15లోగా 100% మొదటి డోసు పూర్తవ్వాలి 

1 Dec, 2021 02:52 IST|Sakshi

కలెక్టర్లు, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశిస్తూ సింఘాల్‌ ఉత్తర్వులు 

ఒమిక్రాన్‌ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో.. 

సాక్షి, అమరావతి: కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు అప్రమత్తత చర్యలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో 18 ఏళ్లు పైబడిన వారందరికీ డిసెంబరు 15వ తేదీ లోపు మొదటి డోసు టీకా వేయడం 100 శాతం పూర్తి చేయాలని వైద్య శాఖ అధికారులను ఆదేశిస్తూ వైద్య, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అనీల్‌కుమార్‌ సింఘాల్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ వివరాలు.. టీకా బృందాలు ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టి ప్రతి ఇంటికీ వెళ్లి టీకా వేసుకోని వారిని గుర్తించి టీకాలు వేయాలి.

జిల్లా కలెక్టర్లు కరోనా నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలి. ప్రజలంతా మాస్క్‌ ధరించడం తప్పనిసరి చేయాలి. ఎవరైనా మాస్క్‌ ధరించకపోయినా, వ్యాపార, వాణిజ్య, ఇతర సంస్థలు కరోనా నిబంధనలు పాటించకపోయినా జరిమానా విధించాలి. కరోనా నిబంధనలు పాటిస్తూ పరిమిత సంఖ్యలో వ్యక్తులతోనే పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు నిర్వహించేలా అధికార యంత్రాంగం దృష్టి సారించాలి.   

► ఒమిక్రాన్‌ కేసులు నమోదైన యూకే, యూరప్, సౌత్‌ ఆఫ్రికా, బ్రెజిల్, బంగ్లాదేశ్, బోట్స్‌వానా, చైనా, మారిషస్, న్యూజిలాండ్, జింబాబ్వే, సింగపూర్, హాంకాంగ్, ఇజ్రాయేల్‌ దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులతో పాటు, వీరి సన్నిహితులపై ప్రత్యేక నిఘా ఉంచాలి.
► చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లలోని ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుల్లో నెల్లూరు, అనంతపురం, గుంటూరు జిల్లాల కలెక్టర్లు హెల్ప్‌ డెస్క్‌లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలి.   

మరిన్ని వార్తలు