Papaya Fruits Packing: బొప్పాయి ప్యాకింగ్‌.. వెరీ స్పెషల్‌!

22 Aug, 2022 19:24 IST|Sakshi

ప్రత్యేకంగా బొప్పాయి ఎగుమతి

సిద్ధహస్తులైన కూలీలచే లోడింగ్‌

బయటప్రాంతాల నుంచి ప్రత్యేకంగా కూలీలు 

ఎండుగడ్డితో లారీని ప్యాకింగ్‌ చేయడం ప్రత్యేకత 

మార్కెట్లో కిలో బొప్పాయి రూ.18 

గుర్రంకొండ: అన్నయమ్య జిల్లాలో పడమటి ప్రాంతాలైన పీలేరు, మదనపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గాల పరిధిలో సాగు చేసిన బొప్పాయిని ప్రత్యేక పద్ధతుల ద్వారా దేశరాజధాని ఢిల్లీకి ఎగుమతి చేస్తున్నారు. బొప్పాయి లోడింగ్‌ అన్నిటికంటే భిన్నంగా ఆసక్తికరంగానూ ఉంటుంది. ఇందుకోసం కాకినాడ, ఒంగోలు ప్రాంతాల నుంచి సిద్ధహస్తులైన కూలీలను వ్యాపారులు ఇక్కడికి తీసుకొస్తుంటారు. ముందుగా ఎండుగడ్డితో లారీని లోపలివైపు ప్యాకింగ్‌ చేయడం విశేషం. ప్రస్తుతం మార్కెట్లో కిలో బొప్పాయి ధర రూ.18 వరకు పలుకుతోంది. దీంతో ఢిల్లీ, ముంబై, రాజస్థాన్‌కు చెందిన బొప్పాయి వ్యాపారులు ఇక్కడే మకాం వేసి బొప్పాయి కాయలను వారి రాష్ట్రాలకు తరలిస్తున్నారు.   


వ్యాపారులు ఇక్కడే మకాం

సాధారణంగా పలు రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు జులై నెలలో ఇక్కడికి చేరుకొంటారు. ముఖ్యంగా మదనపల్లె, పీలేరు, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లోని పలు మండలాల్లో  మకాం వేస్తుంటారు.  అప్పటి నుంచి డిసెంబర్‌ నెల వరకు ఇక్కడే ఉండి బొప్పాయి కొనుగోలు చేసి ముఖ్యంగా ఢిల్లీ, ముంబై, రాజస్థాన్‌ వంటి ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు. ఏజెంట్లను నియమించుకొని బొప్పాయి సాగు చేసిన రైతుల వివరాలు సేకరించి తోటలవద్దకు వెళ్లి వారే నేరుగా రైతుల వద్ద నుంచి కాయల్ని కొనుగోలు చేస్తారు.  


లోడింగ్‌ కూలీల ప్రత్యేకత

కాకినాడ, ఒంగోలు లాంటి ప్రాంతాలకు చెందిన కూలీలు ఈ తరహా కటింగ్, లోడింగ్‌ కోసం వస్తుంటారు. బొప్పాయి తోటల్లో వెళ్లే కూలీలు ఎగుమతికి పనికొచ్చే కాయలను చెట్టునుంచి కింద పడకుండా కిందికి దించుతారు. ఆ తరువాత ప్రతి కాయను పేపర్‌తో చుడతారు. లారీలోకి బొప్పాయి కాయల్ని లోడ్‌ చేసే సమయంలో తగిన జాగ్రత్తలు పాటిస్తారు. లారీ లోపల, కింద భాగంలో నాలుగువైపులా ఎండుగడ్డిని ఏర్పాటు చేస్తారు. పేపర్‌ చుట్టిన కాయల్ని లారీల్లో లోడ్‌ చేసి మళ్లీపైన కూడా ఎండుగడ్డిని ఎక్కువగా వేసి లోడ్‌ చేయడం వీరి ప్రత్యేకత. వందలాది మంది కూలీలు బయట జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చి జీవనోపాధి పొందుతుండడం గమనార్హం. 


ఢిల్లీ కటింగ్‌కు ప్రత్యేకం 

సాధారణంగా మన ప్రాంతంలో బొప్పాయి సగం రంగు వచ్చే వరకు కోత కోయరు. ఢిల్లీ కటింగ్‌కు మాత్రం ఎంతో తేడా ఉంటుంది.  ఆకుపచ్చ రంగులో ఉన్న బొప్పాయి సన్నని సూది లావు అంత లేత పసుపు రంగు వర్ణం రాగానే వాటితో పాటు వాటిపైనున్న రెండు కాయల్ని కోత కోస్తారు.  ఇందుకోసం అనుభవం కలిగిన కోత కూలీలను ఏర్పాటు చేసుకొంటారు. లోడింగ్‌ చేసేందుకు అనుభవం ఉన్న బయట ప్రాంతాల హమాలీలను తీసుకొస్తుంటారు.  ఢిల్లీ కంటింగ్‌ కాయలు పచ్చిగా ఉండాలి, వారం రోజుల తరువాత వర్ణం వచ్చే కాయలనే తోటల్లో ఏరి మరీ కోస్తుంటారు. ఇక్కడి నుంచి ఢిల్లీకి లోడ్‌ లారీ చేరుకోవాలంటే కనీసం  ఆరు రోజుల సమయం పడుతుంది. అప్పటి వరకు కాయలు చెడిపోకుండా బందోబస్తు చేయడం కూలీల ప్రత్యేకత.

బొప్పాయికి భలే డిమాండ్‌
బయట రాష్ట్రాలతో పాటు, రాయలసీమ జిల్లాల్లో చిత్తూరు మినహా అన్ని జిల్లాల్లో గతంలో కురిసిన వర్షాలకు బొప్పాయి తోటలు దెబ్బతిన్నాయి. దీంతో ఇక్కడి బొప్పాయికి మంచి డిమాండ్‌ ఏర్పడింది. ప్రస్తుతం ఇక్కడి మార్కెట్లో కిలో రూ.18 వరకు ధర పలుకుతోంది. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, రాజస్థాన్‌ మార్కెట్లలో కిలో రూ.50 నుంచి రూ. 60 వరకు ధరలు పలుకుతుండడం గమనార్హం. (క్లిక్‌: మదనపల్లెకు కొత్త మాస్టర్‌ ప్లాన్‌)
 

తోటల వద్దనే కొనుగోలు చేస్తున్నారు
 
బొప్పాయి తోటల వద్దకే వ్యాపారులు వచ్చి కాయల్ని కొనుగోలు చేస్తున్నారు. బయట రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు ముందుగా తమను సంప్రదించి ధర నిర్ణయిస్తారు. ఢిల్లీకి తరలించే బొప్పాయిని  జాగ్రత్తగా నైపుణ్యం కలిగిన కూలీల చేత కోయిస్తారు. వాటిని భద్రంగా ప్యాకింగ్‌ చేసి వాహనాల్లో లోడ్‌ చేసి తీసుకెళుతుంటారు.     
– సుధాకర్‌రెడ్డి, బొప్పాయి రైతు, చెరవుమొరవపల్లె 
  

మూడు ఎకరాల్లొ సాగు చేశా
 
ఈసీజన్‌లో మూడు ఎకరాల్లో బొప్పాయి సాగు చేశాను. ప్రస్తుతం తోటల వద్దకే వచ్చి వ్యాపారులు కిలో రూ. 18 చొప్పున ధర ఇస్తున్నారు. కూలీఖర్చు, మార్కెట్‌కు తరలించడం వంటి అన్ని ఖర్చులు వ్యాపారులే భరిస్తారు. ప్రస్తుతానికి మంచి గిట్టుబాటు ధరలే ఉన్నాయి.     
– రామయ్య, బొప్పాయి రైతు, కొత్తపల్లె

మరిన్ని వార్తలు