వెయ్యేళ్ల అన్నమయ్య ‘కాలి’బాట.. ఎక్కడుందో తెలుసా!

16 Nov, 2022 18:38 IST|Sakshi

నేటికీ అదేబాటలో వెంకన్నభక్తుల నడక

కాలిబాట ఆద్యంతం ఆహ్లాదకరం, అధ్యాత్మికం

పుణ్యపవిత్రమైన మార్గంగా కాలిబాట ప్రాచుర్యం

18న రాజంపేట నుంచి ఆకేపాటి 20వ సారి పాదయాత్ర 

అదిగో అల్లదిగో.. అంటూ శ్రీవారిని స్మరిస్తూ.. వేడుకొంటూ అత్యంతభక్తితో రాజంపేట మండలంలోని తాళ్లపాక వాసి పదకవితాపితామహడు అన్నమాచార్యులు ఏడుకొండలను ఎక్కిన కాలిబాట అది. ఇది వెయ్యేళ్ల కిందటి మాట. ఆహ్లాదరకమైన దట్టమైన అటవీమార్గంలో శ్రీవారిని దర్శించుకునేందుకు ఆ రోజుల్లో పూర్వీకులు వేలసంఖ్యలో వెళ్లేవారు. అన్నమయ్య వారసులు సైతం ఈ మార్గంలో కొండకు నడిచివెళ్లారు. టీటీడీ అన్నమయ్య కాలిబాట అభివృద్ధికి నడుం బిగించి భక్తులను ఆనందపరవశులను చేస్తోంది. 


రాజంపేట:
కలియుగదైవం శ్రీ వెంకటేశ్వరస్వామిపై 32వేల కీర్తనలను రాసి ఆలపించి, మహాభక్తునిగా ప్రఖ్యాతిగాంచిన శ్రీమాన్‌ తాళ్లపాక అన్నమాచార్యులు తిరుమలకు నడిచి వెళ్లిన కాలిబాటలో వెళ్లడం మహాభాగ్యంగా  శ్రీవారిభక్తులు భావిస్తున్నారు. ఆ కాలిబాటలో తిరుమల కొండకు చేరుకుంటున్నారు. 


అన్నమయ్య కాలిబాట అభివృద్ధికి.. 

గతంలో అన్నమయ్య కాలిబాటను పునరుద్ధరించాలని డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి దివంగత సీఎం వైఎస్‌రాజశేఖరరెడ్డిని కలిసి వినతిపత్రం అందచేశారు. అప్పట్లో వైఎస్సార్‌ స్పందించి టీటీడీకి ఈ కాలిబాటను పరిశీలించాలని ఆదేశాలు కూడా జారీచేశారు. అయితే సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో టీటీడీ బోర్డు చైర్మన్‌ వైవీసుబ్బారెడ్డి ఆధ్వర్యంలోని పాలకమండలి అన్నమయ్య కాలిబాట అభివృద్ధికి అమోదం తెలిపింది. ఆ దిశగా చర్యలు చేపట్టడంలో టీటీడీ నిమగ్నమైంది.  


18న ఆకేపాటి అన్నమయ్య కాలిబాటలో.. 

ఈనెల 18న శుక్రవారం జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఆకేపాటి అమర్‌నాథరెడ్డి 20వసారి వేలాదిమందితో అన్నమయ్య కాలిబాటలో పాదయాత్రను చేపట్టి ఏడుకొండలకు చేరుకోనున్నారు. ఈయనతో పాటు అనేకమంది గోవిందమాలలు ధరించి అన్నమయ్య కాలిబాటలో వెళ్లనున్నారు. ఉదయం ఆకేపాటి శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో వైభవంగా కల్యాణోత్సవం నిర్వహించనున్నారు.  

కాలిబాట స్వరూపం.. 
► మామండూరు–బాలపల్లె మధ్య స్వామిపాదాలు నుంచి తిరుమల కాలిబాట ప్రారంభమవుతుంది. పక్షుల కిలకిలలు, సెలయేళ్లు, ఆహ్లాదకరమైన వాతావరణం నడుమ కొండకు చేరుకుంటుంది. 
► అవ్వతాతగుట్టలు, శుక్రవారం బండలు, పురాతన సత్రాలు, ఎర్రిగుంటలు, ఈతకాయల మండపం నుంచి గోగర్భతీర్థం (తిరుమల)చేరుకుంటుంది.  
► సుమారు ఈ కాలిబాట 14 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కాలిబాట పూర్తిగా దట్టమైన అడవిలో ఉంది. 
► పాదాలు, అక్కడి కోనేరు, సత్రాలు కాలగర్భంలో కలిసిపోయాయి. 

కాలిబాటకు వెయ్యేళ్లు... 
రాజంపేట మండలంలోని తాళ్లపాక నుంచి అన్నమయ్య నడిచి వెళ్లిన కాలిబాట నేడు శిథిలమైంది. వెయ్యేళ్ల క్రితం ఉన్న రహదారి అభివృద్ధికి టీటీడీ దృష్టి సారించింది.  ఈ బాట ద్వారా వెయ్యేళ్ల క్రితం నుంచి భక్తులు గోవిందనామస్మరణాలు చేసుకుంటూ శ్రీవారిసన్నిధికి చేరుకుంటూనే ఉన్నారు. 

ఉత్తర, దక్షిణ భారతీయులకు అనుకూలం... 
పూర్వం తిరుమలకు ఈ దారి గుండా అధికసంఖ్యలో శ్రీవారి భక్తులు వెళ్లేవారు. అయితే తిరుపతి నుంచి ఏడుకొండల మీదుగా తిరుమల చేరుకోవడం నేడు పరిపాటిగా మారింది. ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశంతో పాటు తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలకు చెందిన వారు తిరుపతికి వెళ్లకుండానే నేరుగా అన్నమయ్య కాలిబాట ద్వారా స్వామి సన్నిధికి చేరుకోగలరు. స్వామి సన్నిధికి చేరుకునే పుణ్యపవిత్రమైన మార్గంగా కాలిబాట ప్రాచుర్యం పెరుగుతోంది. 


కాలిబాటలో శ్రీవారిని దర్శించుకోవడం మహాభాగ్యం.. 

పదకవితా పితామహడు తాళ్లపాక అన్నమాచార్యులు తిరుమలకు నడిచివెళ్లిన కాలిబాటలో వెళ్లి శ్రీవారిని దర్శించుకోవడం మహాభాగ్యం. ఇప్పటికే అనేకమంది భక్తులు గోవిందమాల ధరించి ఆ మార్గంలో కొండకు చేరుకుంటున్నారు. ఈ మార్గాన్ని అభివృద్ధి చేసేందుకు టీటీడీ ముందుకు రావడం శుభపరిణామం. జడ్పీచైర్మన్‌ ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి కాలిబాటలో వేలాదిమంది భక్తులతో కొండకు 20వ సారి వెళుతున్నారు.     
– చొప్పా ఎల్లారెడ్డి, వైస్‌చైర్మన్, ఎఐటీఎస్, రాజంపేట
 

అన్నమయ్య కాలిబాట అభివృద్ధికి ఆకేపాటి కృషి 

అన్నమయ్య కాలిబాట అభివృద్ధికి జెడ్పీ చైర్మన్‌ ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి ఎంతగానో కృషిచేసారు. దివంగత సీఎం, ప్రస్తుతం సీఎం, టీటీడీ చైర్మన్‌ దృష్టికి కాలిబాట అంశం అనేకసార్లు తీసుకెళ్లారు. ఫలితంగా ఇప్పుడు అన్నమయ్య కాలిబాట అభివృద్ధి దిశగా టీటీడీ అడుగులు వేసింది. అన్నమయ్య కాలిబాటలో వెళ్లే భక్తులకు వైద్య ఆరోగ్యశాఖ కూడా వైద్య సేవలందించేందుకు అందుబాటులో ఉంటారు.
– పిల్లిపిచ్చయ్య, అధ్యక్షుడు, రాజంపేట తాలుకా పెన్షనర్ల సంఘం

మరిన్ని వార్తలు