బ్లాక్‌ఫంగస్‌ కేసులపై పరిశీలన

17 May, 2021 05:01 IST|Sakshi

వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ 

సాక్షి, అమరావతి:  కోవిడ్‌ నుంచి కోలుకుంటున్న వారికి సోకే బ్లాక్‌ఫంగస్‌పై పూర్తిస్థాయిలో సమాచారం లేదని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ చెప్పారు. మీడియాతో పాటు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలతో కొంతమందిలో భయాందోళనలు ఉన్నాయన్నారు.  ఇలాంటి కేసులపై పరిశీలన చేయాలని అన్ని ఆస్పత్రుల సూపరింటెండెంట్‌లను ఆదేశించామని, దీనిపై నేటి సాయంత్రానికి నివేదిక ఇస్తారని చెప్పారు. ఆయన ఆదివారం మంగళగిరిలో మీడియాతో మాట్లాడారు. చాలా అరుదుగా వచ్చే ఈ వ్యాధిపై ఖచ్చితమైన వివరాలతో మాట్లాడాలన్నారు.

వ్యాధి తీవ్రతను బట్టి కేంద్రమే దానికి సంబంధించిన మందులు కేటాయించిందని, మన రాష్ట్రానికి 1,600 వయల్స్‌ కేటాయించిందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఫీవర్‌ సర్వే కొనసాగుతోందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు తగినంత స్టాకు ఉన్నాయని, గడిచిన 24 గంటల్లో ప్రైవేటు ఆస్పత్రులకు 18 వేలకుపైగా ఇంజక్షన్లు ఇచ్చామని తెలిపారు. ఇప్పటికే జామ్‌నగర్, దుర్గాపూర్, జంషెడ్‌పూర్‌ల నుంచి రావాల్సిన ఆక్సిజన్‌ చేరిందన్నారు. త్వరలోనే స్టోరేజీ కెపాసిటీకి చేరతామని చెప్పారు. 104 కాల్‌సెంటర్‌ ద్వారా వైద్యులు సుమారు 15 వేలమందికిపైగా హోం ఐసొలేషన్‌లో ఉన్న బాధితులకు ఫోన్‌చేసి వివరాలు తెలుసుకుని, వైద్యసాయం చేశారని తెలిపారు.   

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు