సీ హారియర్‌ చూసొద్దాం

27 Sep, 2020 06:21 IST|Sakshi
సబ్‌మెరైన్‌ మ్యూజియం ముందు ఏర్పాటు చేయనున్న ముఖద్వారం

యుద్ధ విమానం చూడొచ్చు.. జలాంతర్గామిని చుట్టేయొచ్చు!

విశాఖ బీచ్‌ రోడ్డులో మరో యుద్ధ విమానం

రూ.40 కోట్లతో ఇంటిగ్రేటెడ్‌ మ్యూజియం

రాజీవ్‌ స్మృతి భవన్‌లో సీ హారియర్‌ ఏర్పాటు

టెండర్లకు సిద్ధమవుతున్న వీఎంఆర్‌డీఏ  

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: అందమైన బీచ్‌ రోడ్డులో సరదాగా ముందుకెళ్తుంటే.. సాగర గర్భంలో శత్రు సైన్యానికి వణుకు పుట్టించిన సబ్‌మెరైన్‌ దర్శనమిస్తుంది. యుద్ధ సమయంలో గగనతలాన్ని గడగడలాడించిన టీయూ–142 విమానం కనిపిస్తుంది. ఇప్పుడు దీని పక్కనే మరో యుద్ధ విమాన మ్యూజియం, టూరిజం కాంప్లెక్స్‌ ఏర్పాటుకు విశాఖపట్నం మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (వీఎంఆర్‌డీఏ) సన్నాహాలు చేస్తోంది. విశాఖ నగరాన్ని నంబర్‌ వన్‌ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మార్గదర్శకాలకు అనుగుణంగా బీచ్‌ రోడ్డులో రూ.40 కోట్లతో సీ హారియర్‌ యుద్ధ విమాన మ్యూజియం, టూరిజం కాంప్లెక్స్‌ ఏర్పాటుకు వీఎంఆర్‌డీఏ సిద్ధమవుతోంది. 

సిద్ధంగా.. సీ హారియర్‌ 
► ఆర్కే బీచ్‌లో టీయూ–142 ఎయిర్‌ క్రాఫ్ట్‌ సందర్శకులను  అలరిస్తోంది. కురుసుర జలాంతర్గామి వీక్షకుల మనసు దోచుకుంటోంది.  
► సాగర తీరానికి అదనపు ఆభరణంలా ఇప్పుడు సీ హారియర్‌ యుద్ధ విమానం సన్నద్ధమవుతోంది. 1983లో బ్రిటిష్‌ ఏరో స్పేస్‌ నుంచి కొనుగోలు చేసిన సీ హారియర్‌ నౌకాదళం ఏవియేషన్‌ విభాగంలో చేరింది. గోవాలోని ఐఎన్‌ఎస్‌ హన్సా యుద్ధనౌకలో దాదాపు 32 ఏళ్ల పాటు దేశానికి సేవలందించింది. 2016లో సేవల నుంచి నిష్క్రమించింది.  
► దీనిని వీఎంఆర్‌డీఏ సాగర తీరంలో మ్యూజియంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రాజీవ్‌ స్మృతి భవన్‌లో మ్యూజియం ఏర్పాటు చేయనున్నారు.  

ఫుడ్‌ కోర్టులు.. షాపింగ్‌ కాంప్లెక్స్‌లు 
రూ.10 కోట్లతో ఈ మ్యూజియం అభివృద్ధి చేయనున్నారు. మరో రూ.10 కోట్లతో సబ్‌మెరైన్‌ మ్యూజియంకు సరికొత్త హంగులు అద్దనున్నారు.  
మరో రూ.20 కోట్లతో ఫుడ్‌ కోర్టులు, షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, ఇతర సౌకర్యాలు కల్పించేందుకు వీఎంఆర్‌డీఏ సిద్ధమవుతోంది. 

ఇంటిగ్రేటెడ్‌ మ్యూజియం 
► ప్రస్తుతం ఉన్న టీయూ–142, కురుసుర మ్యూజియంతో పాటు సీ హారియర్‌ను అనుసంధానం చేస్తూ ఇంటిగ్రేటెడ్‌ మ్యూజియంగా 
రూపొందిస్తారు.  
► దీనికి సంబంధించి ప్రాజెక్టు నివేదికను తూర్పు నౌకాదళం సిద్ధం చేసింది. మొత్తంగా రూ.40 కోట్ల అంచనా వ్యయంతో బీచ్‌ రోడ్డులో ఇంటిగ్రేటెడ్‌ మ్యూజియం అందుబాటులోకి రానుంది.  
► రాజీవ్‌ స్మృతి భవన్‌ ప్రస్తుతం జీవీఎంసీ పరిధిలో ఉంది. దీన్ని వీఎంఆర్‌డీఏకు అప్పగించిన వెంటనే టెండర్లకు వెళ్లాలని అధికారులు భావిస్తున్నారు. 

సరికొత్త బీచ్‌ను చూస్తారు  
మూడు ప్రధాన మ్యూజియంలను అనుసంధానిస్తూ ఇంటిగ్రేటెడ్‌ మ్యూజియంగా తీర్చిదిద్దే ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి. సీ హారియర్‌ మ్యూజియం అందుబాటులోకి వచ్చాక.. ప్రతి సందర్శకుడూ బీచ్‌ను సరికొత్తగా చూస్తారు. త్వరలోనే టెండర్లు ఆహ్వానిస్తాం.
– పి.కోటేశ్వరరావు, వీఎంఆర్‌డీఏ కమిషనర్‌  

మరిన్ని వార్తలు