ఏజెన్సీలో మరో 32 గర్భిణీ వసతి గృహాలు 

22 Nov, 2022 04:04 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, అమరావతి: కొండలు, కోనల్లో ఉండే గిరిజనుల ఆరోగ్య పరిరక్షణకు సీఎం  వైఎస్‌ జగన్‌ పలు చర్యలు చేపట్టారు. ఏజెన్సీ ప్రాంతాల్లో 159 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీలు) ద్వారా వైద్య సేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా గర్భిణులను అత్యవసర సమయాల్లో డోలీలు, మంచాలపై మోసుకెళ్లకుండా వారి ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పరిరక్షించి, ముందుగానే ఆస్పత్రులకు తరలించేందుకు గిరిజన ప్రాంతాల్లో గర్భిణీ వసతి గృహాలు (బర్త్‌ వెయిటింగ్‌ హోమ్స్‌–బీడబ్ల్యూహెచ్‌) ఏర్పాటు చేస్తున్నారు.

ప్రస్తుతం ఏజెన్సీ ప్రాంతాల్లో ఇవి 45 ఉన్నాయి. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ప్రతిపాదనల మేరకు మరో 32 గర్భిణీ వసతి గృహాలు ఏర్పాటు చేయనున్నారు. వీటితో మొత్తం వీటి సంఖ్య 77కు పెరగనుంది. మారుమూల ప్రాంతాల్లోని గర్భిణులకు తక్షణ వైద్య సేవలు అందించి తల్లీ బిడ్డలను సురక్షితంగా ఇంటికి చేర్చడంలో ఈ వసతి గృహాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతంలో 1818 మారుమూల ప్రాంతాలున్నాయి.          
            
కొండలు, గుట్టలు, అడవులు, సెలయేరులు తదితర మారుమూల ప్రాంతాల్లో ఉండే ప్రజలకు గతంలో వైద్యం గగనమే అయ్యేది. దీంతో మరణాలూ అధికంగానే ఉండేవి. గర్భిణుల అవస్థలు చెప్పనలవి కాదు. సరైన వైద్యం అందక, ప్రసవ సమయానికి ఆస్పత్రికి వెళ్లలేక మరణించిన సంఘటనలు అనేకం ఉన్నాయి. గిరిజనులకు ఈ అవస్థలు తప్పించి, వారికి మంచి వైద్య సేవలను వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అందుబాటులోకి తెస్తోంది.

ఆ ప్రాంతాల్లో తల్లీ బిడ్డలను క్షేమంగా ఉంచేందుకు గర్భిణీ వసతి గృహాలు ఏర్పాటు చేస్తోంది. గిరి రక్షక్‌ పేరుతో ఏర్పాటు చేయనున్న బైక్‌ అంబులెన్స్‌లు నెలలో 25 రోజులపాటు ప్రతి మారుమూల ప్రాంతాన్ని సందర్శించి గర్భిణుల ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తుంటారు. స్థానిక ఏఎన్‌ఎం దగ్గర్నుంచి మండల స్థాయి వైద్యాధికారి, మండల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి గర్భిణులతోపాటు అక్కడి వారి ఆరోగ్య పరిస్థితులను పరిశీలించి తగు చర్యలు చేపడుతుంటారు.

ప్రతి గురువారం గ్రామ సచివాలయ బృందం అన్ని మారుమూల (డోలీపై ఆధారపడిన) ప్రాంతాలను సందర్శిస్తుంది. ప్రతి శనివారం (పలకరింపు) వైద్య బృందం వెళ్లి అక్కడి వారికి ప్రాథమికంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తుంది. ప్రతి మంగళవారం ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు మారుమూల ప్రాంతాలకు వెళ్లి క్షేమ సమాచారం తెలుసుకుంటారు.

డోలీ మరణాల నివారణకు మారుమూల ప్రాంతాల్లోని గర్భిణులను డాక్టర్‌ నిర్ధారించిన ప్రసవ సమయానికి నెల రోజుల ముందుగానే సురక్షిత రవాణా వ్యవస్థ (108 అంబులెన్స్, ఫీడర్‌అంబులెన్స్, బైక్‌ అంబులెన్స్‌) ద్వారా బర్త్‌ వెయిటింగ్‌ హోమ్‌కు తరలిస్తారు. ఈ గృహాల్లో ఏఎన్‌ఎం, ఆశా వర్కర్లు నిరంతరం గర్భిణుల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంటారు. నిత్యం పోషకాహారాన్ని, మందులను అందిస్తారు. మెరుగైన వైద్యం అవసరమైతే సమీపంలోని ప్రాథమిక, సామాజిక, జనరల్‌ ఆసుపత్రులకు తరలిస్తారు.  

మరిన్ని వార్తలు