ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ఏపీ టాప్‌

4 Mar, 2022 04:01 IST|Sakshi
నివేదిక విడుదల చేస్తున్న తిరుపతిరాజు, చందన చౌదరి

రాష్ట్రంలో సింగిల్‌ విండోలో వ్యాపార అనుమతులు భేష్‌ 

రైతులు, చేతివృత్తిదారులతో పాటు ఎంఎస్‌ఎంఈలకు అండగా ప్రభుత్వం

సీఐఐ వార్షిక సదస్సులో ఫ్లిప్‌కార్ట్‌ గ్రూప్‌ సీఈవో కల్యాణ్‌ కృష్ణమూర్తి

దొండపర్తి/బీచ్‌రోడ్డు (విశాఖ): ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో అగ్రస్థానంలో స్థిరంగా కొనసాగుతోందని ఫ్లిప్‌కార్ట్‌ గ్రూప్‌ సీఈవో కల్యాణ్‌ కృష్ణమూర్తి చెప్పారు. భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఆధ్వర్యంలో ‘ఈ–కామర్స్‌ ద్వారా దేశంలో అంతరాన్ని తగ్గించడం’ అనే అంశంపై గురువారం విశాఖ కేంద్రంగా వర్చువల్‌ విధానంలో వార్షిక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న కృష్ణమూర్తి మాట్లాడుతూ పెట్టుబడుల ఆకర్షణకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విధానాలు బాగున్నాయని, వ్యాపారాభివృద్ధికి బాటలు వేస్తున్నాయని తెలిపారు.

రాష్ట్రంలో వ్యాపారాన్ని సులభతరం చేసేందుకు ప్రవేశపెట్టిన సింగిల్‌ విండో క్లియరెన్సుల విధానం అద్భుతంగా ఉందని కొనియాడారు. ప్రధానంగా ప్రభుత్వం రైతులకు మద్దతుగా నిలుస్తుండటం శుభ పరిణామంగా అభివర్ణించారు. రైతులు, చిన్న వ్యాపారులు, చేతి వృత్తిదారులతో పాటు ఎంఎస్‌ఎంఈలకు ఇక్కడి ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని అన్నారు. చిన్న వ్యాపారుల శ్రేయస్సుకు ఈ కామర్స్‌ కీలకమన్నారు. ఫ్లిప్‌కార్ట్‌ గ్రూప్‌ ఏపీలో 3 వేలకుపైగా విక్రేతలను కలిగి ఉందని చెప్పారు. ఫ్లిప్‌కార్ట్‌ హోల్‌సేల్‌ స్టోర్లు, 2.2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 2 పెద్ద ఫుల్‌ఫిల్‌మెంట్‌ సెంటర్లను కలిగి ఉందని వివరించారు. ఫ్లిప్‌కార్ట్‌ గ్రూప్‌ రాష్ట్రంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి కల్పిస్తోందని చెప్పారు. 

రాష్ట్రంలో రెండు మల్టీమోడల్‌ లాజిస్టిక్‌ పార్కులు:  మారిటైమ్‌ బోర్డు డిప్యూటీ సీఈవో
రాష్ట్రంలో రెండు మల్టీమోడల్‌ లాజిసిక్‌ పార్కులు ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ మారిటైమ్‌ బోర్డు డిప్యూటీ సీఈవో రవీంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. సీఐఐ ఆంధ్రప్రదేశ్‌ వార్షిక సమావేశంలో ఆయన వర్చువల్‌గా పాల్గొన్నారు. రాష్ట్రంలో మారిటైమ్‌ రంగం అభివృద్ధికి ఓడరేవులు, విమానాశ్రయాలు, రోడ్డు మార్గాలకు కనెక్టివిటీ కల్పిస్తూ మెగా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. తద్వారా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు మంచి అవకాశం కల్పిస్తున్నామన్నారు. కొత్త లాజిసిక్‌ పాలసీలు తీసుకువచ్చేందుకు తగిన సలహాలివ్వాలని పారిశ్రామికవేత్తలను కోరారు. సమావేశంలో సీఐఐ మాజీ చైర్మన్‌ రాకేష్, తిరుపతిరాజు, చందనచౌదరి తదితరులు పాల్గొన్నారు. ఎంఎస్‌ఎంఈలు ఎదుర్కొంటున్న సవాళ్లపై నివేదికను తిరుపతిరాజు, చందన చౌదరి తదితరులు విడుదల చేశారు.

సీఐఐ ఏపీ చైర్మన్‌గా నీరజ్‌.. 
సీఐఐ ఆంధ్రప్రదేశ్‌ నూతన చైర్మన్‌గా సర్డ మెటల్స్‌ అండ్‌ అల్లాయిస్‌ సంస్థ డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ నీరజ్‌ సర్డ, వైస్‌ చైర్మన్‌గా సుజయ్‌ బయోటెక్‌ ఎండీ లక్ష్మీప్రసాద్‌ను ఎన్నుకున్నారు. వీరిని సభ్యులు, పలువురు పారిశ్రామికవేత్తలు అభినందించారు.  

మరిన్ని వార్తలు