అమరావతిని మరో హైదరాబాద్‌ చేస్తారా? 

15 Sep, 2022 04:14 IST|Sakshi
సంఘటితంగా నినాదాలిస్తున్న ఆచార్యులు, ఉద్యోగులు, పరిశోధకులు

బూటకపు పాదయాత్రను అడ్డుకుంటాం 

నినదించిన ఏయూ ఆచార్యులు, ఉద్యోగులు, పరిశోధకులు 

17, 19 తేదీల్లో విద్యార్థులతో నిరసన 

ఏయూక్యాంపస్‌: రైతుల పేరుతో చేపట్టిన బూటకపు పాదయాత్రను అడ్డుకుంటామని ఆంధ్రా యూనివర్సిటీ (ఏయూ) ఆచార్యులు, ఉద్యోగులు, పరిశోధకులు నినదించారు. గతంలో హైదరాబాద్‌ను అభివృద్ధి చేసి ఎంతో నష్టపోయామన్నారు. టీడీపీ నాయకులు అమరావతిని మరో హైదరాబాద్‌గా మార్చాలని ప్రయత్నించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. దీనికి కొన్ని రాజకీయ పార్టీలు వంతపాడటం రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవడమేనని చెప్పారు.

విశాఖపట్నంలోని ఏయూలో జ్యోతిరావుపూలే విగ్రహం వద్ద బుధవారం వారు సమావేశమయ్యారు. మూడు రాజధానులకే తమ మద్దతని చెప్పారు. ఈ సందర్భంగా వర్సిటీ విద్య విభాగాధిపతి డాక్టర్‌ టి.షారోన్‌రాజు విలేకరులతో మాట్లాడుతూ కొంతమంది రియల్టర్లు, పెట్టుబడిదారులు చేస్తున్న ఈ యాత్రను తాము అడ్డుకుంటామన్నారు. అధికార వికేంద్రీకరణతో రాష్ట్ర సమగ్ర వికాసం సాధ్యపడుతుందన్నారు. మూడు రాజధానులతో రాష్ట్రంలో మూడు ప్రాంతాలు ఎంతో అభివృద్ధి సాధిస్తాయని చెప్పారు.

ఏయూ ఉద్యోగ సంఘం నాయకుడు డాక్టర్‌ జి.రవికుమార్‌ మాట్లాడుతూ పారిశ్రామిక, ఐటీ, వాణిజ్య, వ్యవసాయ రంగాల్లో విరాజిల్లుతున్న విశాఖను పరిపాలన రాజధానిగా చేసుకోవడం ఎంతో అవసరమని చెప్పారు. ఉత్తరాంధ్ర విద్యార్థులకు మెరుగైన అవకాశాలు రావడానికి మూడు రాజధానుల నిర్ణయం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. మూడు ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు.

అమరావతిలో జరుగుతున్న ఉద్యమం కేవలం తాత్కాలికంగా పెట్టుబడిదారులు నడిపిస్తున్న ఉద్యమంగా కనిపిస్తోందన్నారు. విద్యార్థి జేఏసీ కన్వీనర్‌ బి.కాంతారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలని కోరారు. తద్వారా ఉత్తరాంధ్ర వలసలు తగ్గి, స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్నారు. రాజధాని ఏర్పాటుకు ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. దీన్ని అడ్డుకునే విధంగా బూటకపు పాదయాత్రలు చేయడం సరికాదని చెప్పారు.

టీడీపీ నాయకులు ఈ ప్రాంత ప్రజల ఓట్లతో గెలిచి వారి మనోభావాలను గౌరవించకపోవడం విచారకరమన్నారు. వారు వెంటనే స్పష్టమైన వైఖరి తెలిపాలని కోరారు. విశాఖ జిల్లాలోకి పాదయాత్రను ఎట్టిపరిస్థితుల్లోను  అడుగు పెట్టనివ్వబోమని స్పష్టం చేశారు. ఈ నెల 17న జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద, 19వ తేదీన ఎన్‌ఏడీ కూడలి వద్ద విద్యార్థులతో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. డాక్టర్‌ ఎం.కళ్యాణ్, డాక్టర్‌ శాంతారావు, మురళి, విద్యార్థులు సాయికృష్ణ, భరత్, నవీన్‌దాస్, బాలాజీ, శివ, పృధ్వీ, మాధవ్‌రెడ్డి, రామ్‌కుమార్‌రెడ్డి, జగన్, సోమశేఖర్‌ పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు