గడువులోగా టీకా రెండో డోసు

6 May, 2021 02:54 IST|Sakshi

మొదటి డోసు వేయించుకున్న వారికి ఆందోళన అక్కర్లేదు

ఈనెల 15లోగా కేంద్రం 9 లక్షల డోసులు ఇస్తుంది

రాష్ట్ర సర్కారు మరో 13 లక్షల డోసులు కొనుగోలు చేస్తోంది

మీడియాతో వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి సింఘాల్‌

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మొదటి డోసు వ్యాక్సిన్‌ వేయించుకున్న వారికి సకాలంలోనే రెండో డోసు వేస్తామని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ చెప్పారు. ఈనెల 15వ తేదీలోగా కేంద్ర ప్రభుత్వం 9 లక్షల డోసులు ఇవ్వనుండగా, రాష్ట్ర ప్రభుత్వం 13 లక్షల డోసులు కొనుగోలు చేస్తోందని తెలిపారు. ఇందులో 19 లక్షల డోసులను సెకండ్‌ డోసు వారికే వేయాలని కలెక్టర్లకు ఆదేశాలిచ్చామన్నారు. మొదటి డోసు వేయించుకున్న వారు రెండో డోసు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఆయన బుధవారం మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సాధారణ జీవనానికి ఆటంకం లేకుండా కోవిడ్‌ మార్గదర్శకాలు (144 సెక్షన్‌), ఆ తర్వాత కర్ఫ్యూ అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన సమయాల్లో బ్యాంకులు పనిచేస్తాయన్నారు.

ఆరోగ్యశ్రీ పేషెంట్లకు ఇబ్బందులు లేకుండా చూడటంతో పాటు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పనపైనా అధికారులతో మాట్లాడి సీఎంకు నివేదిక ఇస్తామని చెప్పారు. గడిచిన 24 గంటల్లో 387 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ను ఆస్పత్రులకు సరఫరా చేశామన్నారు. నెల్లూరు జిల్లాలో ఆక్సిజన్‌ కొరత రాబోతోందన్న సమాచారం రాగానే అక్కడి కలెక్టర్‌.. శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ అంతరిక్ష ప్రయోగకేంద్రం నుంచి 12 టన్నుల లిక్విడ్‌ ఆక్సిజన్‌ను తెప్పించి ఆస్పత్రులకు సకాలంలో అందజేసినట్లు తెలిపారు. రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్ల కొరత లేదన్నారు. 104 కాల్‌ సెంటర్‌లో ప్రస్తుతం 3,220 మంది డాక్టర్లు కరోనా బాధితులకు ఫోన్‌ ద్వారా సేవలందిస్తున్నారని చెప్పారు. రైల్వేస్టేషన్ల నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికులతో పాటు, పెళ్లి తదితర కార్యక్రమాల నిర్వహణ, రాష్ట్రాల సరిహద్దుల వద్ద ఎటువంటి చర్యలు తీసుకోవాలనేదానిపైన మార్గదర్శకాలు రూపొందించినట్లు తెలిపారు. ఇతర దేశాల నుంచి వచ్చే సహాయాన్ని.. కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాలకు పంపిస్తోందని, దీని పర్యవేక్షణకు ఒక నోడల్‌ అధికారిని నియమించాలని కేంద్రం చెప్పిందని ఆయన పేర్కొన్నారు. 

మంత్రివర్గ ఉపసంఘ సమావేశం
అంతకుముందు కరోనా నియంత్రణపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో కరోనా నియంత్రణకు సంబంధించి పలు అంశాలను చర్చించారు. మంత్రివర్గ ఉపసంఘం గురువారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో సమావేశమై తాము చర్చించిన అంశాలను నివేదించనుంది.  

మరిన్ని వార్తలు