అనాథ పిల్లల పేరున రూ.10 లక్షల డిపాజిట్‌: సింఘాల్‌

19 May, 2021 19:09 IST|Sakshi

సాక్షి, అమరావతి: కరోనా బాధితులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నట్లు వైద్య ఆరోగ్య ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ వెల్లడించారు. బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సను ప్రభుత్వం ఆరోగ్యశ్రీలో చేర్చినట్లు బుధవారం ఆయన మీడియా సమావేశంలో తెలియజేశారు. కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల పేరుపై ప్రభుత్వం రూ.10 లక్షల డిపాజిట్‌ చేయనుందని తెలిపారు. ఆ మొత్తంపై వచ్చే వడ్డీని ప్రతినెలా లబ్దిదారులకు అందించేలా కార్యాచరణ రూపొం‍దించినట్లు సింఘాల్‌ తెలిపారు. 

ప్రభుత్వాస్పత్రుల్లో 21,493 రెమిడెసివిర్‌ ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. ఆక్సిజన్‌ రోజువారి గరిష్ట వినియోగం 650 మెట్రిక్‌ టన్నులు కాగా అందుబాటులో 635 మెట్రిక్‌ టన్నుల నిల్వ సామర్థ్యం ఉన్నట్లు చెప్పారు. ఆక్సిజన్‌ రవాణా కోసం 78 ట్యాంకర్లు, 14 చిన్న ట్యాంకర్లు అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. 4+2 ఐఎస్‌ఓ ట్యాంకర్లు కలిగిన 2 ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. ఇందులో ప్రతి ట్యాంకర్‌కు 20 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ సామర్థ్యం ఉంటుందని  తెలిపారు.

ఏపీలో కొత్తగా 23,160 కరోనా పాజిటివ్‌ కేసులు
ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 1,01,330 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 23,160 మందికి పాజిటివ్‌గా నిర్థారణ కాగా 106 మరణాలు సంభవించాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బుధవారం సాయంత్రం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.  గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని  24,819 మంది డిశ్చార్జ్‌ కాగా, ఇప్పటివరకు 12,79,110 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఏపీలో ప్రస్తుతం 2,09,736 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,82,41,637మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. 

గత 24 గంటల్లో కరోనా బారినపడి మరణించినవారి వివరాలు.. చిత్తూరు, కృష్ణా, విజయనగరం జిల్లాల్లో 10 మంది చొప్పున.. తూర్పుగోదావరి, ప్రకాశం జిల్లాల్లో తొమ్మిది మంది చొప్పున.. అనంతపురం, గుంటూరు, విశాఖ, ప.గో.జిల్లాల్లో 8 మంది చొప్పున.. కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లో ఆరుగురు చొప్పున.. నెల్లూరు జిల్లాలో ఐదుగురు.. వైఎస్సార్‌ కడప జిల్లాలో ఇద్దరు చొప్పున మృతి చెందారు.

గత 24 గంటల్లో జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసుల వివరాలు.. శ్రీకాకుళం- 1466, విజయనగరం- 965, విశాఖ- 2368 కేసులు, తూ.గో- 2923, ప.గో- 1762, కృష్ణా- 1048, గుంటూరు- 1291 కేసులు, ప్రకాశం- 785, నెల్లూరు- 1251, చిత్తూరు- 2630 కేసులు, అనంతపురం- 2804, కర్నూలు- 991, వైఎస్ఆర్ జిల్లా- 1036 కేసులు నమోదయ్యాయి.  


చదవండి: ఏపీలో కొత్త మెడికల్‌ ఆక్సిజన్‌ పాలసీ

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు