ఏపీలోని ప్రైవేట్ ఆస్పత్రులపై విజిలెన్స్ అధికారుల దాడులు

12 May, 2021 20:14 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ కారణంగా రోగులు ఆస్పత్రుల ముందు క్యూ కడుతున్నారు. ఈ  నేపథ్యంలో పలు ప్రైవేట్ ఆస్పత్రులు ప్రభుత్వ నిబంధనలను పక్కన పెట్టి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. దీంతో పలు ఆస్పత్రుల పై విజిలెన్స్ అధికారులు ఆకస్మిక దాడులు జరిపారు. ఈ దాడుల్లో మొత్తం 9 ప్రైవేట్ ఆస్పత్రులపై కేసు నమోదు చేసినట్లు విజిలెన్స్‌ అధికారులు తెలిపారు. రోగుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేయడమే గాక పేషెంట్ల విషయంలో తప్పుడు సమాచారం ఇచ్చినందుకుగాను ఏలూరులోని చైత్ర ఆస్పత్రిపై కేసు నమోదు చేశారు.

అనంతపురం జిల్లాలో రోగుల వద్ద నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తుండడంతో ఆశా ఆస్పత్రిపై కేసు నమోదు చేశారు. విశాఖ ఎస్‌ఆర్ హాస్పిటల్, అనిల్‌ నీరుకొండ కూడా కేసులు నమోదయ్యాయి. ఈ ఆస్పత్రులు అధిక ధరలు వసూలు, రెమిడెసివర్ దుర్వినియోగం చేస్తుండడంతో వాటిపై కేసులు నమోదయ్యాయి.

పలువురు ఆస్పత్రిలపై కేసు నమోదు
విశాఖలోని రమ్య ఆస్పత్రి యాజమాన్యం అనుమతులు లేకుండా కోవిడ్ వైద్యం చేస్తున్నారని కేసు నమోదు చేశారు. విజయవాడ శ్రీరామ్ ఆస్పత్రిపైన కేసు నమోదు అయ్యింది. గుంటూరు విశ్వాస్ హాస్పటల్‌ లో అనుమతి లేకుండా వైద్యం చేయడమే కాకుండా అధిక ఫీజు వసూలు చేస్తున్నారు. పీలేరు ప్రసాద్ హాస్పటల్‌ యాజమాన్యం అధిక ఫీజు వసూలు, ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయడం లేదు. ఇలా పలు రకాల కారణంగా ఈ ఆస్పత్రులపై అధికారులు కేసులు నమోదు చేశారు. అయితే ఇప్పటివరకు రాష్ట్రంలో 37 ప్రైవేట్ ఆస్పత్రులపై విజిలెన్స్‌ అధికారులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

(చదవండి: అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం )

మరిన్ని వార్తలు