమిచ్చే వేతనాల కంటే అక్కడ తక్కువే ఉన్నాయి. కానీ.. అక్కడ వైద్యులు బాగా కమిట్‌మెంట్‌తో పని చేస్తారు. 

ధరల్ని నియంత్రణలో పెట్టగలిగాం 
మన రాష్ట్రంలో కోవిడ్‌ సమయంలో ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ధరల్ని నియంత్రణ చేయగలిగాం. అంతేకాదు కోవిడ్, బ్లాక్‌ఫంగస్‌లను ఆరోగ్యశ్రీలో చేర్చాం. దీనివల్ల ఎక్కువ సంఖ్యలో ప్రజలు లబ్ధి పొందారు. మిగతా రాష్ట్రాలు అలా చేయలేకపోయాయి. కరోనా సమయంలో ఏపీ తీసుకున్న నిర్ణయాలను మరే రాష్ట్రం తీసుకోలేకపోయింది. 

మరిన్ని వార్తలు