సంప్రదాయ మందుగా వాడవచ్చు

1 Jun, 2021 05:55 IST|Sakshi

ఆయుర్వేద మందుగా గుర్తించలేదు

వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌

సాక్షి, అమరావతి: నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య తయారుచేసిన మందును సంప్రదాయ మందుగా వాడవచ్చని, దాన్ని ఆయుర్వేద మందుగా గుర్తించడంలేదని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ చెప్పారు.మందు వాడకం వల్ల లాభం గురించి కాకుండా, ఎలాంటి నష్టాలు జరగలేదని భావించి ఆమోదం ఇచ్చామన్నారు. సోమవారం ఆయుష్‌ కమిషనర్‌ కల్నల్‌ రాములుతో కలిసి మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో మీడియాతో మాట్లాడారు.  మందులో వాడుతున్న పదార్థాల్లో హానికారకాలు లేవని తేలిందని చెప్పారు. కోవిడ్‌ వైరస్‌ నియంత్రణకు పనిచేస్తుందన్న ఆధారాలు కూడా ఏమీ లేవని, ఎవరి నమ్మకాన్ని బట్టి వారు వాడుకోవచ్చని పేర్కొన్నా రు. ఇతర మందులు వాడుతున్న వారు వాటిని వాడుతూనే ఈ మందును కేవలం సప్లిమెంట్‌గా వాడాలని సూచించారు.  పాజిటివ్‌ పేషెంట్లెవరూ క్యూలలో లేకుండా వారి సహాయకులు వచ్చి మందు తీసుకెళ్లడం మంచి దని,కంట్లో వేసే మందుకు అనుమతి లేదన్నారు.

కర్ఫ్యూతో కేసులు తగ్గుముఖం
కర్ఫ్యూ కారణంగా కోవిడ్‌ కేసులు తగ్గుముఖం పట్టాయన్నారు. గతంలో కొన్ని పత్రికలు 144 సెక్షన్‌ అమలు, కర్ఫ్యూపై మీడియాలో విమర్శలు చేశాయని, కానీ ఇప్పుడు ఈ విధానమే మంచి ఫలితాలనిచ్చిందని చెప్పారు. అందుకే జూన్‌ 10 వరకు కర్ఫ్యూ పొడిగించామన్నారు. రాష్ట్రంలో ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలోనూ ఒక మెడికల్‌ కాలేజీ ఏర్పాటు ఇదే మొదటిసారి అని తెలిపారు. రూ.7,880 కోట్లతో నిర్మిస్తున్న 16 మెడికల్‌ కాలేజీల్లో 14 కాలేజీలకు సోమవారం శంకుస్థాపన చేశారని, రెండు కాలేజీలకు ఇంతకుముందే శంకుస్థాపన చేశారని చెప్పారు.

రాష్ట్రంలో 1,179 మంది బ్లాక్‌ఫంగస్‌ బాధితులున్నారని, వీరిలో 97 మంది పూర్తిగా కోలుకోగా, 14 మంది మృతిచెందారని తెలిపారు. 1,179 మందిలో 40 మంది మినహా మిగతావారు కరోనా సోకినవారేనని చెప్పారు. బ్లాక్‌ఫంగస్‌ కేసుల్లో 370 మంది ఆక్సిజన్‌ సపోర్టు తీసుకున్న వారు, 687 మంది స్టెరాయిడ్స్‌ వాడిన వారు ఉన్నారని తెలిపారు. మధుమేహ బాధితులు 743 మంది ఉన్నారన్నారు. కోవిడ్‌ కేసులు బాగా తగ్గుముఖం పట్టడంతో ఐసీయూ బెడ్లు, ఆక్సిజన్‌ బెడ్లు ఎక్కువగా అందుబాటులో ఉన్నాయన్నారు. రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లకు బాగా డిమాండు తగ్గిందన్నారు. ఆక్సిజన్‌ స్టోరేజీ సామర్థ్యం తక్కువగా ఉండటంతో రోజుకు 590 మెట్రిక్‌ టన్నులు మాత్రమే తెస్తున్నామని, ఆక్సిజన్‌ వినియోగం కూడా తగ్గిందని తెలిపారు.

10 రోజుల్లోనే ప్రక్రియ పూర్తిచేశాం
ఆయుష్‌ కమిషనర్‌ కల్నల్‌ రాములు మాట్లాడుతూ కృష్ణపట్నం మందుపై తమశాఖ ఈనెల 21, 22 తేదీల్లో పరిశీలన మొదలుపెట్టిందని చెప్పారు. చెప్పినట్లుగానే అన్ని పరిశీలనలు పూర్తిచేసి 10 రోజుల్లో ఫలితాలు ఇచ్చామన్నారు. దీన్నిబట్టి ఈ మందుపై ప్రభుత్వం ఎంత వేగంగా స్పందించిందో అర్థం చేసుకోవచ్చని చెప్పారు. చట్టం, శాస్త్రం ప్రకారం దీన్ని ఆయుర్వేద మందుగా గుర్తించలేదని, స్థానిక, సంప్రదాయ మందుగానే ఇవ్వాలని ప్రభుత్వం సూచించిందని తెలిపారు. కోవిడ్‌ నిబంధనల మేరకు ఈ మందును పంపిణీ చేయాలన్నారు. ఆనందయ్యతో మాట్లాడిన తరువాత మందు పంపిణీపై తేదీలు ప్రకటిస్తామని ఆయన చెప్పారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు