డ్రోన్‌ సాగు వచ్చేస్తోంది

27 Jul, 2022 23:00 IST|Sakshi
వరిపంటకు మందును పిచికారి చేస్తున్న డ్రోన్‌ (ఫైల్‌ఫోటో)

ఒక్కో మండలానికి మూడు డ్రోన్లు మంజూరు 

వ్యవసాయం సులభతరం చేసేందుకు ప్రభుత్వం చర్యలు

కాశినాయన: రైతులు ఆధునిక వ్యవసాయంపై అడుగులు వేస్తున్నారు. ఈ దిశగా రైతులను ప్రభుత్వం సైతం ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో డ్రోన్‌ సాగును అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టింది.  రైతులకు రాయితీపై డ్రోన్లను ఇవ్వాలని నిర్ణయించింది. తొలి దశలో మండలానికి మూడు డ్రోన్ల చొప్పున పంపిణీ చేయనుంది.  

డ్రోన్ల వలన రైతులకు కలిగే లాభాలు 
వ్యవసాయం సులభతరం కోసం ప్రభుత్వం రాయితీపై డ్రోన్లను పంపిణీ చేస్తుంది. జిల్లాలోని 51 మండలాల్లో మండలానికి మూడు చొప్పున మంజూరు చేసింది. ఆయా గ్రామాల్లోని ఆర్‌బీకేలలో అధికారులు డ్రోన్ల వినియోగంపై అవగాహన కల్పిస్తున్నారు. పురుగు మందులు, పోషకాలు పిచికారి చేయడానికి డ్రోన్లు ఎంతగానో ఉపయోగపడతాయి.

మందుల పిచికారికి 5 మంది చేసే పనిని డ్రోన్‌ ఒక్కటే చేస్తుంది. అంతేకాకుండా నీరు, మందు ఖర్చును, సమయాన్ని తగ్గించవచ్చు. పొలంలో మొక్కలన్నింటికి సమానంగా మందును పిచికారి చేయవచ్చు. డ్రోన్‌కు అనుసంధానం చేసి స్మార్ట్‌ఫోన్‌ ద్వారా పొలంలో కావాల్సిన చోట డ్రోన్‌ కెమెరాను తిప్పుతూ ఫొటోలు కూడా తీయవచ్చు.  

రాయితీ ఇలా
రైతు సహకార సంఘాల ద్వారా డ్రోన్‌ కొనుగోలు కోసం 40 శాతం వరకు ప్రభుత్వం రాయితీ ఇస్తుంది. ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్నకారు రైతులు, మహిళా రైతులు ఇందుకు అర్హులు. వారు పదవ తరగతి పాసై ఉండాలి. వ్యవసాయ గ్రాడ్యుయేట్లకు (అగ్రికల్చర్, హార్టికల్చర్‌ బీఎస్సీ) 50 శాతం రాయితీ ఇస్తుంది. కాగా ఒక్కో డ్రోన్‌ ధర రూ.6 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఉంటుందని వ్యవసాయాధికారులు వివరిస్తున్నారు. డ్రోన్లు కావాల్సిన రైతులు మండల వ్యవసాయాధికారులను సంప్రదించాల్సి ఉంటుంది.  

ఖర్చు తగ్గుతుంది
రైతులు తమ పొలాలకు పురుగు మందును పిచికారీ చేసేందుకు ఖర్చు తగ్గడంతో పాటు సమయం ఆదా అవుతుంది. మందు పిచికారి పంటకు ఒకే విధంగా పడుతుంది. మండలానికి మూడు డ్రోన్లు మంజూరయ్యాయి. ఎక్కువగా ఒకే పంట సాగు చేసే గ్రామాలకు తొలి విడతలో ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే కోడిగుడ్లపాడు, కొండ్రాజుపల్లె, రంపాడు ఆర్‌బీకేల పరిధిలో ఒకే పంటను ఎక్కువ మోతాదులో సాగు చేయడం వలన వారికి ప్రాధాన్యత ఇస్తున్నాం. మలి విడతలో ప్రతి ఆర్‌బీకేకు డ్రోన్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుంది.  
– జాకీర్‌షరీఫ్, వ్యవసాయాధికారి, కాశినాయన మండలం  

మరిన్ని వార్తలు