టూరిజం డే, అల్లూరి జయంతి.. ఛాన్స్ దొరికితే చాలు దోచేస్తున్నారు

12 Jan, 2022 20:09 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: కోవిడ్‌ పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పర్యాటక శాఖ ఖజానాను ఖాళీ చేసే పనిలో టూరిజం రీజనల్‌ డైరెక్టర్‌ కార్యాలయం నిమగ్నమైపోయింది. దొరికిందే తడవుగా.. ఏ చిన్న అవకాశం దొరికినా తమదైన శైలిలో దోపిడీకి తెరతీస్తున్నారు. టూరిజం సీఈవో నోటమాట పేరుతో నిధుల్ని తమ ఖాతాల్లోకి పంపించేసుకుంటున్నారు. టూరిజం డే.. అల్లూరి జయంతి.. కాదేదీ కాసుల వర్షానికి అనర్హం అన్న రీతిలో కలెక్టర్‌కు పంపించకుండానే బిల్లులతో ఖజానాకు చిల్లులు పెడుతున్నారు. 

2021 ఆగస్ట్‌ 27న వీఎంఆర్‌డీఏ చిల్డ్రన్‌ థియేటర్‌లో పర్యాటక దినోత్సవం నిర్వహించారు. వరల్డ్‌ టూరిజం డేకు గతంలో రూ.2 లక్షలు నుంచి రూ.5 లక్షల వరకూ ఖర్చు చేసేవారు. ప్రభుత్వం కూడా రూ.5 లక్షలు ఖర్చు చేయాలని స్పష్టం చేసింది. గతంలో ఘనంగా నిర్వహించేవారు. ఈసారి కోవిడ్‌ కారణంగా ఇన్‌డోర్‌లోనే చేపట్టారు. కానీ.. ఏకంగా రూ.8 లక్షల వరకూ బిల్లులు పెట్టారు. కొందరు కళాకారులకు రూ.19 వేలు ఇచ్చి.. రూ.40 వేలు డ్రా చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నృత్య కళాకారులకు రూ.30 వేలు ఇచ్చి.. రూ.40 వేలు బిల్లు వేశారనీ.. మిగిలిన వారికీ అదేరీతిలో గోరంత ఇచ్చి.. కొండంత బిల్లు లాగేసుకున్నారనే విమర్శలొస్తున్నాయి. 

అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవానికి గతేడాది రూ.1.20 లక్షలు ఖర్చు చేయగా.. ఈసారి మాత్రం రూ.2.75 లక్షలు చేశారు. గతేడాది చేసిన మాదిరిగానే ఈసారీ నిర్వహించారు. కానీ.. ఒకే ఒక్క తేడా.. వర్షం పడుతుందని వాటర్‌ ప్రూఫ్‌ టెంట్‌ వేశారు. దానికే అదనంగా లాగేశారని కొందరు టూరిజం సిబ్బందే ఆరోపిస్తున్నారు. ఇలా అవకాశం దొరికిన ప్రతిసారీ.. టూరిజం ఖజానా ఖాళీ చేసేందుకు టూరిజం ప్రాంతీయ కార్యాలయ సిబ్బంది రెడీగా ఉంటున్నారని పర్యాటక శాఖలో గుసగుసలు వినిపిస్తున్నాయి. 

నోటిమాట చాలంట! 
ప్రతి జిల్లా పర్యాటక శాఖకు సంబంధించి డిస్ట్రిక్ట్‌ టూరిజం కౌన్సిల్‌ అకౌంట్‌ ఉంటుంది. దీనిని ప్రతి జిల్లాలోనూ జిల్లా పర్యాటక అధికారి పర్యవేక్షణలో ఉంటుంది. కానీ విశాఖ జిల్లాలో మాత్రం రెండేళ్ల క్రితం నుంచి వేరే అధికారి పర్యవేక్షణలో ఉంది. రీజనల్‌ డైరెక్టర్‌ కార్యాలయంలోని సిబ్బంది ఇటీవల కొన్ని పనులకు సంబంధించి టూరిజం సీఈవో (నోటిమాట) ఓరల్‌ ఇన్‌స్ట్రక్షన్స్‌ పేరుతో ఇటీవలే రూ. 1.50 లక్షలు వివిధ పనులకు డ్రా చేసుకున్నట్లు సమాచారం. పర్యాటక శాఖకు సంబంధించిన ప్రతి ప్రధాన బిల్లుని జిల్లా కలెక్టర్‌కు పంపించాల్సి ఉంటుంది. కానీ ఓరల్‌ ఇన్‌స్ట్రక్షన్స్‌ పేరుతో ఫైల్‌ని జిల్లా కలెక్టర్‌ కార్యాలయానికి పంపించకుండానే నడిపించినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై టూరిజం సీఈవో సత్యనారాయణని ప్రశ్నించగా.. ఈ బిల్లు విషయం తన దృష్టికి వచ్చిందనీ.. దీనిపై వివరణ కోరినట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు