Andhra University: ఏయూ దూరవిద్య.. మరింత చేరువ

10 Sep, 2022 14:46 IST|Sakshi

ఆన్‌లైన్‌ విధానంలో ప్రవేశాలు

సెమిస్టర్‌ విధానం అమలు

ఏయూ క్యాంపస్‌ (విశాఖ తూర్పు): దూరవిద్య విధానం ద్వారా అందరికీ నాణ్యమైన విద్యను చేరువ చేయడమే లక్ష్యంగా ఆంధ్రా విశ్వవిద్యాలయం (ఏయూ) పనిచేస్తోంది. విద్యార్థులు దేశంలో ఎక్కడ నుంచైనా సేవలు పొందే దిశగా మరో అడుగు ముందుకేసింది. ఇప్పటికే ఆన్‌లైన్‌లో బీకామ్, ఎంఏ సోషియాలజీ కోర్సులను అందిస్తున్న ఏయూ దూరవిద్య కేంద్రం మరిన్ని సేవలను విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చింది.

ప్రస్తుతం అందిస్తున్న డిగ్రీ, పీజీ కోర్సుల ప్రవేశాలు, పరీక్షలకు దరఖాస్తు, ఫీజుల చెల్లించడం వంటి వాటిని ఆన్‌లైన్‌లోనే చేసేలా చర్యలు తీసుకుంది. ఇప్పటికే సెప్టెంబర్‌ 5న ప్రవేశాల నోటిఫికేషన్‌ విడుదల చేయగా ఆన్‌లైన్‌లో 250 మంది దరఖాస్తు చేసుకున్నారు. అక్టోబర్‌ 25 వరకు దరఖాస్తుకు అవకాశముంది. ఈ దూర విద్యా కోర్సులకు రెగ్యులర్‌ కోర్సుల తరహాలోనే సెమిస్టర్‌ విధానం ఉంటుంది. అదేవిధంగా గ్రేడింగ్‌ విధానం కూడా ప్రవేశపెట్టారు.

విద్యార్థుల ముంగిటకే సేవలు
గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు సైతం సులువుగా తమకు నచ్చిన కోర్సులను అభ్యసించేలా ఆన్‌లైన్‌లో ప్రవేశాలు పొందే అవకాశం ఏయూ కల్పిస్తోంది. దీనిలో భాగంగా విద్యార్థులు  andhrauniversity.edu.inలో నిర్దేశిత లింక్‌ను క్లిక్‌ చేయాలి. అనంతరం లెర్నర్‌ ఎన్‌రోల్‌మెంట్‌పై క్లిక్‌ చేయాలి. అక్కడ విద్యార్థులు తమ వ్యక్తిగత, సామాజిక, విద్యా సంబంధ వివరాలు సమర్పించాలి.

అలాగే పదో తరగతి, కులధ్రువీకరణ, విద్యార్హత తెలిపే సర్టిఫికెట్లు అప్‌లోడ్‌ చేయాలి. దీంతో దరఖాస్తు చేయడం పూర్తవుతుంది. ఆ తర్వాత కోర్సుల వారీగా నిర్దేశిత ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. తర్వాత వర్సిటీ అధికారులు.. విద్యార్థుల దరఖాస్తు, తదితర వివరాలను పరిశీలించి.. అర్హత ఉన్నట్లయితే ప్రవేశాన్ని ధ్రువీకరిస్తారు. ఫోన్‌లో ఇంటర్నెట్‌ ద్వారా కూడా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థి దూరవిద్యా కేంద్రానికి రావాల్సిన అవసరం లేదు. 

మరిన్ని వార్తలు