చండీఘడ్‌లో 54.1 శాతం కుటుంబాలకు ఏసీ.. ఏపీ, తెలంగాణాలో ఎంత శాతం అంటే?

13 Mar, 2023 04:20 IST|Sakshi

దేశవ్యాప్తంగా ఏటా 75 లక్షల ఏసీల విక్రయాలు

శ్రీసిటీలో 60 లక్షలకు పైగా ఏసీల తయారీ సామర్థ్యంతో యూనిట్లు 

అత్యధికంగా చండీఘడ్‌లో 54.1% కుటుంబాలకు ఏసీలు

దక్షిణాదిన కేరళ ఫస్ట్‌.. 10.4  శాతంతో రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్‌

దేశవ్యాప్తంగా కేంద్ర పాలిత ప్రాంతాల్లోనే ఎయిర్‌ కండీషనర్ల వినియోగం అధికంగా ఉంది. అత్యధికంగా చండీఘడ్‌లో 54.1 శాతం కుటుంబాలు ఏసీ నీడన సేదతీరుతున్నాయి. దేశంలో 4.9 శాతం కుటుంబాలకు ఏసీ సదుపాయం ఉన్నట్లు నేషనల్‌ శాంపిల్‌ సర్వే నివేదిక వెల్లడించింది.

దక్షిణాది రాష్ట్రాల్లో అగ్రస్థానంలో ఉన్న కేరళలో 10.4 శాతం, ఏపీలో 8.1 శాతం కుటుంబాలు ఏసీలను వాడుతున్నాయి. తెలంగాణలో 6.6 శాతం, తమిళనాడులో 6.1 శాతం కుటుంబాలకు ఏసీలున్నాయి. అత్యల్పంగా బిహార్‌లో 0.4 శాతం, ఒడిశాలో 1.5 శాతం, కర్ణాటకలో 1.8 శాతం కుటుంబాలు ఏసీలను వినియోగిస్తున్నాయి.

శ్రీసిటీలో పలు యూనిట్లు
దేశవ్యాప్తంగా ఏటా సగటున 75 లక్షల ఏసీల విక్ర­యాలు జరుగుతున్నట్లు అంచనా. ఎండలు చుర్రు­మ­నే దక్షిణాదిలో ఏసీల వినియోగం పెంచడంపై తయారీ సంస్థలు దృష్టి సారించాయి. ఆంధ్రప్రదే­శ్‌లోని శ్రీసిటీలో పలు ఏసీల తయారీ యూనిట్లు ఏర్పాటు కావడంతోపాటు ఉత్పత్తి కూడా ప్రారంభించాయి.

డైకిన్, బ్లూస్టార్, హావెల్స్, పానాసోనిక్, యాంబర్, ఈపాక్‌ లాంటి సంస్థలు తమ యూని­ట్లను ఏపీలో నెలకొల్పుతున్నాయి. బ్లూస్టార్‌ విస్తర­ణ కార్యక్రమాలను సైతం చేపట్టింది. ఏటా వీటి మొత్తం ఉత్పత్తి సామర్థ్యం 60 లక్షలకు పైగా ఉంది. 

వ్యత్యాసం ఎందుకంటే..? 
కేంద్ర పాలిత ప్రాంతాల్లో జనాభా తక్కువగా ఉండటం, అత్యధికంగా ఉపాధి అవకాశాలు, పన్నులు తక్కువ ఉండటం లాంటి కారణా­లు కొనుగోలు శక్తిని పెంచుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో అత్యధికంగా వ్యవసా­యం, కూలీలు ఎక్కువగా ఉండటం ఏసీ వినియో­గం తక్కువగా ఉండటానికి కారణం. పట్టణా­లతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఉష్ణోగ్రత­లు, కొనుగోలు శక్తి తక్కువగా ఉంటాయి.
 – ఎం.ప్రసాదరావు, ఏయూ ఎకనామిక్స్‌ విభాగం విశ్రాంత అధిపతి 

సగటు ఏసీ నియోగం
భారత్‌ 4.9%
పట్టణాల్లో12.6% 
గ్రామాల్లో 1.2%

మరిన్ని వార్తలు