‘ఆమె’దే పైచేయి

10 Apr, 2022 02:51 IST|Sakshi

నిర్ణయాత్మక శక్తిలో తిరుగులేని ఏపీ మహిళలు

సీనియర్‌ అధికారులు, మేనేజర్లు వంటి నిర్ణయాత్మక పదవులు

దేశ సగటు, పెద్ద రాష్ట్రాల్లోకన్నా ఏపీ మహిళలే ముందంజ

రాష్ట్రంలో 47.9 శాతం మహిళలదే నాయకత్వం.. 

దేశం మొత్తంలో మహిళా నాయకత్వం 23.2 శాతమే

కేంద్ర గణాంక మంత్రిత్వ శాఖ వెల్లడి

ఇదివరకెన్నడూ లేని విధంగా రాజకీయంగానూ అందలం

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మహిళలు తిరుగులేని శక్తిగా ఉన్నారు. నిర్ణయాత్మక స్థానాలు, కీలకమైన పదవుల్లో ఏపీ మహిళలది దేశంలోనే అగ్రస్థానం. కేంద్ర కార్యక్రమాల అమలు, గణాంకాల మంత్రిత్వ శాఖ ‘భారత దేశంలో వివిధ రంగాల్లో మహిళలు, పురుషులు’ అనే నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పడగానే, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్ని రంగాల్లో మహిళలకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారు.

నామినేటెడ్‌ పదవులతో పాటు పలు కీలకమైన స్థానాల్లో మహిళలకు అవకాశాలిస్తున్నారు. దీంతో పలు కీలక పదవులు, సాధారణ హోదా, సీనియర్‌ అధికారులు, మేనేజర్లు, చట్టసభల్లో పురుషులతో పోలిస్తే రాష్ట్రంలో మహిళలు అగ్రస్థానంలో నిలుస్తున్నారు. రాష్ట్రంలో ప్రతి వంద మందిలో 47.9 శాతం మంది మహిళలే నిర్ణయాలు తీసుకునే నాయకత్వ స్థానాల్లో ఉన్నారని కేంద్ర మంత్రిత్వ శాఖ నివేదిక పేర్కొంది. ఇందులో పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంత మహిళలే అత్యధికంగా ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి వంద మందిలో 51.6 శాతం మంది మహిళలు నాయకత్వ స్థానాల్లో ఉండగా, పట్టణ ప్రాంతాల్లో 43.1% మంది మహిళలే ఉన్నారని నివేదిక పేర్కొంది.

2019–20లో మొత్తం దేశంలో సాధారణ హోదా, సీనియర్‌ అధికారులు,  మేనేజర్లు, చట్టసభ సభ్యుల్లో వంద మందిలో 23.2 శాతమే మహిళలు నిర్ణయాత్మక స్థానంలో ఉన్నట్లు పేర్కొంది. ఇందులో దేశం మొత్తంలో గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు 27.4 శాతం ఉండగా పట్టణ ప్రాంతాల్లో మహిళలు 19.7 శాతం ఉన్నట్లు  వెల్లడించింది. అంటే దేశ సగటును మించి రాష్ట్రంలో మహిళలు నాయకత్వం, నిర్ణయాత్మక శక్తిలో అగ్రస్థానంలో ఉన్నట్లు స్పష్టమైంది. అలాగే దేశంలోని మిగతా పెద్ద రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లతో పోల్చి చూసినా ఏపీ మహిళలే అత్యధికంగా నిర్ణయాత్మక స్థానాల్లో ఉన్నట్లు నివేదిక తెలిపింది.

రాష్ట్ర అసెంబ్లీలో ఏకంగా 15 మంది మహిళా శాసన సభ్యులున్నారు. ఇందులో వైఎస్సార్‌సీపీ నుంచి 14 మంది, ఒకరు టీడీపీ నుంచి ఉన్నారు. శాసన మండలిలో నామినేటెడ్‌తో కలిపి నలుగురు మహిళా ఎమ్మెల్సీలు ఉన్నారు. ఏపీ నుంచి లోక్‌సభకు ఎన్నికైన పార్లమెంట్‌ సభ్యుల్లో నలుగురు వైఎస్సార్‌సీపీ మహిళా ఎంపీలున్నారు. రాష్ట్రంలో వివిధ సంస్థల్లో మేనేజర్, సీనియర్‌ అధికారులు, సాధారణ హోదాలోనూ మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో ఎక్కువ మంది మహిళలున్నట్లు నివేదిక తెలిపింది. వీరంతా నిర్ణయాలు తీసుకోవడంలో ముందున్నట్లు నివేదిక స్పష్టం చేసింది. 

కీలక పదవుల్లో మహిళలు
► రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా తొలిసారిగా నీలం సాహ్నికి స్థానం కల్పించి రికార్డు సృష్టించారు. ఉద్యోగ విరమణ అనంతరం కూడా ఆమెను రాష్ట్ర ఎన్నికల అధికారిగా నియమించి మహిళా పక్షపాత ప్రభుత్వంగా చాటుకున్నారు. 
► హోం శాఖ మంత్రిగా తొలిసారి ఎస్సీ మహిళ మేకతోటి సుచరితను నియమించారు. ఎస్టీ మహిళ పుష్ప శ్రీవాణిని డిప్యూటీ సీఎం చేశారు. మరో మహిళ తానేటి వనితకు మంత్రిగా అవకాశం కల్పించారు.
► శాసనమండలి వైస్‌ చైర్‌పర్సన్‌గా మైనార్టీ మహిళ జకియా ఖానంను నియమించారు.
► జిల్లా పరిషత్‌ ఎన్నికలకు సంబంధించి సరిగ్గా సగం జెడ్పీటీసీ స్థానాలను మహిళలకు కేటాయించారు. అదే రీతిలో మండల పరిషత్‌ ఎన్నికల్లోనూ ఎంపీపీలుగా, ఎంపీటీసీ సభ్యులుగా సగం మంది మహిళలకు స్థానం కల్పించారు. 
► కార్పొరేషన్, మున్సిపాలిటీలు, నగర పంచాయతీ ఎన్నికల్లోనూ ఇదే ఒరవడి కొనసాగించారు. తుదకు సర్పంచ్‌ స్థానాల్లో కూడా అధికంగా వారికే కేటాయించేలా చర్యలు తీసుకున్నారు. 

నామినేటెడ్‌ పదవుల్లోనూ అదే ఒరవడి 
► రాష్ట్రంలో 196 వ్యవసాయ మార్కెటింగ్‌ కమిటీ చైర్మన్‌ పదవుల్లో సరిగ్గా సగం మహిళలకు కేటాయించారు. వివిధ ప్రభుత్వ కార్పొరేషన్‌లకు సంబంధించి 137 చైర్మన్‌ పదవుల్లో, ఆయా కార్పొరేషన్లలోని 484 డైరెక్టర్‌ పదవుల్లో వీరికే పెద్దపీట వేశారు. 
► ప్రత్యేకంగా బీసీల కోసం 56 కార్పొరేషన్‌లు, మూడు ఎస్సీ కార్పొరేషన్‌లు, ఒక ఎస్టీ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయడం ఒక చరిత్ర అయితే, వీటిలో సరిగ్గా సగానికిపైగా పదవుల్లో మహిళలకు స్థానం కల్పించడం మరో రికార్డు. 
► పెద్ద సంఖ్యలో ఆలయ కమిటీల్లోనూ మహిళలకు స్థానం కల్పించిన ఘనత వైఎస్‌ జగన్‌ ప్రభుత్వానికే దక్కింది. వీటన్నింటికి తోడు అన్ని ప్రభుత్వ పథకాల్లో లబ్ధిదారులుగా మహిళలకే అవకాశం ఇవ్వడం వల్ల వేలాది మంది సొంత కాళ్లపై నిలబడటమే కాక.. నాయకత్వ లక్షణాలు చాటుకుంటూ మరెంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారు.  

మరిన్ని వార్తలు