సీఎం జగన్‌ ఆదేశాలు.. ‘అన్నమయ్య’ పునరుద్ధరణకు శ్రీకారం

23 Dec, 2022 12:29 IST|Sakshi

రూ.635.21 కోట్ల వ్యయంతో టెండర్‌ ముసాయిదా షెడ్యూల్‌

లంప్సమ్‌–ఓపెన్‌ విధానంలో రెండేళ్లలో పూర్తి 

జ్యుడిషియల్‌ ప్రివ్యూ ఆమోదించగానే పనులకు టెండర్‌ నోటిఫికేషన్‌ 

అదనపు స్పిల్‌ వే నిర్మాణంపై నిపుణుల నివేదికను బుట్టదాఖలు చేసిన టీడీపీ సర్కార్

ఫలితంగా గతేడాది ఆకస్మిక వరదలకు తెగిన మట్టికట్ట

సాక్షి, అమరావతి: అన్నమయ్య ప్రాజెక్టు పునరుద్ధరణ పనులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. చెయ్యేరుకు ఎంత వరద వచ్చినా సులభంగా దిగువకు విడుదల చేసేలా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అధికారులు పునరుద్ధరణ పనులు చేపట్టారు.

రూ.635.21 కోట్ల అంచనా వ్యయంతో లంప్సమ్‌–ఓపెన్‌ విధానంలో రెండేళ్లలో పూర్తి చేయాలనే షరతుతో రూపొందించిన టెండర్‌ ముసాయిదా షెడ్యూల్‌ను జలవనరుల శాఖ ఎస్‌ఈ కె.శ్రీనివాసులు బుధవారం జ్యుడిషియల్‌ ప్రివ్యూకు పంపారు. జ్యుడిషియల్‌ ప్రివ్యూ ఆమోదంతో టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసి రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా తక్కువ ధరకు ముందుకొచ్చిన కాంట్రాక్టు సంస్థకు పనులు అప్పగించనున్నారు.

ఎన్నడూ లేని రీతిలో..
చెయ్యేరుకు వందేళ్లకు ఒకసారి గరిష్టంగా 2.40 లక్షల క్యూసెక్కులు, రెండు వందల ఏళ్లకు ఒకసారి గరిష్టంగా 2.85 లక్షల క్యూసెక్కుల వరద వస్తుందని జలవనరుల శాఖ అధికారులు అంచనా వేయగా 140 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా గతేడాది నవంబర్‌ 19న చెయ్యేరు నుంచి అన్నమయ్య ప్రాజెక్టులోకి 3.20 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం పోటెత్తింది. ఆ స్థాయిలో వరదను దిగువకు విడుదల చేసే సామర్థ్యం స్పిల్‌ వేకు లేకపోవడంతో మట్టికట్ట తెగిపోయింది.

ఈ నేపథ్యంలో చెయ్యేరుకు నాలుగు లక్షల క్యూసెక్కుల కంటే ఎక్కువ వరద వచ్చినా సులభంగా దిగువకు విడుదల చేసేలా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అన్నమయ్య ప్రాజెక్టును పునరుద్ధరించాలని సీఎం జగన్‌ ఆదేశించారు. ఈ పనులు చేపట్టడానికి రూ.787.77 కోట్లతో జలవనరుల శాఖ నవంబర్‌ 2న పరిపాలన అనుమతి ఇచ్చింది.

నిపుణుల నివేదికపై టీడీపీ సర్కారు పెడచెవి
అన్నమయ్య జిల్లాలో రాజంపేట మండలం బాదనగడ్డ వద్ద చెయ్యేరుపై 2.24 టీఎంసీల సామర్థ్యంతో అన్నమయ్య ప్రాజెక్టును 1981లో ప్రారంభించి 2001కి పూర్తి చేశారు. ప్రాజెక్టు కింద 22,500 ఎకరాల ఆయకట్టు ఉంది. 

వరదను దిగువకు విడుదల చేసేలా 206.65 మీటర్ల ఎత్తుతో 94 మీటర్ల పొడవున స్పిల్‌ వే, అనుబంధంగా 336 మీటర్ల పొడవున మట్టికట్ట­ను నిర్మించారు. స్పిల్‌ వేకు 13.75 మీటర్ల ఎత్తు, 14 మీటర్ల వెడల్పుతో ఐదు గేట్లు అమర్చారు. 

 2012లో జల వనరుల శాఖ నిర్వహించిన 3–డీ అధ్యయనంలో అన్నమయ్య ప్రాజెక్టు స్పిల్‌వే నుంచి గరిష్టంగా 2.17 లక్షల క్యూసెక్కులే దిగువకు విడుదల చేయవచ్చని తేలింది. 2017లో ప్రాజెక్టును తనిఖీ చేసిన డ్యామ్‌ సేఫ్టీ కమిటీ 1.30 లక్షల క్యూసెక్కుల వరదను దిగువకు విడుదల చేసేలా అదనంగా మరో స్పిల్‌ వే నిర్మించాలని అందచేసిన నివేదికను టీడీపీ సర్కారు బుట్టదాఖలు చేసింది.  

గతేడాది నవంబర్‌ 16, 17, 18, 19 తేదీల్లో శేషాచలం– నల్లమల అడవులు, చెయ్యేరు, బహుదా, మాండవ్య పరీవాహక ప్రాంతాల్లో కుంభవృష్టి కురిసింది. 17న అన్నమయ్య ప్రాజెక్టులో సగటున 1.75 టీఎంసీలను నిల్వ చేస్తూ వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు వదిలేశారు. 18న రాత్రి 8 గంటలకు వరద 77,125 క్యూసెక్కులకు చేరడంతో దిగువకు 1,09,124 క్యూసెక్కులను వదులుతూ వచ్చారు. అదే రోజు రాత్రి పది గంటలకు ప్రాజెక్టు గేట్లను పూర్తిగా ఎత్తివేసి 1,46,056 క్యూసెక్కులు దిగువకు వదిలేశారు. 19న తెల్లవారుజామున 3 గంటలకు అన్నమయ్య ప్రాజెక్టులోకి 3.20 లక్షల క్యూసెక్కుల వరద రావటంతో మట్టం గరిష్ట స్థాయికి చేరింది. సామర్థ్యం చాలక మట్టికట్ట పైనుంచి దిగువకు వరద పారింది. దీంతో 19న ఉదయం 6.30 గంటలకు అన్నమయ్య ప్రాజెక్టు మట్టికట్ట తెగింది.
చదవండి: బాలయ్యా.. ఇటు రావేమయ్యా.. కిష్టప్ప.. ఎక్కడున్నావప్పా.. 

టెండర్‌ నిబంధనలు ఇవీ..
కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) ప్రమాణాల ప్రకారం చెయ్యేరుకు గరిష్టంగా వచ్చే వరదపై అధ్యయనం చేసి అంతకంటే ఎక్కువ సామర్థ్యంతో వరదను దిగువకు విడుదల చేసేలా స్పిల్‌ వే నిర్మించాలి.
సీపీడబ్ల్యూఆర్‌ఎస్‌ (సెంట్రల్‌ పవర్‌ వాటర్‌ రీసెర్చ్‌ స్టేషన్‌), ఏపీఈఆర్‌ఎల్‌ (ఆంధ్రప్రదేశ్‌ ఇంజనీరింగ్‌ రీసెర్చ్‌ ల్యాబ్‌), సీడబ్ల్యూసీ లాంటి అధీకృత సంస్థలతో అధ్యయనం చేపట్టి జలవనరుల శాఖ సూచనల ప్రకారం ప్రాజెక్టును పునరుద్ధరించాలి.
ప్రాజెక్టు వద్ద భౌగోళిక పరిస్థితులపై అధ్యయనం నిర్వహించి డయాఫ్రమ్‌ వాల్‌ / ఇతర పద్ధతుల్లో పునాది నిర్మాణంపై నిర్ణయించాలి. 

మరిన్ని వార్తలు