AP Telemedicine Services: టెలీ మెడిసిన్‌ సేవల్లో ఏపీ టాప్‌

21 Feb, 2022 05:00 IST|Sakshi

దేశవ్యాప్తంగా 2.43 కోట్ల కన్సల్టేషన్లు

ఇందులో 1.02 కోట్ల కన్సల్టేషన్లు ఏపీ నుంచే

సేవలను ప్రజలకు చేరువ చేసేందుకు 42 వేల మంది ఆశావర్కర్లకు మొబైల్‌ ఫోన్లు

సాక్షి, అమరావతి: టెలీ మెడిసిన్‌ సేవల్లో మన రాష్ట్రం దేశంలోనే ముందువరుసలో నిలుస్తోంది. ఇతర రాష్ట్రాలు ఏపీకి దరిదాపుల్లో కూడా కనిపించడం లేదు. దేశవ్యాప్తంగా ఈ–సంజీవని టెలీ మెడిసిన్‌ సేవలను 2019 నవంబర్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇందుకోసం 13 జిల్లాల్లోని వైద్య కళాశాలల్లో 13 హబ్‌లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీటికి రాష్ట్రంలోని 1,145 పీహెచ్‌సీలతో పాటు, వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌లను అనుసంధానం చేసింది. స్మార్ట్‌ ఫోన్‌ ఉన్న ప్రజలు ఇంటినుంచే టెలీ మెడిసిన్‌ సేవలు పొందేలా ఈ–సంజీవని (ఓపీడీ) సేవలు గత ఏడాది నుంచి అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం రోజువారీగా దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి టెలీ మెడిసిన్‌కు వస్తున్న కన్సల్టేషన్లలో అత్యధిక శాతం ఏపీవే ఉంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం సైతం టెలీ మెడిసిన్‌ సేవల్లో రాష్ట్రం అగ్రగామిగా నిలిచినట్టు ఇప్పటికే పలుమార్లు ప్రకటించింది. 

42 శాతం ఏపీ నుంచే..
టెలీ మెడిసిన్‌ సేవలు ప్రారంభమైన నాటినుంచి నేటివరకు దేశ వ్యాప్తంగా 2,43,00,635 కన్సల్టేషన్లు నమోదయ్యాయి. వీటిలో 42 శాతం అంటే 1,02,03,821 ఏపీ నుంచి నమోదై రికార్డు సృష్టించాయి. 37,70,241 కన్సల్టేషన్లతో కర్ణాటక రెండో స్థానంలో ఉంది. రాష్ట్రం నుంచి ప్రస్తుతం రోజుకు 75 వేల వరకూ కన్సల్టేషన్లు ఉంటున్నాయి. ఈ–సంజీవని ఓపీడీ యాప్‌ను రాష్ట్రంలో ఇప్పటికే 85,351 మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ఈ సంజీవని సేవలపై స్మార్ట్‌ ఫోన్లు వినియోగించడం తెలియని, స్మార్ట్‌ ఫోన్లు లేనివారిలో అవగాహన పెంచడం కోసం రాష్ట్రంలోని 42 వేల మంది ఆశా వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్‌ ఫోన్లు పంపిణీ చేసింది. వీటిని హబ్‌లకు అనుసంధానించింది. త్వరలో ఆశా వర్కర్ల ద్వారా ప్రజలకు టెలీ మెడిసిన్‌ సేవలను మరింత చేరువ చేయడానికి వైద్య, ఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 

కొత్తగా మరో 14 చోట్ల.. 
రాష్ట్రంలో ప్రస్తుతం 13 జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున 13 టెలీ మెడిసిన్‌ హబ్స్‌తో ప్రభుత్వం సేవలు అందిస్తోంది. వీటిని మరింత విస్తృతం చేయడంలో భాగంగా రూ.5 కోట్లకు పైగా నిధులతో కొత్తగా మరో 14 చోట్ల హబ్స్‌ను ఏర్పాటు చేస్తోంది. వీటిలో ఇప్పటికే 7 హబ్స్‌ ప్రారంభమయ్యాయి. ఒక్కో హబ్‌లో  ఇద్దరు జనరల్‌ మెడిసిన్, గైనకాలజీ, పీడియాట్రిక్స్, కార్డియాలజీ స్పెషలిస్ట్‌లు ఉంటారు.

రోజుకు 5 లక్షల కన్సల్టేషన్లు లక్ష్యంగా..
టెలీ మెడిసిన్‌ సేవల్లో రాష్ట్రం అగ్రగామిగా ఉంది. ఈ ఏడాది మార్చి నాటికి రోజుకు 2 లక్షల కన్సల్టేషన్లకు చేరుకుంటాం. ఈ ఏడాది చివరి నాటికి రోజుకు 5 లక్షల కన్సల్టేషన్లు చేయాలనేది లక్ష్యంగా పెట్టుకున్నాం. తద్వారా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ సంవత్సరంలో సగటున మూడుసార్లు టెలీ మెడిసిన్‌ సేవలు పొందుతారు.
– కాటమనేని భాస్కర్, కమిషనర్, వైద్య, ఆరోగ్య శాఖ 

మరిన్ని వార్తలు