దేశంలోని అన్ని రాష్ట్రాల్లోకెల్లా ఏపీ తాగునీరే సేఫ్‌

20 Apr, 2022 03:33 IST|Sakshi

కేవలం నాలుగు శాతం నీటి శాంపిల్స్‌లోనే కలుషిత కారకాలు 

అదే దేశంలో సగటున 14 శాతం నీటి నమూనాల్లో..

రాష్ట్రంలో 4,04,083 శాంపిల్స్‌కు పరీక్షలు చేస్తే కేవలం 16,801లోనే కాలుష్య కారకాలు

మూడేళ్లుగా రాష్ట్రంలో భారీ వర్షాలతో నీటి నాణ్యత కూడా బాగా పెరిగింది

నీటి పరీక్షల నిర్వహణలోనూ ఏపీ దేశంలోనే ఫస్ట్‌

రాష్ట్రాల వారీగా నీటి నాణ్యత పరీక్షల ఫలితాలు ప్రకటించిన కేంద్రం

సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోకెల్లా మన ఏపీలోని బోరు, బావుల్లోని తాగునీరే అత్యంత సురక్షితమని తేలింది. గత ఏడాది ఏప్రిల్‌ నుంచి ఈ ఏడాది మార్చి వరకు అన్ని రాష్ట్రాల గ్రామీణ ప్రాంతాల్లోని బోర్లు, బావుల నీటికి నిర్వహించిన నాణ్యతా పరీక్షల్లో వంద శాంపిల్స్‌కుగాను 14 నమూనాల్లో వివిధ రకాల కాలుష్య కారకాలను గుర్తించారు. కానీ, మన రాష్టంలో మాత్రం వందకు నాలుగు శాంపిల్స్‌లో మాత్రమే అవి ఉన్నట్లు తేలింది.

ఈ పరీక్షల ఫలితాలను కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ తన అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపర్చింది. అలాగే, ఏపీలో మూడు నాలుగేళ్ల కిందట నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులతో ఫ్లోరైడ్‌ ఆనవాళ్లు ఎక్కువగా కనిపించేవని.. అయితే, గత మూడేళ్లగా రాయలసీమ జిల్లాలతో సహా రాష్ట్రమంతటా సమృద్ధిగా వర్షాలు కురవడంతో భూగర్భ జలాల్లో నీటి నాణ్యత చాలాబాగా మెరుగైనట్లు గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్‌డబ్ల్యూఎస్‌) అధికారులు వెల్లడించారు.

కాలుష్య కారకాలు.. వాటితో దుష్ఫలితాలు..
వైద్యులు పేర్కొంటున్న వివరాల ప్రకారం..

► మెర్క్యూరీ ఉన్న నీటిని దీర్ఘకాలం తాగితే మనిషి నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. 
► క్లోరైడ్‌ కారకం ఉండే నీటిని తాగితే రక్తపోటు వ్యాధులకు గురవుతుంటారు. 
► లెడ్‌ వంటివి చిన్న పిల్లల ఎదుగుదల మీద, పెద్దల్లో కిడ్నీలపై ప్రభావం చూపుతుంది. 
► ఇక ఫ్లోరైడ్‌తో కీళ్ల వ్యాధులు రావడంతో చిన్న వయస్సులో పళ్లు దెబ్బతింటాయి. 
ఈ నేపథ్యంలో.. ప్రజల తాగునీటిలో కలుషిత కారకాలను గుర్తించడానికి ప్రభుత్వం ముందస్తుగానే ఎప్పటికప్పుడు నీటి నాణ్యత పరీక్షలు నిర్వహిస్తుంటుంది. మన రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉండే 2.60 లక్షల బోర్లు, బావుల్లో నీటికి ఏటా ఒకసారి.. అలాగే, దాదాపు 50 వేలకు పైబడి రక్షిత మంచినీటి పథకాల ద్వారా సరఫరాచేసే నీటికి ఏటా రెండు విడతల చొప్పున ఆర్‌డబ్ల్యూఎస్‌ విభాగం, రాష్ట్ర ప్రభుత్వం ఈ పరీక్షలు చేపడుతుంది. ఇక ఆర్‌డబ్ల్యూఎస్‌ పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా 107 నీటి నాణ్యత పరీక్షల ల్యాబ్‌లు ఉండగా, వాటిల్లో మొత్తం 21 రకాల కలుషిత కారకాలను గుర్తించే సౌలభ్యం ఉంది. పరీక్షల ఫలితాలను ఎప్పటికప్పుడు ఆ వెబ్‌సైట్‌లో పొందుపర్చాల్సి ఉంటుంది. 

పరీక్షల్లో మన రాష్ట్రమే ఫస్ట్‌
మార్చి నెలాఖరుతో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో దేశం మొత్తం మీద మన ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా నాణ్యత పరీక్షలు నిర్వహించారు. అన్ని రాష్ట్రాల్లో 47,03,476 నీటి శాంపిల్స్‌కు పరీక్షలు నిర్వహించగా.. అందులో మన రాష్ట్రం అత్యధికంగా 4,04,083 నమూనాలకు నిర్వహించింది. తర్వాత మధ్యప్రదేశ్‌ 4,01,022 శాంపిల్స్‌కు.. పశ్చిమ బెంగాల్‌లో 3,82,846 శాంపిల్స్‌కు పరీక్షలు జరిగాయి. మిగిలిన రాష్ట్రాల్లో ఎక్కడా 3 లక్షల మించి పరీక్షలు నిర్వహించలేదు. 

నీటి నాణ్యతలోనూ ఏపీ చాలా మెరుగు
మరోవైపు.. గత ఏడాది ఏపీలో పరీక్షలు నిర్వహించిన 4,04,083 శాంపిల్స్‌లో కేవలం 16,801 నమూనాల్లోనే కాలుష్య కారక ఆనవాళ్లు గుర్తించారు. అంటే మొత్తం శాంపిల్స్‌లో ఇది 4.15 శాతం మాత్రమే. అదే సమయంలో దేశం మొత్తం మీద 47,03,476 నీటి శాంపిల్స్‌కు నిర్వహించిన పరీక్షల్లో 6,73,687 శాంపిల్స్‌లో కలుషిత కారకాలు బయటపడ్డాయి. అంటే ఇది 14.32 శాతం.  పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో అత్యధిక నీటి కాలుష్యం ఉన్నట్లు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ గణాంకాలు పేర్కొన్నాయి.  

మరిన్ని వార్తలు