పరిశుభ్రతలో ఏపీ టాప్

7 Mar, 2021 03:06 IST|Sakshi

స్వచ్ఛభారత్‌–2 కార్యక్రమంలో రాష్ట్రం ఘనత

దేశవ్యాప్తంగా ఓడీఎఫ్‌ ప్లస్‌ గ్రామాలుగా 1,060 పల్లెలు ఎంపిక

అందులో అత్యధికంగా 680 గ్రామాలు మన రాష్ట్రంలోనివే

రెండో స్థానంలో హరియాణ.. అక్కడ 199 గ్రామాల్లో..

మురుగు, చెత్త రహిత, వందశాతం మరుగుదొడ్ల వినియోగం వంటి ఎనిమిది అంశాల ప్రాతిపదికన ఎంపిక

సాక్షి, అమరావతి: గ్రామాలను పూర్తి పరిశుభ్రంగా ఉంచడంలో మన రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానం దక్కించుకుంది. రోడ్లపై మురుగు నీరు నిలబడకుండా, చెత్తచెదారం లేకుండా చూడడం.. గ్రామస్తులందరూ వంద శాతం మరుగుదొడ్లు వినియోగించడం వంటి ఎనిమిది అంశాల ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ‘ఓడీఎఫ్‌ ప్లస్‌’ పేరుతో స్వచ్ఛభారత్‌–2 కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా.. కేంద్ర ప్రమాణాలకు తగ్గట్లుగా రాష్ట్రంలో పూర్తి పరిశుభ్ర గ్రామాలుగా 680 పల్లెలను గుర్తించారు.

ఇలా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,060 గ్రామాలను గుర్తించగా.. అందులో సగానికి పైగా మన రాష్ట్రంలోవే ఉండడం విశేషం. హరియాణ రెండో స్థానం దక్కించుకుంది. అక్కడ 199 గ్రామాలను ఓడీఎఫ్‌ ప్లస్‌ ప్రమాణాలకు తగ్గట్లుగా తీర్చిదిద్దారు. ఆ తర్వాత ఛత్తీస్‌గఢ్‌లో 89 గ్రామాలను గుర్తించగా.. తెలంగాణలో 22 గ్రామాలను గుర్తించారు. ఇక కేంద్రపాలిత ప్రాంతాలతో కలిపి దేశంలో మొత్తం 35 రాష్ట్రాలుండగా, 24 రాష్ట్రాల్లో ఒక్క గ్రామం కూడా ఈ ఘనతను సాధించలేకపోయాయి.

2020 ఏప్రిల్‌ నుంచి స్వచ్ఛ భారత్‌–2
దేశంలోని 6.03 లక్షల గ్రామాలను 2025 మార్చి నెలాఖరుకల్లా పూర్తి పరిశుభ్రత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం 2020 ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి స్వచ్ఛభారత్‌–2 కార్యక్రమానికి ఓడీఎఫ్‌ ప్లస్‌ పేరుతో శ్రీకారం చుట్టింది. రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామీణ ప్రాంతాల్లో అమలుచేసే వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చుపెట్టే నిధులు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులన్నింటినీ కలుపుకుంటూ గ్రామాలను ఓడీఎఫ్‌ ప్లస్‌ పల్లెలుగా తీర్చిదిద్దాలని కేంద్రం సూచించింది. ఈ ప్రక్రియలో.. ఓడీఎఫ్‌ ప్లస్‌ గ్రామాలుగా గుర్తించడానికి ఎనిమిది అంశాలను పరిగణనలోకి తీసుకోనున్నట్లు స్పష్టంచేసింది. అవి..
– గ్రామంలో రోడ్లపై మురుగునీరు నిలిచే పరిస్థితి ఉండకూడదు. 
– మురుగు కాల్వల వ్యవస్థ సక్రమంగా ఉండాలి.
– గ్రామంలో కనీసం 80 శాతానికి పైగా ఇళ్ల నుంచి చెత్తను క్రమపద్ధతిలో సేకరించే కార్యక్రమం కొనసాగాలి. 
– ఈ ఇళ్ల నుంచి వెలువడే వృధా నీరు మురుగునీటి కాల్వలో కలిసే ఏర్పాట్లు ఉండాలి.
– గ్రామంలో వినియోగించిన ప్లాస్టిక్‌ వ్యర్ధాలను సేకరించాలి.
– పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ఇతర ప్రభుత్వ కార్యాలయాన్నింటిలో మరుగుదొడ్లు నిర్మించాలి. 
– ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారి సౌకర్యార్ధం గ్రామం వెలుపల కమ్యూనిటీ టాయిలెట్లు నిర్మించాలి.
– పరిశుభ్రతపై గ్రామస్తులకు చైతన్యం కలిగించే కార్యక్రమాల నిర్వహణ వంటివి చేపట్టాలి.

రాష్ట్రంలో ‘మనం–మన పరిశుభ్రత’ పేరుతో..
రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలో చిన్నచిన్న కుగ్రామాలతో కలిపి మొత్తం 18,841 గ్రామాలున్నాయి. వీటన్నింటినీ కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు తగ్గట్లు ఓడీఎఫ్‌ ప్లస్‌ గ్రామాలుగా తీర్చిందేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ‘మనం–మన పరిశుభ్రత’ పేరుతో ఒక కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. విడతల వారీగా ఈ కార్యక్రమాన్ని అమలుచేస్తోంది. తొలి విడతగా.. మండలానికి రెండేసి గ్రామాలు చొప్పున 2020 జూన్‌ ఒకటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా 1,320 గ్రామ పంచాయతీల్లో ఈ కార్యక్రమాలు అమలుచేస్తుండగా, రెండో విడతలో 4,737 గ్రామ పంచాయతీల్లో గత డిసెంబరు నుంచి శ్రీకారం చుట్టింది. స్థానికులను భాగస్వాములను చేస్తూ తొలి 15 రోజులపాటు ప్రజాచైతన్య కార్యక్రమాలు చేపట్టారు. జాయింట్‌ కలెక్టర్ల స్థాయి నుంచి జిల్లా అధికారులు స్వయంగా గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజా చైతన్య కార్యక్రమాలలో పాలుపంచుకుంటున్నారు.  

మరిన్ని వార్తలు