సూక్ష్మ సేద్యంలో ఏపీ అగ్రగామి.. అధిక సాగు ఘనత కూడా

18 Jul, 2022 03:58 IST|Sakshi

సాక్షి, అమరావతి: సూక్ష్మ సేద్యంలో ఆంధ్రప్రదేశ్‌ ఇతర రాష్ట్రాల కంటే ముందంజలో ఉంది. ఆ తర్వాత స్థానంలో కర్ణాటక నిలిచింది. దేశంలో వ్యవసాయ సాంకేతికతపై నాబార్డు పరిశోధన నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. సూక్ష్మ సేద్యంలో తొలి ఐదు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్‌ రాష్ట్రాలున్నట్లు ఆ నివేదిక పేర్కొంది. అలాగే, ఏపీలోని మొత్తం సాగు విస్తీర్ణంలో 51 శాతం ఈ తరహా సేద్యమే చేస్తున్నట్లు ఆ నివేదిక తెలిపింది.

అదే కర్ణాటకలో 49 శాతం, మహారాష్ట్ర 34 శాతం, తమిళనాడులో 29 శాతం, గుజరాత్‌లో 22 శాతం సూక్ష్మ సేద్యం చేస్తున్నట్లు వెల్లడించింది. ఇక భూగర్భ జలాలు బాగా అడుగంటిన పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లో సూక్ష్మ సేద్యం సాగు విస్తీర్ణం బాగా తక్కువగా ఉండటంపట్ల నివేదిక ఆశ్చర్యాన్ని వ్యక్తంచేసింది. పంజాబ్‌లో మొత్తం సాగు విస్తీర్ణంలో సూక్ష్మ సేద్యం కేవలం ఒక శాతమే ఉండగా.. దాని పొరుగు రాష్ట్రం హర్యానాలో పది శాతమే ఉంది.

నిజానికి.. ఈ రెండు రాష్ట్రాల్లో భూగర్భ జలాలు వేగంగా అడుగంటుతున్నాయని, ఆయినా సరే నీటిని ఆదాచేసే మైక్రో ఇరిగేషన్‌ టెక్నాలజీని వినియోగించడంలో ఇవి బాగా వెనుకబడి ఉన్నట్లు నివేదిక వ్యాఖ్యానించింది. అయితే, ఇక్కడ వరి సాగు ఎక్కువగా ఉండటం కూడా మైక్రో ఇరిగేషన్‌ టెక్నాలజీ వినియోగం తక్కువగా ఉండటానికి ఒక కారణమని వివరించింది.

సూక్ష్మ సేద్యంలో వరిసాగుపై పరిశోధనలు
మరోవైపు.. వరి సాగులో మైక్రో ఇరిగేషన్‌ టెక్నాలజీ వినియోగంపై పరిశోధనలు కొనసాగుతున్నాయని నాబార్డు నివేదిక తెలిపింది. సూక్ష్మ సేద్యంలో నీటి ఆదాతో పాటు పంటల ఉత్పాదకత బాగా పెరుగుతుందని.. అలాగే, విద్యుత్, కూలీల వ్యయం గణనీయంగా తగ్గుతుందని పలు సర్వేల్లో వెల్లడైందని అందులో ప్రస్తావించింది.

నీరు ఆదా కావడమే కాకుండా ఉత్పాదకత గణనీయంగా పెరిగినట్లు ఈ తరహా సాగు చేస్తున్న 60 శాతం రైతులు వెల్లడించారని నివేదిక పేర్కొంది. ప్రధానంగా అరటి, వేరుశనగ, పత్తి పంటల సాగులో మైక్రో ఇరిగేషన్‌ టెక్నాలజీ వినియోగం ద్వారా ఉత్పాదకత పెరుగుతున్నట్లు అధ్యయనంలో తేలిందని వివరించింది.  

మరిన్ని వార్తలు