అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి సిద్ధం

5 Jul, 2021 08:38 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఆమోద ముద్ర వేసిన కలెక్టర్‌ 

త్వరలో 250 పోస్టులకు నోటిఫికేషన్‌

 రోస్టర్‌ కం మెరిట్‌ విధానంలో ఎంపిక  

సాక్షి, అమరావతి బ్యూరో: అంగన్‌వాడీ కేంద్రాల రూపురేఖలు మార్చి వాటిని ప్రీప్రైమరీ స్కూళ్లుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇప్పటికే నాడు–నేడు పథకం ద్వారా ఈ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పిస్తోంది. దీనిలో భాగంగానే అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకుల పోస్టుల భర్తీకీ కార్యాచరణ చేపట్టింది. ఈ మేరకు సర్కారు నుంచి ఆదేశాలు రావడంతో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ నోటిఫికేషన్‌ రూపొందించి 250 పోస్టుల భర్తీకి కలెక్టర్‌ ఆమోదాన్నీ పొందింది. డివిజన్ల వారీగా త్వరలో నోటిఫికేషన్‌ జారీకి చర్యలు ప్రారంభించింది. ఈ పోస్టులకు రోస్టర్‌ పాయింట్ల ఆధారంగా రిజర్వేషన్లు కేటాయించనున్నారు. రోస్టర్, మెరిట్‌ ప్రకారం పోస్టుల భర్తీకి రంగం సిద్ధం చేస్తున్నారు.

250 ఉద్యోగాలు ఖాళీ  
జిల్లాలో 23 ఐసీడీఎస్‌ ప్రాజెక్టులు ఉండగా వీటి పరిధిలో మొత్తం 4,405 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 4,351 ప్రధాన కేంద్రాలు, 54 మినీ కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాల ద్వారా 7 నెలల నుంచి 3 ఏళ్ల మధ్య ఉన్న చిన్నారులు 1,42,196 మంది, 3 ఏళ్ల నుంచి 6 ఏళ్ల మధ్య ఉన్న పిల్లలు 85,328 మంది, బాలింతలు, గర్భిణులు మరో 61,818 మంది లబ్ధిపొందుతున్నారు. జిల్లాలో 50 అంగన్‌వాడీ కార్యకర్తలు, 200 సహాయకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.     

కలెక్టర్‌ చైర్మన్‌గా నియామక కమిటీ 
ఈ పోస్టుల భర్తీకి కలెక్టర్‌ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు కానుంది. ఈ కమిటీలో మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారి కనీ్వనర్‌గా, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి, ఆర్డీఓ, సంబంధిత ప్రాజెక్ట్‌ సీడీపీఓలు సభ్యులుగా ఉండనున్నారు. ఎస్సీ, ఎస్టీ హాబిటేషన్లలో ఖాళీగా ఉన్న పోస్టులను ఆయా సామాజిక వర్గాలకు చెందిన అభ్యర్థులతోనే భర్తీ చేయాల్సి ఉంటుంది. మిగిలిన ఖాళీలకు రిజర్వేషన్‌ ప్రక్రియను అనుసరించి అర్హులను ఎంపిక చేయనున్నారు. 

అభ్యర్థికి ఉండాల్సిన అర్హతలు ఇలా..  

  • ఈ ఏడాది జూలై 1వ తేదీకి 21 నుంచి 35 ఏళ్ల మధ్యలో ఉండాలి. 
  • పోస్టు ఖాళీ ఉన్న ప్రాంతానికి చెందిన వివాహితై ఉండాలి 
  •  అంగన్‌వాడీ కార్యకర్త పోస్టుకు తప్పనిసరిగా 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ట్రైబల్‌ ఏరియాల్లో కొంత వెసులుబాటు ఉంది. 
  • అంగన్‌వాడీ ఆయా పోస్టుకు ఏడో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.  

పారదర్శకంగా భర్తీ  
కలెక్టర్‌ ఆమోదం తెలపడంతో త్వరలోనే నోటిఫికేషన్‌ జారీ చేయనున్నాం.  రెవెన్యూ డివిజన్ల వారీగా ఖాళీలను ఆర్డీఓలకు పంపాం.  వారితో సమన్వయం చేసుకుని వీలైనంత త్వరగా భర్తీ ప్రక్రియ చేపడతాం. నియామకాలు పారదర్శకంగా నిబంధనల ప్రకారమే జరుగుతాయి. ఎవరూ దళారులను నమ్మొద్దు.   
– మనోరంజని, పీడీ, ఐసీడీఎస్, గుంటూరు 

మరిన్ని వార్తలు