రెండేళ్ల క్రితం సాదాసీదాగా వచ్చి.. ఇప్పుడు ఆ శాఖలో పెత్తనమంతా అతనిదే..!

15 Dec, 2021 15:40 IST|Sakshi

టూరిజం శాఖలో వింతపోకడలు 

ఓ గైడ్‌కు ఐటీడీఏ సీనియర్‌ మేనేజర్‌ బాధ్యతలు 

జిల్లా టూరిజం కీలక బాధ్యతలూ సదరు ఉద్యోగికే.. 

ఎవ్రిథింగ్‌ ఈజ్‌ పాజిబుల్‌.. ఏపీ పర్యాటక శాఖ ట్యాగ్‌లైన్‌. ఇక్కడ జరిగే వింతలు చూస్తే.. నిజంగా ఈ శాఖకు ఈ ట్యాగ్‌లైన్‌ కరెక్ట్‌ అనిపిస్తుంటుంది. నిబంధనలకు విరుద్ధంగా ఓ అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగికి సీనియర్‌ మేనేజర్‌ హోదాని కట్టబెట్టేశారు. గైడ్‌గా మొదలైన సదరు ఉద్యోగి ప్రస్థానం.. జిల్లా టూరిజం మేనేజర్‌గానూ.. ఇప్పుడు ఐటీడీఏ టూరిజం ఎస్‌ఎం వరకూ చేరింది. ఆరోపణలు, వివాదాలతో నిత్యం సావాసం చేసే ఉద్యోగికి ఇలా ఏకంగా పెద్ద బాధ్యతలు అప్పగించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సాక్షి, విశాఖపట్నం: సుందరి నగరి విశాఖ రాష్ట్రంలో ప్రధాన టూరిస్ట్‌ కేంద్రంగా భాసిల్లుతూ పర్యాటకుల్ని ఆకర్షిస్తోంది. ఇక్కడ రూ.కోట్ల విలువైన టూరిజం ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి. అలాంటి కీలకమైన జిల్లా పర్యాటక శాఖలో ఎంతో ప్రాధాన్యం ఉన్న బాధ్యతలన్నింటినీ ఓ గైడ్‌ చేతుల్లోనే కొనసాగుతున్నాయి. పైగా.. సదరు గైడ్‌ ఓ అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి. టూరిజం డిగ్రీ లేకపోయినా.. కేవలం గైడ్‌గా పనిచేయడం మొదలు పెట్టారు. గైడ్‌కి పోస్ట్‌ ఇవ్వకూడదన్న నిబంధన ఉన్నా.. అప్పటి అధికారుల అండదండలతో అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగిగా చేరిపోయాడు.

ఇటీవలే అవుట్‌ సోర్సింగ్‌ నుంచి కాంట్రాక్టు ఉద్యోగిగా మారేందుకు దరఖాస్తు చేసుకున్నారు. దాన్ని ఫైనాన్స్‌ డిపార్ట్‌మెంట్‌ తిరస్కరించడంతో అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగిగానే కొనసాగుతున్నారు. తాజాగా ఐటీడీఏ సీనియర్‌ మేనేజర్‌ కమ్‌ కోఆర్డినేటర్‌గా రెగ్యులర్‌ అధికారిగా కొనసాగేలా రాష్ట్ర పర్యాటక శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేసేశారు. డిజేబుల్‌ వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్, మైనార్టీ వెల్ఫేర్‌ కార్పొరేషన్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌కు కూడా వెహికల్‌ ప్రోవిజన్‌ లేదు. కానీ.. సదరు అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగికి మాత్రం వాహన సౌకర్యం కల్పించేశారు. 

అడ్మిన్‌ అభ్యంతరం వ్యక్తం చేసినా.. 
ఉత్తర్వులు జారీ చేసే సమయంలో ఏపీటీఏ అడ్మినిస్ట్రేషన్‌ డైరెక్టర్‌ అభ్యంతరం వ్యక్తం చేసినా.. సీఈవో మాత్రం ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించడం విశేషం. దీనికి తోడు మూడు రోజులు జిల్లా టూరిజం కార్యాలయంలోనూ, మూడు రోజులు ఐటీడీఏ సీనియర్‌ మేనేజర్‌గా వ్యవహరించాలంటూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సదరు అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి జిల్లా పర్యాటకశాఖ కార్యాలయంలోనూ అన్నీ తానై కీలకంగా వ్యవహరిస్తున్నారు. గతంలోనూ సదరు ఉద్యోగికి జిల్లా టూరిజం ఆఫీసర్‌గా ఇన్‌చార్జ్‌ బాధ్యతలు అప్పగించడంపైనా పెద్ద వివాదమే చెలరేగింది. 

ఆది నుంచీ ఆరోపణలే.. 
రెండేళ్ల క్రితం విజయనగరం జిల్లాలో పనిచేస్తున్న అతన్ని ఇక్కడి అవసరాల నిమిత్తం తీసుకువచ్చారు. అప్పటి నుంచి ఇక్కడే పాతుకుపోయిన ఈ గైడ్‌.. క్రమంగా అసిస్టెంట్‌ టూరిజం ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్‌గానూ, తర్వాత టూరిజం మేనేజర్‌గానూ కొనసాగుతున్నాడు. మొదటి నుంచి వివాదాస్పదుడిగా ఉన్న అతనిపై గతంలో అవినీతి ఆరోపణలు రావడంతో పర్యాటకశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ చందనాఖాన్‌ రాయలసీమ జోన్‌కు బదిలీ చేశారు. అయితే ఆ బదిలీని సైతం ఆపేసుకొని.. ఇక్కడే కొనసాగుతూ చక్రం తిప్పేశాడు. గతంలో తొట్లకొండ పర్యాటక క్షేత్రం వద్ద నిబంధనలకు విరుద్ధంగా తన భార్య పేరిట ఓ నిర్మాణం చేపట్టాడు.

దీనిపై అప్పటి కలెక్టర్‌ యువరాజ్‌కు ఫిర్యాదులు రావడంతో వెంటనే జేసీబీతో కూల్చివేయించారు. అలాంటి వ్యక్తికి ఏకంగా ఐటీడీఏ సెల్‌ సీనియర్‌ మేనేజర్‌ కమ్‌ కోర్డినేటర్‌గా బాధ్యతలు కట్టబెట్టడం పర్యాటశాఖ ఉద్యోగుల్లో కలకలం రేపుతోంది. అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగికి ఈ బాధ్యత ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమని స్వయంగా పర్యాటక శాఖ అధికారులే  చెబుతున్నారు. నిబంధనలను అనుసరించాల్సిన ఉన్నతాధికారులు సదరు గైడ్‌కు ‘దాసో’హం అవడం టూరిజం ఉద్యోగులే జీర్ణించుకోలేకపోతుండటం కొసమెరుపు.  

చదవండి: వేల కిలోమిటర్ల నుంచి వస్తున్నాం.. కొన్ని రోజులు ఉండి వెళ్లిపోతాం.. ప్లీజ్‌!

మరిన్ని వార్తలు