ఉద్యానకేంద్రంగా అన్నమయ్య జిల్లా

30 Apr, 2022 13:43 IST|Sakshi

జిల్లాలో 75,731 హెక్టార్లలో పండ్లతోటలు

అన్ని పంటల సమాహారంగా అన్నమయ్యజిల్లా

రాష్ట్రంలోనే ఉద్యాన సాగులో జిల్లాది రెండో స్థానం

అన్నమయ్య జిల్లాలో విస్తారంగా పండ్లతోటలు సాగవుతున్నాయి. మామిడి,చీనీ, అరటి,టమాట,బొప్పొయి, కర్బూజ సాగుపై రైతులు మక్కువ చూపుతున్నారు. పండ్లతోటల పెంపకానికి ఉపాధినిధులు తోడ్పాటు అందిస్తున్నాయి.  ఉద్యానకేంద్రంగా జిల్లా  విరాజిల్లనుంది.

బి.కొత్తకోట: అన్నమయ్య జిల్లా పండ్లతోటలకు కేరాఫ్‌గా మారనుంది. జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ తర్వాత ఉద్యానపంటల సాగుతో ప్రత్యేక గుర్తింపు కూడా దక్కించుకోనుంది. రాష్ట్రంలోని అన్నిజిల్లాల్లో ఉద్యానవన పంటల వివరాలను ప్రభుత్వం సేకరిస్తోంది. ఇందులో జిల్లాకు రెండో స్థానం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజా లెక్కల ప్రకారం జిల్లాలో 75,731 హెక్టార్లలో ఉద్యానవన పంటలు సాగులో ఉన్నాయి. ఇందులో మామిడి, టమాట ఒకటి, రెండుస్థానాల్లో ఉండగా అన్ని ఉద్యాన పంటల సాగు సమాహారంగా జిల్లాకు గుర్తింపు వచ్చింది. తంబళ్లపల్లె, మదనపల్లె, పీలేరు నియోజక వర్గాల్లో టమాట సాగు ప్రథమస్థానంలో ఉంది. మామిడి జిల్లా అంతటా విస్తరించింది. అరటి, పసుపు, బత్తాయి, నిమ్మ తోటలు రాజంపేట, రాయచోటి, రైల్వేకోడూరులో సాగులో ఉన్నాయి. మొత్తమ్మీద అన్ని రకాల పంటలు జిల్లాలో సాగవుతున్నాయి.  

­­టమాట కేరాఫ్‌ తంబళ్లపల్లె
టమాట సాగులో తంబళ్లపల్లె నియోజకవర్గానిదే అగ్రస్థానం. దశాబ్దాలుగా దీనిపైనే రైతులు ఆధారపడ్డారు. ప్రత్యామ్నయ పంటలవైపు వెళ్లడం లేదు. తంబళ్లపల్లె తర్వాత మదనపల్లె, పీలేరు నియోజకవర్గాల్లో టమాట సాగువుతోంది. ఉద్యానవన పంటల్లో ఈ మూడు నియోజకవర్గాల్లో టమాటనే అధికం. రాయచోటి, చిన్నమండెం, గాలివీడు ప్రాంతాల్లో కొద్దిపాటి కనిపిస్తుంది. జిల్లాలో మిగిలిన ప్రాంతాల్లో టమాట సాగు కనిపించదు. ఈ ప్రాంతాల్లో కట్టెలతో టమాటను సాగు చేస్తారు. దిగుబడి ఎలా ఉన్నా వీటి ధరలు నిలకడగా ఎప్పుడూ ఉండవు. అయినప్పటికీ రైతులు దీని సాగును వదలరు. ఇదే పంటతో కోట్లకు పడగలెత్తిన రైతులు లేకపోలేదు. తర్వాత మామిడితోటల పెంపకం ఉంది.  

పండ్లతోటలకు అందే ఉపాధి సహయం
మామిడికి రూ.1,02,756, జీడిమామిడికి రూ.94,019, బత్తాయికి రూ.1,05,521, అసిడ్‌లైమ్‌కి రూ.1,41,515, నాటుజామకి రూ.1,41,784, తైవాన్‌జామకి రూ.2,30,023, సపోటకి రూ.88,255, కొబ్బరికి రూ.88,821, సీతాఫలంకి రూ.1,70,603, దానిమ్మకి రూ.2,48,845, నేరేడుకి రూ.18,124, చింతకి రూ.89,120, ఆపిల్‌బేర్‌కి రూ.1,06,962, డ్రాగన్‌ప్రూట్‌కి రూ.1,79,626, గులాబీకి రూ.1,92,500, మల్లెకి రూ.1,09,672, మునగకు రూ.1,01,541లు ప్రభుత్వం పూర్తి రాయితీగా అందిస్తోంది. ఈ పండ్లతోటలకు మంజూరైన ఉపాధి నిధుల రాయితీ సొమ్మును పంటల సాగునుబట్టి రెండు, మూడేళ్లపాటు అందించడం జరుగుతుంది. పోలాల్లో గుంతలు తవ్వి, మొక్కలు నాటి, సంరక్షణ, పంటల దిగుబడి వచ్చే వరకు రాయితీని విడతల వారీగా అందిస్తారు. ఇది పండ్ల రైతాంగానికి ఎంతో ప్రయోజనకరం.  

అరటికి కేరాఫ్‌ ఇవే 
జిల్లాలో అత్యధికంగా సాగయ్యే మూడో పంట అరటి. రైల్వేకోడూరు, ఓబులవారిపల్లె, పుల్లంపేట, చిట్వేలి, రాజంపేటలో మాత్రమే ఈ పంట సాగు చేస్తున్నారు. బొప్పాయిని పెనగలూరు కలుపుకొని పై ప్రాంతాల్లో సాగు చేస్తున్నారు. ఈ పంటల సాగులో 95శాతం వాటా ఈ ప్రాంతాలదే. పసుపు అక్కడక్కడ సాగవుతోంది. మామిడితోటల పెంపకం జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోనూ జరుగుతోంది.  

రెండోస్థానంలో జిల్లా 
పండ్లతోటల పెంపకంలో అన్నమయ్య జిల్లా రెండోస్థానంలో ఉండనుంది. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల్లో సాగులోని ఉద్యానవన పంటల సాగు వివరాలను సేకరిస్తున్నారు. అనంతపురంజిల్లా మొదటిస్థానంలో ఉండే అవకాశం కనిపిస్తోంది. జిల్లాకు రెండవ స్థానం దక్కితే పండ్లతోటలకు నిలయంగా మారినట్టే. దీనికి ప్రభుత్వ ప్రోత్సాహం అధికంగా ఉంటుంది.  
    –రవీంద్రనాధ్‌రెడ్డి, జిల్లా ఉద్యానవన అధికారి, రాయచోటి 

ఐదెకరాలలోపు భూమి కలిగిన రైతులకు రాయితీ
పండ్లతోటల పెంపకం కోసం  ఉపాధి రాయితీని ప్రభుత్వం వర్తింపజేస్తోంది. ఒక మొక్కకు నీరుపోసినందుకు రూ.17, సంరక్షణకు రూ.10 చొప్పున నెలకు రూ.27 చెల్లిస్తాం. జాబ్‌కార్డు, ఐదెకరాలోపు భూమి కలిగిన ప్రతి రైతు రాయితీ పొందడానికి అర్హులు. రైతులు సద్వినియోగం చేసుకొని పండ్లతోటల పెంపకంతో ఆదాయం పొందాలి. ఈ పంటలసాగుతో కొన్నేళ్లపాటు ఆదాయం పొందవచ్చు.  
–ఎస్‌.మధుబాబు, డ్వామా ఏపీడీ, ములకలచెరువు 

మరిన్ని వార్తలు