-

Ap: విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌.. 25న హెచ్‌సీఎల్‌ ‘వాక్‌ ఇన్‌ డ్రైవ్‌’

17 Jun, 2022 10:50 IST|Sakshi

విజయవాడలో నిర్వహిస్తున్నట్లు హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ వెల్లడి

సాక్షి, అమరావతి: టెక్‌బీ శిక్షణ కోసం ఏపీ నుంచి ఈ ఏడాది 1,500 మంది ఇంటర్‌ విద్యార్థులను ఎంపిక చేయనున్నట్లు హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ ప్రకటించింది. ఇందుకోసం ఈనెల 25న విజయవాడలో వాక్‌ ఇన్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ వైస్‌ ప్రెసిడెంట్‌ సుబ్బరామన్‌ తెలిపారు. ఈ వివరాలను గురువారం విజయవాడలో ఆయన మీడియాకు వెల్లడించారు. 2021లో మ్యాథమెటిక్స్‌ లేదా బిజినెస్‌ మ్యాథమెటిక్స్‌తో 12వ తరగతి(ఇంటర్మీడియట్‌) పూర్తి చేసినవారు.. అలాగే 2022లో 12వ తరగతికి హాజరవుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. వాక్‌ ఇన్‌ డ్రైవ్‌లో ఎంపికైన విద్యార్థులకు 12 నెలల పాటు శిక్షణ అందించడంతో పాటు ఇంటర్న్‌షిప్‌ చేసే అవకాశం కూడా కల్పిస్తామని చెప్పారు.

టెక్‌బీ శిక్షణ పూర్తి చేసిన వారికి ఏడాదికి రూ.1.70 లక్షల నుంచి రూ.2.20 లక్షల వేతనంతో ఉద్యోగం లభిస్తుందన్నారు. హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ వద్ద పనిచేస్తూనే బిట్స్‌ పిలానీ, శాస్త్ర, అమిటీ వంటి ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో అండర్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీని కూడా పూర్తి చేసే అవకాశం కల్పిస్తామని చెప్పారు. అర్హత కలిగిన వారు ఆన్‌లైన్‌ కెరీర్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌(హెచ్‌సీఎల్‌ క్యాట్‌)కు హాజరవ్వాల్సి ఉంటుందని, ఇందులో ప్రతిభ కనబరిచిన వారిని ఇంటర్వ్యూకు పిలుస్తామని తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమానికి రూ.లక్ష ఫీజు ఉంటుందని, దీనికి పన్నులు అదనమని పేర్కొన్నారు. ఫీజును నెలవారీ వాయిదాల్లో తీర్చే విధంగా రుణ సౌకర్యం కూడా కల్పిస్తామని పేర్కొన్నారు. 2017లో ప్రారంభించిన టెక్‌బీ కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు 7,000 మంది విద్యార్థులకు ఉపాధి కల్పించినట్లు వెల్లడించారు. మరింత సమాచారం కోసం www.hcltechbee.com వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు. 

మరిన్ని వార్తలు