Express Highway: ఏపీకి మరో ఎక్స్‌ప్రెస్‌ హైవే..

14 May, 2022 07:37 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, అమరావతి: రాష్ట్రం గుండా మరో ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణం కానుంది. కర్నూలును మహారాష్ట్రలోని షోలాపూర్‌ను అనుసంధానిస్తూ ఆరు లేన్ల ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణానికి జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ఆమోదముద్ర వేసింది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర గుండా పారిశ్రామిక ప్రాంతాలను అనుసంధానిస్తూ 318 కిలోమీటర్ల మేర ఈ జాతీయ రహదారి ఉంటుంది. దీని సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) రూపొందించడం కోసం ఎన్‌హెచ్‌ఏఐ టెండర్లు పిలిచింది.
చదవండి: ఏపీలో ఉత్తమ పోలీస్‌స్టేషన్‌ ఇదే..

భారతమాల ప్రాజెక్టు రెండో దశ కింద దాదాపు రూ.12 వేల కోట్లతో ఈ రహదారి నిర్మిస్తారు. 2025 నాటికి దీనిని పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఈ హైవేతో రాష్ట్రంలోని రాయలసీమ ప్రాంతానికి పశ్చిమ భారతంతో రోడ్‌ కనెక్టివిటీ మరింత మెరుగుపడుతుంది. ప్రస్తుతం కర్నూలు నుంచి నల్గొండ, హైదరాబాద్‌ మీదుగా షోలాపూర్‌ వెళ్లాల్సి వస్తోంది. నూతన రహదారి నిర్మాణం పూర్తయితే కర్నూలు నుంచి షోలాపూర్‌కు దాదాపు 100 కి.మీ. తగ్గుతుంది. కర్నూలు నుంచి మహబూబ్‌నగర్, కర్ణాటకలోకి కోస్గి, రాయచూర్, మహారాష్ట్రలోని షోలాపూర్‌ వరకు ఈ ఆరులేన్ల రోడ్డు నిర్మిస్తారు. ఈ ఎక్స్‌ప్రెస్‌ హైవేను చెన్నై – బెంగళూరు, బెంగళూరు–విజయవాడ ఎక్స్‌ప్రెస్‌ హైవేలతో అనుసంధానించాలని కూడా ప్రణాళిక రూపొందించారు. ఈ ప్రతిపాదనలపై ఎన్‌హెచ్‌ఏఐ త్వరలో నిర్ణయం తీసుకోనుంది.  

మరిన్ని వార్తలు