విశ్రాంతి గదిలో విగతజీవిగా.. ఏడీ అనుమానాస్పద మృతి

6 Jul, 2022 08:34 IST|Sakshi
రాము (ఫైల్‌)  

ఉరికి వేలాడుతుండగా గమనించిన డ్రైవర్‌ 

తన చావుకు పలువురు కారణమంటూ పశుసంవర్ధక శాఖ ఏడీ రాము లేఖ 

రూ.50 లక్షల కోసం బ్లాక్‌ మెయిల్‌

చాలామంది ఆర్థికంగా మోసం చేశారని ఆవేదన

సాక్షి, అనంతపురం: పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (ఏడీ) ఎం.రాము (50) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అనంతపురంలోని పశుసంవర్ధక శాఖ కార్యాలయంలోని మొదటి అంతస్తులో గల విశ్రాంతి గదిలో ఉరికి వేలాడుతుండగా సిబ్బంది మంగళవారం గమనించారు. తలుపులు తెరిచి ఉండటం అనుమానాలకు తావిస్తోంది. తన చావుకు పలువురు కారణమంటూ పేర్లు రాసి ఉన్న లేఖ లభించింది. హత్య చేసి.. ఆత్మహత్యగా చిత్రీకరించారా అనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. పోలీసులు, కార్యాలయ సిబ్బంది తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి.

బాపట్ల జిల్లాకు చెందిన ఎం.రాముకు భార్య రాణి (ప్రభుత్వ కళాశాల లెక్చరర్‌), కుమార్తె రిత్విక ఉన్నారు. భార్య, కుమార్తె కర్నూలులో స్థిరపడగా.. రాము మాత్రం పదేళ్లుగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉంటూ విధులు నిర్వర్తిస్తున్నారు. ఈయన ధర్మవరం, పుట్టపర్తి ప్రాంతాల్లో ఎక్కువ కాలం పనిచేశారు. ప్రస్తుతం డీఆర్‌డీఏ లైవ్‌స్టాక్‌ విభాగం డీపీఎంగా వ్యవహరిస్తున్నారు. సోమవారం సాయంత్రం క్యాంపు ముగించుకుని విశ్రాంతి గదికి చేరుకున్నారు. మంగళవారం ఉదయం పశుసంవర్ధక శాఖ కార్యాలయ డ్రైవర్‌ రామసుబ్బారెడ్డి విద్యుత్‌ మోటార్‌ ఆన్‌ చేసేందుకని మొదటి అంతస్తులోకి వచ్చాడు.

చదవండి: (ప్రేయసి ఇంటి వరండాలో శవంగా మారిన యువకుడు)

అప్పటికే అక్కడ విశ్రాంతి గది తలుపులు కొంత తెరుచుకుని ఉండటంతో లోపలికి తొంగి చూశాడు. ఫ్యాన్‌కు ఉరికి వేలాడుతున్న ఏడీని చూసి వెంటనే  ఉన్నతాధికారులతో పాటు పోలీసులకు సమాచారమందించాడు. వన్‌టౌన్‌ పోలీసులు హుటాహుటిన వచ్చి గదిని పరిశీలించగా.. సూసైడ్‌ నోట్‌ లభించింది. మృతదేహాన్ని కిందకు దించి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఏడీ సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. చనిపోవడానికి ముందు పలువురితో సంభాషించినట్లు, గట్టిగా అరుస్తున్నట్లు శబ్దాలు వినిపించాయని సిబ్బంది పోలీసులకు తెలిపారు.

స్వతహాగా ఏడీ స్థానికంగా ఎవరితోనూ కలివిడిగా ఉండేవారు కాకపోవడంతో సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్న వ్యక్తులు, వారి వ్యవహారాల గురించి తెలియదని పేర్కొన్నారు. డ్రైవర్‌ రామసుబ్బారెడ్డిని ప్రాథమికంగా విచారణ చేశారు. ఏడీ గదికి ఎవరెవరు వచ్చారో.. ఆయన ఏ సమయంలో చనిపోయారో తెలియదని సిబ్బంది తెలిపారు. అయితే తలుపులు తెరిచి ఉండడం అనుమానాలకు తావిస్తోంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ రవిశంకర్‌రెడ్డి తెలిపారు. హత్యా.. ఆత్మహత్యా.. మృతికి గల కారణాలు దర్యాప్తులో తేలుస్తామన్నారు. 

చదవండి: (ఏడాది క్రితం పెళ్లి.. జోగ్‌ ఫాల్స్‌ చూడాలని వెళ్లి..)

ఏడీ సూసైడ్‌ నోట్‌లో ఏముందంటే... 
‘నా చావుకు కారణం అటెండర్‌ జాకీర్, కోట్ల విజయ, కోట్ల అనిల్, కోట్ల విజయ లవర్‌ మహేష్‌. వీరు రూ.50 లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్‌ చేసినారు.  చిక్కబళ్లాపురకు చెందిన నెట్‌ సెర్ఫ్‌ వ్యాపార భాగస్వామి మునిరాం, పుట్టపర్తికి చెందిన జియోన్‌ మెడికల్‌ షాపు ఓనర్‌ అశోక్‌కుమార్, ధర్మవరానికి చెందిన మెడికల్‌ స్టోర్‌ అశ్వర్థనారాయణ, హరికృష్ణ కల్లూరు స్టాక్‌ తీసుకుపోయి డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారు. సెమన్‌ బ్యాంకులో పని చేసే డీసీ హుసేన్, అశోక్‌కుమార్‌లకు నా పేరు మీద ప్రాంసరీ నోటు రాయించి రూ.4లక్షలు ఇప్పించాను. నన్ను మోసం చేసినారు. ధర్మవరంలో 27.50 ఎకరాల భూమి పత్రాలు 925–2022 చెన్నేకొత్తపల్లి’ అంటూ అస్పష్టంగా వివరాలు రాశారు. 

మరిన్ని వార్తలు