సర్పంచులుగా ఉన్నా వీడని వృత్తులు.. సాదాసీదాగా జనంతో మమేకం

17 Oct, 2022 20:08 IST|Sakshi

బి.కొత్తకోట(అన్నమయ్య జిల్లా): సాధారణంగా చిన్న పదవికే డాబు, దర్పం ప్రదర్శించేవాళ్లను చూస్తుంటాం. ఆ పదవితో చేస్తున్న వృత్తిని వదిలేసి పూర్తిస్థాయి రాజకీయ నాయకుని అవతారం ఎత్తేస్తారు. అయితే గ్రామానికి ప్రథమపౌరులై ఉండి, మన దేశంలో ప్రధానికైనా లేని చెక్‌పవర్‌ కలిగిన సర్పంచులు సాదాసీదాగా, చేస్తున్న వృత్తికే అంకితమై ఆదర్శంగా నిలుస్తున్నారు. తాము సర్పంచులం, మనకొక హోదా, గుర్తింపు, సమాజంలో, అధికారుల వద్ద ప్రత్యేక గుర్తింపు, గౌరవం ఉందన్న అహం కొందరిలో మచ్చుకైనా కనిపించడం లేదు. సర్పంచులు కాక ముందు ఏ వృత్తిలో ఉండి జీవనం సాగించేవాళ్లో ఇప్పుడూ వాటినే కొనసాగిస్తూ పంచాయతీ ప్రజల్లో మన్ననలు పొందుతున్నారు. సర్పంచు అయ్యాక మనోడు మారలేదు అనుకునేలా అందరితో కలిసిపోతూ మమేకమవుతున్నారు. అలాంటి సర్పంచుల్లో కొందరి గురించి... 


మోటర్‌ మెకానిక్‌గానే... 

అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండలం గుట్టపాళెంకు చెందిన సి.జయరామిరెడ్డి వైఎస్సార్‌సీపీ మద్దతుతో నాయనబావి సర్పంచుగా పోటీ చేసి అధిక మెజార్టితో గెలుపొందారు. అప్పటివరకు వ్యవసాయ మోటార్లకు రిపేర్లు చేసే మెకానిక్‌గా గ్రామస్తులకు పరిచయం. సర్పంచు పదవితో రాజకీయాల్లో బీజీ అయిపోతాడని గ్రామస్తులు భావించారు. డిగ్రీ ఫైయిల్‌ అయిన జయరామిరెడ్డి భిన్నంగా ఉన్నాడు. సర్పంచు పదవి ఇప్పుడొచ్చింది, నాకు జీవితాన్నిచ్చిన వృత్తిని వదిలేదిలేదని నిక్కచ్చిగా చెప్పేశాడు. సర్పంచుగా అధికారుల సమావేశాలకు హజరువుతూ, ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూనే మోటార్ల రిపేరు పనిని కొనసాగిస్తున్నాడు. 


వ్యవసాయ  పనుల్లో నిమగ్నం  

పెద్దమండ్యం మండలం కోటకాడపల్లె సర్పంచు కే.భూదేవి చదివింది ఐదో తరగతి. ఎస్సీ రిజర్వేషన్‌ కోటాలో ఆమె సర్పంచు అయింది. భర్త పెద్దరెడ్డెప్పకి ఒకటిన్నర ఎకరా పొలం, అందులో బోరు ఉంది. మొదటినుంచి మహిళా రైతుగా వ్యవసాయం చేస్తోంది. కోటకాడపల్లె సర్పంచు పదవికి పోటీచేసి గెలుపొందినా ఆమె రైతు జీవితాన్ని వీడలేదు. సర్పంచుగా తన బాధ్యతలను నిర్వర్తిస్తూనే రోజూ వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతారు. తాను గ్రామానికి ప్రథమ పౌరురాలిని అన్న దర్పం చూపకుండా టమాట, వేరుశెనగ పంటల సాగు పనులు చేస్తున్నారు. మహిళా సర్పంచు అయినప్పటికి మహిళా రైతు జీవితాన్ని వీడలేదు.  


పదవిలో రాణిస్తూ.. వృత్తిలో కొనసాగుతూ.. 

తంబళ్లపల్లె మండలం గుండ్లపల్లె సర్పంచుగా పదో తరగతి చదివిన ఓ సాధారణ బోర్‌ మెకానిక్‌ ఎస్‌.మౌలాలి ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. పైసా ఖర్చు లేకుండా ఏకగ్రీవమంటే ఆ సర్పంచు డాబు చూపాల్సిందే. అయితే  ఈయన సర్పంచుగా కంటే బోర్‌ మెకానిక్‌గానే గుర్తింపు కోరుకొంటున్నాడు. పాపిరెడ్డిగారిపల్లెకు చెందిన ఈయన  ఈ ప్రాంతంలో బోర్లలో మోటార్లను వెలికితీయడం, కాలిపోయిన మోటార్లకు వైండింగ్‌ పనులు చేస్తున్నారు. సర్పంచుగా విధులు నిర్వర్తిస్తూనే మెకానిక్‌ పని  చేస్తున్నాడు. తన వృత్తికి సర్పంచు పదవి అడ్డంకికాదని, అందరూ తనను మెకానిక్‌గానే అభిమానిస్తారని అంటున్నాడు మౌలాలి.  


సమస్యలు పరిష్కరిస్తూ.. దుకాణం నడుపుతూ.. 

బి.కొత్తకోట మండలం కనికలతోపుకు చెందిన ఆర్‌.రుక్మిణి ఇంటర్‌ ఫెయిల్‌. తుమ్మణంగుట్ట సర్పంచు పదవి జనరల్‌ మహిళ కావడంతో ఎన్నికల్లో పోటీచేసి గెలుపొందారు. భర్త అమరనాథరెడ్డితో కలిసి చిల్లర దుకాణం, చికెన్‌ సెంటర్‌ నడుపుతూ వస్తున్నారు. సర్పంచుగా గెలుపొందినా వృతిని వీడలేదు. సర్పంచుగా సమావేశాలకు హజరవుతూ, పల్లెల్లో పర్యటిస్తూ, సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు. అయినప్పటికి సాధారణ గృహిణిలా, దుకాణంలో పనులు చేసుకుంటూ కనిపిస్తారు. (క్లిక్‌: ఆ నిబంధనతో పేద విద్యార్థులకు ఉచితంగా కార్పొరేట్‌ విద్య..)

మరిన్ని వార్తలు