జ్వర బాధితులు 90 వేలమంది

19 May, 2021 05:10 IST|Sakshi

ఫీవర్‌ సర్వేలో గుర్తించాం

వీరిలో 50 వేల మంది నమూనాలు టెస్టుకు పంపించాం

వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఏకే సింఘాల్‌  

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో తాజాగా నిర్వహించిన ఫీవర్‌ సర్వేలో 90 వేల మంది జ్వర బాధితులను గుర్తించామని, వాళ్లందరికీ హోం ఐసోలేషన్‌ కిట్‌లు అందిస్తున్నామని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ వెల్లడించారు. వారిలో 50 వేల మంది నమూనాలు సేకరించి కరోనా టెస్టులకు పంపించామని తెలిపారు. ఎప్పటికప్పుడు జిల్లాల్లో సర్వే నిర్వహించి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. గ్రామ/వార్డు వలంటీర్లు, ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు మన రాష్ట్రంలో ఉన్నంతగా క్షేత్రస్థాయిలో సిబ్బంది ఏ రాష్ట్రంలో లేరని, అందుకే మూడు రోజుల్లోనే ఫీవర్‌ సర్వే పూర్తి చేయగలిగామన్నారు.

మంగళవారం ఆయన మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో మీడియాతో మాట్లాడారు. కొంతమంది సామాజిక మాధ్యమాల్లో అవాస్తవాలు ప్రచారం చేస్తూ ప్రజల్లో భయాందోళనలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రతి పాజిటివ్‌ కేసునూ లెక్క చెబుతున్నామని, డెత్‌ కేసులకు రూ. 15 వేలు ఇవ్వాలని జీవో ఇచ్చామని, ఈ ప్రభుత్వానికి దాయాల్సిన అవసరం లేదని, అత్యంత పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని స్పష్టం చేశారు. ఆక్సిజన్‌ జాప్యం జరిగి మృతి చెందిన కేసులను కూడా ధైర్యంగా చెప్పామని గుర్తు చేశారు. ఇంకా అవాస్తవాలు రాయడం సరైన పద్ధతి కాదన్నారు. రెమ్‌డెసివిర్‌ కొరత లేదని, అవసరం ఉన్నవారికే ఇవ్వాలనేది ముందు నుంచీ చెబుతున్నామన్నారు. హోం ఐసొలేషన్‌లో ఉన్న వారికి ప్రతిరోజూ వైద్యులతో ఫోన్‌ చేయించి వైద్య సలహాలు అందిస్తున్నామని తెలిపారు.  

మరిన్ని వార్తలు