పోలవరం పనుల్లో వేగం పెంచండి

15 Dec, 2021 04:34 IST|Sakshi

నెల్లూరు, సంగం బ్యారేజీలను ప్రారంభించడానికి సిద్ధం చేయండి

జలవనరుల శాఖ అధికారులకు మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ దిశానిర్దేశం 

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మ కంగా చేపట్టిన పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసే దిశగా పనులను మరింత వేగవంతం చేయాలని జలవనరులశాఖ అధికారులకు మంత్రి పి.అనిల్‌కుమార్‌ యాదవ్‌ దిశానిర్దేశం చేశారు. విజయవాడలో మంగళవారం జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి, ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డితో కలిసి అన్ని ప్రాజెక్టుల సీఈలతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.

పోలవరం ప్రాజెక్టులో రెండు కాఫర్‌ డ్యామ్‌ల మధ్యన ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ (ఈసీఆర్‌ఎఫ్‌) డ్యామ్‌ పునాది డయా ఫ్రమ్‌ వాల్‌ను పటిష్టం  చేయడం, కోతకు గురైన జెట్‌ గ్రౌటింగ్, ఇసుక పొరలను భర్తీచేయడం తదితరాలకు సంబంధిం చిన డిజైన్లను ఈనెల 20న జరిగే డీడీఆర్పీ (డ్యామ్‌ డిజైన్‌ రివ్యూ ప్యానల్‌) సమావేశంలో ఆమోదింపజేసుకోవాలని సూచించారు. డిజైన్లు ఆమోదం పొందిన వెంటనే పనులు ప్రారంభించి వేగంగా పూర్తిచేయాలని ఆదేశించారు. ప్రాధాన్యత ప్రాజెక్టులైన నెల్లూరు, సంగం బ్యారేజీలను వచ్చే జనవరి ఆఖరులో గా ప్రారంభించడానికి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వంశధార స్టేజ్‌–2 ఫేజ్‌–2, అవుకు టన్నెల్, వెలిగొండ పనులను వేగవంతం చేయాలన్నారు.  

మరిన్ని వార్తలు