అంగన్‌వాడీ హెల్పర్‌ ఆశాజ్యోతి దారుణ హత్య.. అనుమానమే ప్రాణం తీసిందా?

13 Dec, 2022 05:07 IST|Sakshi

తాళ్లపూడి: కట్టుకున్న భర్తే ఆమె పాలిట కాలయముడయ్యాడు. భార్యను కర్కశంగా కత్తితో నరికి చంపి ముగ్గురు పిల్లలను అనాథలను చేశాడు. అంగన్‌వాడీ హెల్పర్‌ హత్య పశ్చిమ గోదావరి జిల్లాలోని కుకునూరులో సంచలనమైంది. భార్యపై అనుమానంతో మెడపై కత్తితో నరికిన నిందితుడు పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయాడు. 

తాళ్లపూడి ఎస్సై కె.వెంకటరమణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తాళ్లపూడి పరిధిలోని కుకునూరు అంగన్‌వాడీ కేంద్రంలో ఆయాగా పనిచేస్తున్న ఆటపాకల ఆశాజ్యోతి(30) తన ముగ్గురు పిల్లలతో నివాసం ఉంటోంది. భర్త ఆటపాకల వీర వెంకట సత్యనారాయణతో విభేదాలు రావడంతో కొంతకాలంగా దూరంగా ఉంటోంది. ఇటీవల మళ్లీ పిల్లల కోసమని వచ్చి భార్యా పిల్లలతో కలసి ఉంటున్నాడు. సోమవారం ఉదయం పిల్లలు స్కూలుకు వెళ్లే సమయంలో భార్య ఆశాజ్యోతితో గొడవ పడి కత్తితో ఆమె మెడపై, గొంతుపై నరికి హత్యచేశాడు. తీవ్ర రక్త స్రావం అయి రక్తపు మడుగులో గిలగిలా కొట్టుకుని ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. 

తన కుమార్తెపై అనుమానంతో అల్లుడు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడని మృతురాలి తండ్రి పెద్దాడ నారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై కె.వెంకటరమణ కేసు నమోదు చేశారు. కొవ్వూరు రూరల్‌ సీఐ కేవీ రమణ కేసును దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. కొవ్వూరు డీఎస్పీ సత్యనారాయణవర్మ ఆధ్వర్యంలో ఘటనా ప్రదేశంలో వివరాలను సేకరించారు. మృతదేహాన్ని కొవ్వూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 

పిల్లలు కన్నీరుమున్నీరు 
ఆశాజ్యోతి దంపతులకు ముగ్గురు పిల్లలు. ప్రభుత్వ పాఠశాలలో సురేంద్ర 8వ తరగతి, తేజ 5వ తరగతి, గోపి దుర్గ నాలుగో తరగతి చదువుతున్నారు. తల్లి మృతితో వీరు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తమ ఆలనా పాలనా చూసే తల్లి తమ కళ్ల ముందే మృత్యు వాత పడడంతో వారు జీరి్ణంచుకోలేకపోతున్నారు. వీరి పరిస్థితి చూసి పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని అంగన్‌వాడీ వర్కర్లు ఆశాజ్యోతి మృతదేహానికి నివాళులు అరి్పంచారు.  

మరిన్ని వార్తలు