రెండ్రోజుల్లో స్కూళ్లు, కళాశాలలకు ప్రత్యేక మార్గదర్శకాలు

23 Oct, 2020 08:08 IST|Sakshi

తల్లిదండ్రుల అనుమతితోనే స్కూళ్లకు పిల్లలు

టీచర్లు, హెడ్‌మాస్టర్లు, వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి

వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌

సాక్షి,అమరావతి: కరోనా రాష్ట్రంలో తగ్గుముఖం పడుతోందని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ చెప్పారు. గురువారం ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే విద్యా సంవత్సరాన్ని చాలా నష్టపోయిన నేపథ్యంలో స్కూళ్లు తెరవాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ నేపథ్యంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందితోపాటు హెడ్‌మాస్టర్లు, టీచర్లనూ అప్రమత్తం చేశామని వెల్లడించారు. తల్లిదండ్రులు అనుమతిస్తేనే పిల్లలు స్కూళ్లకు రావాలన్నారు. కొద్ది రోజులపాటు మధ్యాహ్నం వరకే స్కూళ్లు ఉంటాయన్నారు. చదవండి: మొదటి నెల రోజులు హాఫ్‌ డే స్కూళ్లు

ఆ తర్వాత పరిస్థితిని బట్టి పూర్తి స్థాయిలో తరగతులు నిర్వహిస్తామని పేర్కొన్నారు. నవంబర్‌ 2 నుంచి స్కూళ్లు, కాలేజీలు తెరుస్తున్నామని, కోవిడ్‌ నేపథ్యంలో రెండ్రోజుల్లో ప్రత్యేక మార్గదర్శకాలు విడుదల చేస్తామని తెలిపారు. వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఉన్న ఇళ్ల నుంచి పిల్లలు స్కూళ్లకు వస్తుంటే ఆ ఇళ్లనూ రోజూ ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు పర్యవేక్షించాలన్నారు. స్కూళ్లు తెరిచాక 15 రోజుల పాటు నిశితంగా పరిశీలిస్తామని వెల్లడించారు. దీన్ని బట్టి కోవిడ్‌ నియంత్రణపై భవిష్యత్‌ ప్రణాళిక ఉంటుందన్నారు. జిల్లా స్థాయిలో స్కూళ్లల్లో పరిస్థితులపై కలెక్టర్లతో టాస్క్‌ఫోర్స్‌ కమిటీలను ఏర్పాటు చేశామని వివరించారు. కోవిడ్‌ టెస్టులను మరింతగా పెంచుతామన్నారు. చదవండి: రైతుబజార్లలో రూ.40కే కిలో ఉల్లి

మరిన్ని వార్తలు