పోలవరం ఎత్తు తగ్గించే ప్రసక్తే లేదు: అనిల్‌ కుమార్‌

2 Dec, 2020 12:55 IST|Sakshi

సాక్షి, అమరావతి: తొమ్మిదేళ్లు అధికారంలో ఉండి చంద్రబాబు పోలవరాన్ని పట్టించుకోలేదని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ శీతాకాల సమావేశాలు మూడో రోజు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌ ఎలక్ట్రిసిటీ డ్యూటీ బిల్‌ను మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సభలో ప్రవేశపెట్టారు. అసైన్డ్‌ ల్యాండ్స్‌ సవరణ చట్టాన్ని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ ప్రవేశపెట్టారు. అనంతరం అసెంబ్లీలో కీలకమైన పోలవరం చర్చపై జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి మాట్లాడుతూ.. ఆగస్ట్‌ 11, 2004న పోలవరానికి వైఎస్సార్‌ శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. 2005 నుంచి పోలవరం పనులను ప్రారంభమయ్యాయని, వైఎస్సార్ మరణం తర్వాత పోలవరాన్ని నిర్లక్ష్యం చేశారని అన్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు పోలవరాన్ని పట్టించుకోలేదని మండిపడ్డారు. చదవండి: చచ్చిపోయిన టీడీపీని బ్రతికించుకోవడానికి డ్రామాలు..

రివైజ్డ్ ఎస్టిమేట్లు సబ్‌మిట్‌ చేయకుండా చంద్రబాబు కాలయాపన చేశారని అన్నారు. ప్రత్యేక ప్యాకేజీ కోసం హోదాను చంద్రబాబు తాకట్టు పెట్టారని తెలిపారు. పోలవరం నిర్మాణం విషయంలో కూడా ఇరిగేషన్ కాంపౌండ్‌కు కేంద్రం నిధులు ఇస్తామన్నా చంద్రబాబు అంగీకరించలేదని గుర్తు చేశారు. కేంద్రం నిర్మించాల్సిన ప్రాజెక్టును ప్యాకేజీల కోసం రాష్ట్రమే నిర్మిస్తుందని చంద్రబాబు పోలవరం నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ అంశాన్ని ప్రశ్నించారని తెలిపారు.చదవండి: మండలిలో టీడీపీ సభ్యుల అనుచిత వ్యాఖ్యలు

గత ఐదేళ్లలో కనీసం 20 శాతం పనులు కూడా చేయలేదని, ప్రధానికి రాసిన లేఖలో కూడా చంద్రబాబు అవాస్తవాలు రాశారని అన్నారు. చంద్రబాబు పోలవరాన్ని ఏటీఎంలా వాడుకున్నారని ప్రధాని మోదీనే అన్నారని మంత్రి ఎద్దేవా చేశారు. 18వేల కుటుంబాలు నిరాశ్రయులవుతున్నా చంద్రబాబు పట్టించుకోలేదన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద రెట్టింపు చెల్లించామని తెలిపారు. వచ్చే మార్చి నాటికి 17,500 కుటుంబాలకు పునరావాస ప్యాకేజీ అందించనున్నామని పేర్కొన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ పునరావాస కుటుంబాలకు నాణ్యమైన ఇళ్లు నిర్మించాలని ఆదేశించారని వ్యాఖ్యానించారు. చదవండి: బాబుపై భగ్గుమన్న ముస్లింలు 

2021 డిసెంబర్‌ నాటికి పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తామని తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్‌ ప్రారంభోత్సవానికి టీడీపీ ఎమ్మెల్యేలను కూడా ఆహ్వానిస్తామని, పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పోలవరం ఎత్తు ఒక మిల్లీ మీటర్‌ కూడా తగ్గించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పోలవరం అంచనా వ్యయంలో బాబు చేసిన తప్పులను సరిచేసుకుంటూ ముందుకెళ్తున్నామని మంత్రి వివరించారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం వైఎస్‌ జగన్ లేఖ రాశారని, పీపీఏ అథారిటీలో కూడా సవరించిన అంచనాలపై తమ వాదనలు వినిపించామని మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు