కరోనాను జయించిన అన్నే ఫెర్రర్‌

7 Aug, 2020 09:31 IST|Sakshi

తన కోసం ప్రార్థించిన వారికి కృతజ్ఞతలు 

పరామర్శించిన కలెక్టర్‌ గంధం చంద్రుడు 

బత్తలపల్లి: ఆర్డీటీ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అన్నేఫెర్రర్‌ కరోనాను జయించారు. వైరస్‌ నుంచి కోలుకున్న ఆమె గురువారం ఆర్డీటీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. వారం రోజుల క్రితం కరోనా సోకడంతో ఆమెను బత్తలపల్లి ఆర్డీటీ ఆసుపత్రికి తీసుకొచ్చారు. మెరుగైన వైద్యంతో త్వరగా కోలుకున్నారు. ఈ సందర్భంగా అన్నే ఫెర్రర్‌ మాట్లాడుతూ ‘మరోసారి నేను ఇంటికి వచ్చేశాను, మళ్లీ పని కొనసాగిస్తున్నాను. నేను కోలుకోవాలని, నా ఆరోగ్యం బాగుండాలని ఎన్నో సందేశాలు, ప్రార్థనలు చేసిన వారందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా’ అని పేర్కొన్నారు. ప్రజల దీవెనలు, బత్తలపల్లి ఆసుపత్రి వైద్యుల బృందం అంకితభావంతో చేసిన సేవల వల్ల తాను త్వరగా కోలుకున్నట్లు వివరించారు. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడంలోనూ, కోవిడ్‌ చికిత్సా కేంద్రాలను ప్రజలకు సౌకర్యవంతంగా చేయడంలోనూ అనంతపురం అధికార యంత్రాంగం చేస్తున్న అవిశ్రాంతి కృషిని కొనియాడారు. ఆమె వెంట ఆర్డీటీ డైరెక్టర్‌ విశాలా ఫెర్రర్, మెడికల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ప్రవీణ్‌కుమార్, వైద్యులు పాల్, రీజనల్‌ డైరెక్టర్‌ మల్లిఖార్జున, ఏటీఎల్‌ వేమయ్య తదితరులున్నారు. 

అనంతపురం సప్తగిరి సర్కిల్‌: ఆర్డీటీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అన్నే ఫెర్రర్‌ను జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు గురువారం సాయంత్రం పరామర్శించారు. కరోనా నుంచి కోలుకున్న నేపథ్యంలో ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్‌ మాంఛో ఫెర్రర్‌ పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు