Lipstick Seeds: లిప్‌స్టిక్ తయారీకి వాడే గింజలు ఇవే...

17 Sep, 2021 14:32 IST|Sakshi

మన్యం ముంగిట.. రంగుల పంట

ఒక్కసారి నాటితే 25 ఏళ్ల వరకు దిగుబడి

మూడెకరాల్లో పండిస్తున్న గిరిజన రైతు

9 నెలల్లోనే పంట చేతికొచ్చిన వైనం

సాక్షి, బుట్టాయగూడెం: పశ్చిమ గోదావరి జిల్లా ఏజెన్సీలో కొత్తరకం సాగుకు గిరిజన రైతు శ్రీకారం చుట్టాడు. లిప్‌స్టిక్‌ గింజలుగా పేర్గాంచిన జాఫ్రా పంట సాగు మొదలుపెట్టి తొలి ప్రయత్నంలోనే సత్ఫలితాలు సాధించాడు. బుట్టాయగూడెం మండలం దాసయ్యపాలెంకు చెందిన మడకం జంపాలరావు దాదాపు 30 ఏళ్లుగా 100 ఎకరాల్లో పలు రకాల పంటలు సాగుచేస్తున్నాడు. ఇటీవల తూర్పుగోదావరి, విశాఖ మన్య ప్రాంతంలో పర్యటించిన సమయంలో జాఫ్రా సాగు గురించి తెలుసుకున్నాడు. ఈ సాగు అతడిని ఆకట్టుకోవడంతో మొదటగా మూడు ఎకరాల్లో సాగు ప్రారంభించాడు. సాధారణంగా 14 నెలల్లోపు పంట చేతికి రావాల్సి ఉండగా 9 నెలలకే దిగుబడి సాధించాడు.  
 

జాఫ్రా అంటే..  
►జాఫ్రా మొక్కలు కొండలు, గుట్టల్లో సహజ సిద్ధంగా పెరుగుతాయి.  
►జాఫ్రా మొక్కల కాయల నుంచి ఎర్రటి గింజలు (లిప్‌స్టిక్‌ గింజలు) తీస్తారు.  
►ఈ గింజలను లిప్‌స్టిక్, సౌందర్య సాధనాలు, ఫుడ్‌ కలర్స్, ఆహార ఉత్పత్తులు, అద్దకాలు, మందుల తయారీకి వినియోగిస్తారు.  
►ఆహార ఉత్పత్తుల్లో కృత్రిమ రంగుల వాడకాన్ని అమెరికా నిషేధించడంతో జాఫ్రా గింజలకు డిమాండ్‌ పెరిగింది. 
►జాఫ్రా గింజల వినియోగం పెరగడంతో వాణిజ్య పంటగా రూపుదిద్దుకుంది. 
►జాఫ్రా ఆకులను కామెర్లు, పాము కాటుకు మందుగా ఉపయోగిస్తారు.  
►బెరడను గనేరియా వ్యాధి నివారణకు వినియోగిస్తారు.   
 ►జీసీసీ ద్వారా జాఫ్రా గింజలను కిలో రూ.100 నుంచి రూ.120 వరకు కొనుగోలు చేస్తున్నారు. 

ఎకరాకు 160 మొక్కల చొప్పున 
రంపచోడవరం నుంచి మొక్కలను తీసుకువచ్చి ఎకరాకు 160 చొప్పున మూడెకరాల్లో నాటాను. మొక్కల ఎదుగుదల ఆశాజనకంగా ఉంది. సాధారణంగా పంట 14 నెలలకు చేతికి వస్తుంది. అయితే నేను వేసిన పంట 9 నెలలకే దిగుబడి వచి్చంది. తూర్పుగోదావరి జిల్లా రైతులు ఎకరాకు ఏడున్నర క్వింటాళ్ల దిగుబడి సాధించగా మా పంట 10 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని ఆశిస్తున్నా. ప్రస్తుతం మూడెకరాల్లో పంటను వేశాను. వచ్చే ఏడాది 50 ఎకరాల్లో పంట వేయాలని అనుకుంటున్నా. ఐటీడీఏ ద్వారా పంటను కొనుగోలు చేస్తే మరింత మంది గిరిజనులు జాఫ్రా సాగుకు ముందుకు వస్తారు. ఇంటర్‌నెట్‌లోనూ సాగు వివరాలు తెలుసుకున్నా. అంతర్జాతీయ మార్కెట్‌లో జాఫ్రా గింజలకు కిలో రూ.1,200 వరకు ధర పలుకుతోంది.   
–మడకం జంపాలు, గిరిజన రైతు, దాసియ్యపాలెం, బుట్టాయగూడెం మండలం 

జాఫ్రా గింజలు  

మరిన్ని వార్తలు