AP: కొలువు తీరిన నూతన మంత్రివర్గం

11 Apr, 2022 12:58 IST|Sakshi
కొత్త మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమానికి సచివాలయం సమీపంలో ముస్తాబైన వేదిక

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కొత్త మంత్రివర్గం సోమవారం కొలువు తీరింది. 25 మంది కొత్త మంత్రుల చేత రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ సోమవారం ప్రమాణ స్వీకారం చేయించారు. అక్షర క్రమంలో కొత్త మంత్రుల పేర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ సమీర్‌ శర్మ చదువుతూ ఉండగా.. ఆ ప్రకారం వారితో గవర్నర్‌ ప్రమాణ స్వీకారం చేయించారు.ప్రమాణ స్వీకారం అనంతరం గవర్నర్, ముఖ్యమంత్రితో మంత్రులుగ్రూపు ఫొటో దిగారు. ఆ వెంటనే సచివాలయంలో గవర్నర్, సీఎం, కొత్త, పాత మంత్రులు, అధికారులకు తేనీటి విందుకు హాజరయ్యారు.

కాగా, ఆదివారం రాత్రి కొత్త మంత్రులు జాబితాను సీఎం కార్యాలయం గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌కు పంపించింది. అంతకు ముందే గవర్నర్‌ 24 మంది పాత మంత్రుల రాజీనామాలకు ఆమోదం తెలిపారు. ఈ మేరకు గవర్నర్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధికారికంగా పత్రికా ప్రకటన జారీ చేశారు. ముఖ్యమంత్రి సూచన మేరకు 24 మంది మంత్రుల రాజీనామాలను గవర్నర్‌ ఆమోదించారని, ఇది వెంటనే అమల్లోకి వచ్చిందని ఆ ప్రకటనలో తెలిపారు. 

కొత్త వారు 14 మందికి స్థానం 
సరిగ్గా 34 నెలల రెండు రోజులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మంత్రివర్గాన్ని పునర్‌ వ్యవస్థీకరించారు. అధికారం చేపట్టిన కొత్తలోనే.. రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గాన్ని పునర్‌ వ్యవస్థీకరిస్తానని సీఎం బహిరంగంగా చెప్పిన విషయం తెలిసిందే. అయితే కోవిడ్‌ సంక్షోభం నేపథ్యంలో కొంత జాప్యం చోటుచేసుకున్నప్పటికీ, ఈ నెల 7వ తేదీన 24 మంది మంత్రులు రాజీనామాలు సమర్పించారు. అనుభవం, సామాజిక సమీకరణలు దృష్టిలో ఉంచుకుని సీఎం వైఎస్‌ జగన్‌.. పాత, కొత్త కలయికతో కొత్త మంత్రివర్గాన్ని కూర్పు చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు, మహిళలకు మంత్రివర్గంలో పెద్దపీట వేశారు. పాత మంత్రివర్గంలోని 11 మందిని మళ్లీ మంత్రివర్గంలో తీసుకుంటుండగా, కొత్తగా 14 మందికి స్థానం కల్పించారు.    

మరిన్ని వార్తలు