వర్షాకాలమా? ఎండాకాలమా?

5 Aug, 2021 04:07 IST|Sakshi

రాష్ట్రంలో ఠారెత్తిస్తున్న ఎండలు

సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ పై వరుసగా మూడో రోజూ భానుడు ప్రతాపం చూపించాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 6 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఆగస్టులో గతంలో ఎన్నడూ లేనంతగా పలుచోట్ల రికార్డు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. విశాఖలో 1989 ఆగస్టు తర్వాత రికార్డు స్థాయిలో 39 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. తునిలో సాధారణం కంటే 6.5 డిగ్రీలు అత్యధికంగా 39.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

విశాఖలో 39.0, బాపట్లలో 38.2, నెల్లూరులో 38 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ వారం చివరి వరకు ఇవే పరిస్థితులుంటాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇదిలా ఉండగా, ఏపీ తీరంలో బుధవారం స్వల్ప ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీనివల్ల అక్కడక్కడా తేలికపాటి వానలు కురిసి.. ఎండల నుంచి కొంత ఉపశమనాన్ని అందించాయి. మరోవైపు మచిలీపట్నం సమీపంలో ఈనెల 8న అల్పపీడనం ఏర్పడి క్రమంగా బలహీనపడనుంది. ఆ తర్వాత 12న మరో అల్పపీడనం ఏర్పడి రాష్ట్రం మీదుగా కదులుతూ ఛత్తీస్‌గఢ్‌ వైపు ప్రయాణించనుంది. వీటి వల్ల వర్షాలు విస్తరించే సూచనలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.  

మరిన్ని వార్తలు