పెద్ద పులి ఎక్కడ? 

16 Jun, 2022 23:29 IST|Sakshi

జూలో కనిపించని పెద్ద పులులు 

నైట్‌క్రాల్స్‌కే పరిమితం..సందర్శకుల అసంతృప్తి 

గోడ నిర్మాణంలో జాప్యంపై ఆగ్రహం 

ఇందిరా గాంధీ జూ పార్కులో పెద్ద పులులు కనిపించడం లేదు. అలా అని జూ నుంచి తప్పించుకుని జనారణ్యంలో తిరుగుతున్నాయేమోనని భయపడకండి. ఆ పులులు జూ లోపలే ఉన్నాయి. అయితే సందర్శకులకు మాత్రం కనిపించకుండా నైట్‌క్రాల్స్‌కే పరిమితమయ్యాయి. జూ పార్కు అనగానే ఏనుగులు, పులులు గుర్తుకొస్తాయి. అవి కనిపిస్తేనే జూకి వెళ్లి జంతువులను చూశామన్న సంతృప్తి సందర్శకులకు కలుగుతుంది.

ఇక్కడ చింపాంజీలు, చిరుతల ఎన్‌క్లోజర్లు దాటిన తర్వాత పెద్ద పులుల ఎన్‌క్లోజర్‌ ఉంది. ఇందులో రెండు పులులున్నాయి. అవి సందర్శకులను ఎంతగానో అలరిస్తుండేవి. అయితే ఏడాది నుంచి ఇక్కడ పెద్ద పులులు వాటి ఎన్‌క్లోజర్‌లో కనిపించడం లేదు. ఎన్‌క్లోజర్‌ వెనుక భాగంలో గోడ కూలిపోయింది. దీంతో పులులను ఎన్‌క్లోజర్‌లో విడిచిపెడితే బయటకు వెళ్లిపోయే ప్రమాదం ఉందని గుర్తించిన అధికారులు.. నైట్‌క్రాల్స్‌లో ఉంచి ఆ గోడ పునర్నిర్మాణ పనులు ప్రారంభించారు.

నాలుగు, ఐదు నెలల్లో గోడ నిర్మాణం పూర్తి చేసి ఎన్‌క్లోజర్‌ సిద్ధం చేయాలని అధికారులు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. అయితే ఏడాది గడుస్తున్నా ఈ గోడ పనులు పూర్తి కాలేదు. సరికదా మరో ఆరు నెలలు గడిచినా పూర్తయ్యే పరిస్థితులు కనిపించడం లేదని ఇక్కడ సిబ్బంది అంటున్నారు. గోడ పూర్తయితే గానీ పెద్ద పులులు సందర్శకులకు కనిపించవు. నిర్మాణ పనుల్లో జాప్యంపై సందర్శకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్‌క్లోజర్‌కు సమీపంలో తెల్ల పులులు చూస్తూ.. ఒకింత సంతృప్తి చెందుతున్నారు.  వెంటనే గోడ నిర్మాణం పూర్తి చేయాలని కోరుతున్నారు. 
– ఆరిలోవ(విశాఖ తూర్పు) 

మరిన్ని వార్తలు