వచ్చే ఏడాది డిసెంబర్‌ నాటికి పోలవరం పూర్తి

18 Nov, 2020 03:25 IST|Sakshi
పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలిస్తున్న మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌

ఖరీఫ్‌కు గ్రావిటీ ద్వారా నీటి విడుదల

మంత్రి అనిల్‌కుమార్‌ స్పష్టీకరణ

అంగుళం కూడా తగ్గకుండా ప్రాజెక్టు కడుతున్నాం

ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ గురించి మాట్లాడే అర్హత టీడీపీకి లేదు

పోలవరంలో వైఎస్సార్‌ విగ్రహం

సాక్షి ప్రతినిధి, ఏలూరు/ పోలవరం రూరల్‌: వచ్చే ఏడాది డిసెంబర్‌ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి, ఖరీఫ్‌కు గ్రావిటీ ద్వారా నీరు విడుదల చేస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ స్పష్టం చేశారు. మంగళవారం ఆయన ప్రాజెక్టును సందర్శించారు. తొలుత గడ్డర్ల ఏర్పాటును పరిశీలించారు. అనంతరం స్పిల్‌ వే, కాఫర్‌ డ్యామ్‌ పనులు, ప్రాజెక్టులో గ్యాప్‌ 3 పనులను పరిశీలించారు. పనుల వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. అధికారులతో సమీక్ష తర్వాత విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేసిన ప్రాజెక్ట్‌ను, ఆయన తనయుడు, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పూర్తి చేస్తారని, ఇది భగవంతుని సంకల్పమని మంత్రి అన్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేవలం నిర్మాణ బాధ్యతలను మాత్రమే చూస్తోందని, నిర్మాణం, ఆర్‌అండ్‌ఆర్‌కు సంబంధించి నిధులు మంజూరు చేయాల్సిన బాధ్యత కేంద్రానిదేనని మంత్రి స్పష్టం చేశారు. జాతీయ ప్రాజెక్ట్‌ కాబట్టి, నిధులు మంజూరు చేస్తూ ప్రధాని నరేంద్రమోదీ సహకరిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. 

ఉమా నువ్వు చెమ్మ చెక్క ఆడుతున్నావా?
మేఘా సంస్థ వచ్చాక రూ.600 కోట్లు పైగా పనులు చేసిందని అనిల్‌కుమార్‌ యాదవ్‌ తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పనుల్లో ఎక్కడా డీవియేషన్‌ లేదని చెప్పారు. ‘పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారు అంటున్నారు. నువ్వు అడిగితే నీకు సమాధానం చెబుతూ అనుమానం ఉంటే టేపుతో కొలుచుకోమని చెప్పాను. నువ్వు ప్రజలను అంటారా అంటున్నావు..’ అని మాజీ మంత్రి దేవినేని ఉమను ఉద్దేశించి మంత్రి వ్యాఖ్యానించారు. 194 టీఎంíసీలు నిల్వ చేసేందుకు అంగుళం కూడా తగ్గకుండా ప్రాజెక్టు కడుతున్నామని చెప్పారు. 2017లో కేంద్ర కేబినెట్‌ సందర్భంగా ఏయే అంశాలు అంగీకరించారో మీరు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ‘జగన్‌ పబ్జీ ఆడతారు, అనిల్‌ ఐపీఎల్‌ ఆడతారని అంటున్నారు. నువ్వు చెమ్మ చెక్క ఆడుతున్నావా? నీ గురించి కృష్ణా జిల్లాలో ఏం మాట్లాడుతున్నారో ముందు తెలుసుకో.. ఎవర్నో చంపావని అంటున్నారు..’ అని మంత్రి అన్నారు.  

కమీషన్లకు కక్కుర్తి పడింది మీరే..
ప్రాజెక్టు విషయంలో కమీషన్లకు కక్కుర్తి పడింది. 2017లో అన్నింటికీ ఒప్పుకుంది కూడా మీరేనని అనిల్‌కుమార్‌ అన్నారు. పోలవరంలో ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ గురించి మాట్లాడే అర్హత తెలుగుదేశం వారికి లేదన్నారు. రూ.50 వేల కోట్ల ప్రాజెక్టు వ్యయంలో రూ.30 వేల కోట్లు ఉన్న ఆర్‌అండ్‌ఆర్‌ గురించి పట్టించుకోకుండా, 70 శాతం ప్రాజెక్టు పూర్తి చేసినట్లు ఎలా చెబుతున్నారని నిలదీశారు. ప్రాజెక్టు పూర్తి అయిన తర్వాత పట్టిసీమ, పురుషోత్తపట్నం ఎత్తిపోతలు ఎందుకు. కేవలం గ్రావిటీ ద్వారా విశాఖకు నీళ్లు ఇవ్వాలనే పైపులైన్‌ వేయాలని అనుకుంటున్నామని మంత్రి స్పష్టం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని పోలవరంలో ఏర్పాటు చేస్తామని చెప్పారు. విలేకరుల సమావేశంలో పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, అధికారులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు