సత్యదేవుడి ప్రసాదం ముప్పావుగంటలో సిద్ధం

4 Aug, 2021 10:40 IST|Sakshi

ముప్పావుగంటలో ప్రసాదం రెడీ

యంత్రాల సహాయంతో సత్యదేవుని ప్రసాద తయారీ

కొత్త భవనంలో ప్రారంభం

45 నిమిషాల్లోనే ముగిసిన ప్రక్రియ

అన్నవరం: సత్యదేవుని గోధుమ నూక ప్రసాదాన్ని యంత్రాల ద్వారా తయారు చేయడానికి మంగళవారం శ్రీకారం చుట్టారు. ఈ ప్రక్రియ కొత్త భవనంలో మొదలైంది. తొలి కళాయిలో 80 కిలోల ప్రసాదం తయారైంది. స్వామికి నివేదన సమర్పించాక ప్యాకింగ్‌ సిబ్బంది 150 గ్రాముల చొప్పున విస్తర్లలో ప్యాక్‌ చేసి, విక్రయ కౌంటర్లకు పంపించారు. మంగళవారం భక్తుల సంఖ్య తక్కువగా ఉంటుందని, 98 కళాయిల్లో 7,930 కిలోల ప్రసాదం తయారు చేశామని అధికారులు తెలిపారు.

ప్రసాదం తయారీ ఇలా..
తొలుత వంద డిగ్రీల సెల్సియస్‌ వేడినీరు 40 లీటర్లు గొట్టం ద్వారా కళాయిలో పడింది. అందులో 35 కిలోల గోధుమ నూక మరో గొట్టం ద్వారా, ఇంకో గొట్టం ద్వారా రెండు విడతలుగా 30 కిలోల పంచదార పడ్డాయి. ప్రసాదం ఉడికిన తర్వాత ఆరు కిలోల నెయ్యి, 150 గ్రాముల యాలకుల పొడిని సిబ్బంది కలిపారు. కళాయికి ఇరువైపులా ఉన్న చక్రాలను ముందుకు వంచడం ద్వారా ప్రసాదం మరో తొట్టెలో పడింది. ప్యాకింగ్‌ సమయంలో మరికొంత నెయ్యి కలుపుతామని సిబ్బంది తెలిపారు. ఈ తయారీ ప్రక్రియ 45 నిమిషాల్లో ముగియడం ఆశ్చర్యం కలిగించింది. భవన దాత మట్టే సత్యప్రసాద్‌ చొరవ తీసుకుని యంత్రాల పనితీరు పర్యవేక్షణకు నలుగురు టెక్నీషియన్లను పంపించారు.

దేవస్థానం పీఆర్‌ఓ కె.కొండలరావు, ఈఈ వి.రామకృష్ణ, ఆలయ ఏఈఓ డీవీఎస్‌ కృష్ణారావు తదితరులు ప్రసాద తయారీని పరిశీలించారు. యంత్రాలకు సమీపాన ప్యాకింగ్‌ చేస్తుండడంతో కొంచెం వేడి వస్తోందని సిబ్బంది తెలిపారు. కుకింగ్, ప్యాకింగ్‌ల మధ్యన అడ్డంగా అద్దాలు అమర్చి, అదనంగా ఫ్యాన్లు బిగించేలా చూస్తామని భవన దాత సత్యప్రసాద్‌ వారికి హామీ ఇచ్చారు. ఆలయ సూపరింటెండెంట్‌ బలువు సత్యశ్రీనివాస్, ప్రసాదం సూపరింటెండెంట్‌ భాస్కర్, సీనియర్‌ అసిస్టెంట్‌ బండారు వేంకట రమణ తదితరులు ప్రసాదం తయారీ ఏర్పాట్లను పర్యవేక్షించారు.

తయారీ సులభం
ప్రసాదం తయారీ  సులభంగా ఉంది. నలుగురు రెగ్యులర్, నలుగురు ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది తయారు చేస్తున్నారు. ఏకకాలంలో 20 కళాయిల ద్వారా కూడా ప్రసాదం తయారు చేయవచ్చు.
- పీఎస్‌ఎస్‌వీ ప్రసాదరావు, ప్రసాదం హెడ్‌ కుక్‌

ప్యాకింగ్‌ వేగం
ప్రసాదం ప్యాకింగ్‌ కూడా వేగంగా జరుగుతోంది. తయారీకి, ప్యాకింగ్‌ చేసే ప్రదేశం దగ్గరగా ఉండడంతో కొంత వేడి వస్తోంది. దీంతో ఇబ్బంది పడాల్సి వస్తోంది. వేడి రాకుండా ఏర్పాట్లు చేయాలి.
- వీవీఎస్‌ కుమార్, సీనియర్‌ ప్యాకర్‌

మరిన్ని వార్తలు