ఏపీలో మరో 7 ఈఎస్‌ఐ ఆస్పత్రులు

4 Feb, 2021 05:52 IST|Sakshi

రాజ్యసభలో కేంద్ర మంత్రి సంతోష్‌కుమార్‌ గంగ్వార్‌ వెల్లడి

సాక్షి, న్యూఢిల్లీ: గుంటూరు, విజయనగరం, కాకినాడ, పెనుగొండ, విశాఖ, శ్రీసిటీ నెల్లూరు, అచ్యుతాపురంలలో ఈఎస్‌ఐ నూతన ఆస్పత్రులకు సూత్రప్రాయ అనుమతిచ్చినట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్‌ కుమార్‌ గంగ్వార్‌ రాజ్యసభలో తెలిపారు. మార్చి 2023లోగా రూ.73.68 కోట్లతో విజయనగరంలో 100 పడకల ఈఎస్‌ఐ ఆస్పత్రి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. బుధవారం వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, టీడీపీ ఎంపీ కె.రవీంద్రకుమార్‌ అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు. గృహ రుణాల వడ్డీపై రాయితీ చెల్లింపు పథకం (సీఎల్‌ఎస్‌ఎస్‌)ను ఈ ఏడాది మార్చి 31 వరకు పొడిగించినట్లు కేంద్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీ హర్దీప్‌సింగ్‌ పురి తెలిపారు.

ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన(అర్బన్‌) కింద అర్హులైన మధ్యతరగతి ప్రజల గృహ రుణాలపై వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వం సబ్సిడీ రూపంలో చెల్లిస్తుందని విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. కర్నూలు–విజయవాడ, విజయవాడ–కర్నూలు విమాన సరీ్వసులు ఇంకా ప్రారంభం కాలేదని వైఎస్సార్‌సీపీ ఎంపీ పరిమళ్‌ నత్వానీ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. ప్రకాశం బ్యారేజీ–హైదరాబాద్, విజయవాడ–నాగార్జున సాగర్‌ మధ్య సీ–ప్లేన్‌ సర్వీసులు ఇంకా ప్రారంభం కాలేదన్నారు. గత 19 నెలల్లో ఏపీలోని హిందూ దేవాలయాలపై 140కి పైగా దాడులు, దేవతా విగ్రహాలను కూల్చివేసి, అపవిత్రం చేయడం వంటి ఘటనలు జరిగాయని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు రాజ్యసభ జీరో అవర్‌లో ప్రస్తావించారు. 

చేనేత రంగాన్ని ఆదుకోవాలి 
ఏపీ సహా దేశవ్యాప్తంగా చేనేత రంగాన్ని ఆదుకోవాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్, మౌలిక సదుపాయాల రంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని వైఎస్సార్‌సీపీ సభ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. చెన్నై–బెంగళూరు–మైసూరు హైస్పీడ్‌ రైలుపై వైఎస్సార్‌సీపీ ఎంపీ రెడ్డప్ప అడిగిన ప్రశ్నకు రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌ బదులిచ్చారు.  అనంతపురం నుంచి ఢిల్లీలోని ఆదర్శనగర్‌ వరకూ కిసాన్‌ రైలు సేవలు అందిస్తున్నట్లు వైఎస్సార్‌సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు.  వైఎస్సార్‌సీపీ ఎంపీలు కోటగిరి శ్రీధర్, ఎన్‌.రెడ్డెప్ప, బి.సత్యవతి, ఆదాల ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు సంబంధిత కేంద్రమంత్రులు సమాధానమిచ్చారు. పుణేలోని సీ–డాక్‌లో జాతీయ కృత్రిమ మేథస్సు సూపర్‌ కంప్యూటర్‌ ‘పరం సిద్ధి’ ఏర్పాటుకు రూ.72.25 కోట్లు ఖర్చు చేసినట్లు వైఎస్సార్‌సీపీ ఎంపీ తలారి రంగయ్య అడిగిన ప్రశ్నకు కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకరప్రసాద్‌ బదులిచ్చారు.  

మరిన్ని వార్తలు