రివర్స్‌ టెండరింగ్‌లో మరో మైలురాయి

23 May, 2021 04:02 IST|Sakshi

‘పోలవరం’ అదనపు పనుల్లో రూ.13.53 కోట్లు ఆదా

 ఇందుకు అయ్యే వ్యయాన్ని కేంద్రమే భరిస్తుందని సీడబ్ల్యూసీ స్పష్టీకరణ 

జ్యుడిషియల్‌ ప్రివ్యూ ఆమోదించిన షెడ్యూళ్లతో రూ.683 కోట్లతో టెండర్‌ నోటిఫికేషన్‌  

రివర్స్‌ టెండరింగ్‌లో రూ.669.47 కోట్లకు పనులు దక్కించుకున్న మేఘా 

గతంలో ఈ పనులు నామినేషన్‌పై అప్పగింత.. టీడీపీ పెద్దలకు కమీషన్లు 

ఇప్పటిదాకా పోలవరం పనుల్లో రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా రూ.843.53 కోట్ల ఆదా

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రివర్స్‌ టెండరింగ్‌ ప్రక్రియలో మరో మైలు రాయి నమోదైంది. పోలవరం ప్రాజెక్టు హెడ్‌ వర్క్స్‌ (జలాశయం) డిజైన్లలో డీడీఆర్పీ (డ్యామ్‌ డిజైన్‌ రివ్యూ ప్యానల్‌), కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) చేసిన మార్పుల మేరకు చేపట్టిన అదనపు పనులకు నిర్వహించిన రివర్స్‌ టెండరింగ్‌లో ఖజానాకు రూ.13.53 కోట్లు ఆదా అయ్యాయి. తద్వారా సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో పారదర్శకతను రాష్ట్ర ప్రభుత్వం మరోమారు చాటి చెప్పింది. మొత్తంగా ఒక్క పోలవరం ప్రాజెక్టు పనులకు నిర్వహించిన రివర్స్‌ టెండరింగ్‌లోనే ఖజానాకు రూ.843.53 కోట్లు ఆదా అయినట్లయింది. కాంట్రాక్టు ఒప్పందంలో లేని పనులను ప్రభుత్వం అదనంగా చేపట్టడానికి సంబంధించిన టెండర్‌ షెడ్యూల్‌ను జల వనరుల శాఖ మార్చి 2న జ్యుడిషియల్‌ ప్రివ్యూకు పంపింది. రూ.683 కోట్ల వ్యయంతో ఈ పనులు చేపట్టడానికి జ్యుడిషియల్‌ ప్రివ్యూ ఆమోదించిన షెడ్యూల్‌తోనే జల వనరుల శాఖ టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

ఈ టెండర్‌లో ఆర్థిక బిడ్‌ను శనివారం తెరిచారు. మేఘా, హెచ్‌ఈఎస్‌ ఇన్‌ఫ్రా సంస్థలు బిడ్‌లు దాఖలు చేసినట్లు వెల్లడైంది. ఆర్థిక బిడ్‌లో రూ.676.24 కోట్లకు కోట్‌ చేసిన సంస్థ ఎల్‌–1గా నిలిచింది. ఇదే ధరను కాంట్రాక్టు విలువగా పరిగణించి రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించారు. రివర్స్‌ టెండరింగ్‌ గడువు ముగిసే సమయానికి రూ.669.47 కోట్లకు కోట్‌ చేసిన మేఘా సంస్థ ఎల్‌–1గా నిలిచింది. ఈ టెండర్‌ను ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి నేతృత్వంలోని ఎస్‌ఎల్‌టీసీ (రాష్ట్ర స్థాయి సాంకేతిక కమిటీ) పరిశీలించి, ఆమోదించింది. దాంతో ఈ టెండర్‌లో ఖజానాకు రూ.13.53 కోట్లు ఆదా అయ్యాయి.  

పారదర్శకతకు గీటురాయి 
► పోలవరంలో 194.6 టీఎంసీలను నిల్వ చేసే ప్రధాన డ్యామ్‌ (ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యామ్‌)ను గోదావరి ఇసుక తిన్నెలపై నిర్మిస్తున్నారు. నదీ ప్రవాహాన్ని మళ్లించడానికి తీరానికి అవతల కుడి వైపున స్పిల్‌వే నిర్మిస్తున్నారు. 
► అత్యంత పటిష్టంగా ప్రాజెక్టును నిర్మించేందుకు డీడీఆర్పీ ప్రతిపాదనల మేరకు సీడబ్ల్యూసీ పలు డిజైన్లను మార్చింది. ఈ క్రమంలో కాంట్రాక్టు ఒప్పందంలో లేని పనులను కొత్తగా చేపట్టడానికి అయ్యే వ్యయాన్ని కేంద్రం రీయింబర్స్‌ చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వానికి సీడబ్ల్యూసీ స్పష్టమైన హామీ ఇచ్చింది.  
► దీంతో సీడబ్ల్యూసీ ఆమోదించిన డిజైన్ల మేరకు అదనంగా చేపట్టాల్సిన పనులకు రూ.683 కోట్లతో ప్రభుత్వం టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఒక ప్రాజెక్టులో అదనంగా చేపట్టాల్సిన పనులకూ రివర్స్‌ టెండరింగ్‌ విధానం పాటించడం పారదర్శకతకు గీటురాయిగా నిలుస్తోందని నిపుణులు పేర్కొంటున్నారు. 
► 2018 సెప్టెంబర్‌ 18న చింతలపూడి ఎత్తిపోతల సామర్థ్యాన్ని పెంచినప్పుడు అదనంగా చేపట్టాల్సిన రూ.563.4 కోట్ల విలువైన పనులను అప్పటి టీడీపీ ప్రభుత్వ పెద్దలు నామినేషన్‌పై కాంట్రాక్టు సంస్థలకు అప్పగించి కమీషన్లు వసూలు చేసుకోవటాన్ని పలువురు గుర్తు చేస్తున్నారు. 
► పోలవరం హెడ్‌వర్క్స్, కుడి, ఎడమ కాలువ పనుల్లో రూ.7,984.93 కోట్ల విలువైన పనులను టీడీపీ హయాంలో నామినేషన్‌పై అప్పగించడాన్ని ఉదహరిస్తున్నారు. 

మరిన్ని వార్తలు