ఊహించి రాయడంలో మీరు సిద్ధహస్తులు: మంత్రి ఆగ్రహం

30 Jun, 2021 20:11 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఎల్లో మీడియా తీరుపై నీటి పారుదల శాఖా మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టారీతిన రాతలు రాయడం వారికి అలవాటు అని, ఊహాజనిత కథనాలు రాయడం సరికాదని హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ భేటీ ముగిసిన అనంతరం సమాచార శాఖా మంత్రి పేర్ని నానితో కలిసి అనిల్‌ కుమార్‌ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా... నీటి ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ వైఖరిని తప్పుబట్టిన ఆయన.. నిబంధనలకు లోబడే తాము ప్రాజెక్టులు కడుతున్నామని స్పష్టం చేశారు. ఈ క్రమంలో.. కొంతమంది ఎల్లో మీడియా ప్రతినిధులు వ్యవహరించిన తీరుపై మంత్రి అనిల్‌ సీరియస్‌ అయ్యారు. 

ఇరు రాష్ట్రాల జలవివాదం నేపథ్యంలో వారు సంధించిన ప్రశ్నలకు బదులుగా.. ‘‘చూస్తారు కదా అంటున్నా. తెలంగాణ వైఖరిపై కంప్లెంట్‌ రాశాం. మీకు అర్థం కావడం లేదు. 6.9 టీఎంసీలు తీసుకున్నారని నేను చెప్తున్నా. నువ్వు చెప్పినది రోజుకు 2 టీఎంసీలే. గత నాలుగు రోజుల గురించి తీసుకున్నది నేను చెబుతున్నా’’ అంటూ సమాధానమిచ్చారు. ‘‘మేం చెప్పింది రాయడం ఎలాగో చేయరు.. కాబట్టి మీ ఇష్టం వచ్చింది రాసుకోండి. ఎందుకంటే ఊహించింది రాయడంలో మీరు సిద్ధహస్తులు. రాసుకోండబ్బా’’ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

మరిన్ని వార్తలు