రాష్ట్రంలో 2 లక్షల మంది రైతులకు ఉచితంగా బోర్లు 

25 Mar, 2021 04:18 IST|Sakshi

జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ 

భూగర్భజల వ్యవస్థలు, సవాళ్లు, అవకాశాలపై జాతీయ సదస్సు 

భవానీపురం (విజయవాడ పశ్చిమ): వైఎస్సార్‌ జలకళ పథకం కింద రాష్ట్రంలోని రెండు లక్షల మంది రైతులకు ఉచితంగా బోరు బావులు తవ్విస్తున్న ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదేనని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి పి.అనిల్‌కుమార్‌ అన్నారు. భూగర్భజల శాఖ స్వర్ణోత్సవాలను పురస్కరించుకుని విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బుధవారం భూగర్భజల వ్యవస్థలు, సవాళ్లు, అవకాశాలు అంశంపై నిర్వహించిన జాతీయ సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సదస్సులో ఆయన మాట్లాడుతూ ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టుకుని నీటి ప్రాధాన్యతను తెలియచేసేలా ఎంతో బాధ్యతతో భూగర్భజల శాఖ విధులు నిర్వహిస్తుందని చెప్పారు. భావి తరాలకు తాగు, సాగు నీరు అందించేందుకు నీటిని పొదుపుగా వాడటంలో, భూగర్భ జలాల వివరాలను తెలియచేయటంలో భూగర్భజల శాఖ గత ఐదు దశాబ్దాలుగా విశేష కృషి చేసిందని తెలిపారు.

జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శి జె.శ్యామలరావు మాట్లాడుతూ దేశ అభివృద్ధిలో జలవనరులు కీలకమైన పాత్ర పోషిస్తాయని అన్నారు. రెండున్నర దశాబ్దాల క్రితం దేశంలోనే తొలి హైడ్రాలజీ ప్రాజక్ట్‌ను ప్రారంభించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌కు సుస్థిర స్థానం ఉందన్నారు. ఈ స్వర్ణోత్సవ వేళ నిర్వహించిన ఈ సదస్సు భావితరాలకు, తదుపరి ప్రణాళికలకు ఒక వేదికగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా 13 జిల్లాల అధికారులు రూపొందించిన 13 పుస్తకాలను, గత 50 ఏళ్లుగా భూగర్భ జలశాఖ అమలు చేసిన ప్రణాళికలు, పరిశోధనల సమాహారంగా రూపొందించిన పుస్తకం, సావనీర్‌ను మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ తదితరులు ఆవిష్కరించారు.   

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు