అవాస్తవాలు నమ్మొద్దు: ఎ.కె.సింఘాల్‌

18 May, 2021 19:28 IST|Sakshi

కరోనా కేసులపై ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారు

కర్ఫ్యూ టైమింగ్సులో ఎలాంటి మార్పులు లేవు

వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎ.కె.సింఘాల్‌

సాక్షి, అమరావతి: కరోనా కేసులపై ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ అన్నారు. సోషల్‌ మీడియాలో అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని.. రూమర్స్‌ను నమ్మొద్దని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కర్ఫ్యూ టైమింగ్సులో ఎలాంటి మార్పులు లేవని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 85 శాతం ఫీవర్ సర్వే పూర్తి అయ్యిందని వెల్లడించారు.

రాష్ట్రవ్యాప్తంగా ఐసీయూ బెడ్స్ 744, ఆక్సిజన్ బెడ్లు 551 అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఏపీలో ఎక్కడా బెడ్స్ కొరత లేదన్నారు. ఫీవర్ సర్వేలో 90 వేల మంది కరోనా అనుమానితులను గుర్తించామన్నారు. కరోనా ట్రీట్మెంట్ ప్రొటోకాల్‌లో ప్లాస్మా థెరపీని పెట్టలేదని.. ప్లాస్మా థెరపీని ప్రోత్సహించవద్దని జిల్లా అధికారులకు సూచిస్తున్నామని పేర్కొన్నారు. ‘‘రెమిడిసివిర్ ఇంజెక్షన్లు దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకుంటున్నాం. బ్లాక్ ఫంగస్ చికిత్సకు కావాల్సిన మెడిసిన్ కొరత ఉంది. అవసరమైన మేరకు తెప్పిస్తున్నాం. త్వరలోనే సమస్యను అధిగమిస్తామని’’ ఎ.కె.సింఘాల్‌ పేర్కొన్నారు.

చదవండి: రఘురామకృష్ణరాజు వ్యాఖ్యల వెనుక కుట్ర కోణం: సజ్జల  
ఏపీ అసెంబ్లీ సమావేశాలు: మొహం చాటేసిన చంద్రబాబు 

మరిన్ని వార్తలు