బీసీ కార్పొరేషన్లకు నేడు పదవుల ప్రకటన

30 Sep, 2020 04:33 IST|Sakshi

29 చైర్మన్‌ పదవులు మహిళలకు..

సాక్షి, అమరావతి: రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా భారీగా బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేసిన ప్రభుత్వం బుధవారం చైర్మన్లు, డైరెక్టర్ల పదవులను ప్రకటించనుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల హామీ మేరకు బీసీలకు రాజకీయంగా సముచిత ప్రాధాన్యం కల్పిస్తూ కార్పొరేషన్ల పదవులను ఖరారు చేసే బాధ్యతను పార్టీ సీనియర్‌ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, వేణుంబాక విజయసాయిరెడ్డి, మోపిదేవి వెంకటరమణారావు, వైవీ సుబ్బారెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిలకు అప్పగించారు. వారు పలు దఫాలుగా కసరత్తు చేసి పేర్లను ఖరారు చేశారు. సాధ్యమైనన్ని బీసీ కులాలకు పదవుల్లో ప్రాతినిధ్యం కల్పించినట్లు సమాచారం. బీసీల ఆర్థిక, సామాజిక ప్రగతి కోసం ఏర్పాటైన 56 కార్పొరేషన్లలో చైర్మన్‌ పదవులు 29 మహిళలకు, 27 పురుషులకు దక్కే అవకాశం ఉంది.  అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం దక్కనుంది. 

► వన్నికుల క్షత్రియ, అగ్నికుల క్షత్రియ, బెస్త, ఈడిగ, నాగవంశీయులు, పులనాటి వెలమ కులాలకు కూడా కార్పొరేషన్లను ఏర్పాటు చేయబోతున్నారు. 
► డైరెక్టర్‌ పదవుల్లో 50 శాతం మహిళలను నామినేట్‌ చేయనున్నారు.
► ప్రతి జిల్లాకు కనీసం 4 కార్పొరేషన్లకు తగ్గకుండా పదవులు కేటాయించారు. కొన్ని జిల్లాలకు 5, 6 పదవులను ఇవ్వబోతున్నట్లు తెలిసింది. 

మరిన్ని వార్తలు