రాష్ట్ర వైద్య శాఖకు మరో జాతీయ పురస్కారం 

25 Apr, 2022 03:55 IST|Sakshi

మలేరియా నిర్మూలనలో అత్యుత్తమ పనితీరు కనబర్చినందుకు అవార్డు

సాక్షి, అమరావతి: మలేరియా నిర్మూలనలో అత్యుత్తమ పనితీరు ప్రదర్శించిన రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖకు జాతీయ స్థాయిలో మరో గుర్తింపు లభించింది. ప్రతి వెయ్యి మంది జనాభాకు ఒక పాజిటివ్‌ కేసుకు మించకుండా ఉండేలా మలేరియాను నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం సఫలీకృతమైంది. దీంతో మన రాష్ట్రం ప్రీ ఎలిమినేషన్‌ దశ (కేటగిరీ–2) నుంచి ఎలిమినేషన్‌ దశ (కేటగిరీ–1)కు చేరుకుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అవార్డు ప్రకటించింది.

ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో నిర్వహించే కార్యక్రమంలో కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి చేతుల మీదుగా రాష్ట్ర కమ్యూనికబుల్‌ డిసీజస్‌ అడిషనల్‌ డైరెక్టర్‌ రామిరెడ్డి అవార్డును సోమవారం అందుకోనున్నారు. ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధతో మలేరియా నిర్మూలనకు ప్రభుత్వం గత మూడేళ్లుగా నిరంతరాయంగా చేసిన కృషి చేస్తోంది. 2018లో 6,040 కేసులు నమోదు కాగా క్రమంగా తగ్గుముఖం పట్టాయి. గత ఏడాది 1,139కి కేసులు తగ్గాయి.

2021లో 75,29,994 రక్త నమూనాలను పరిశీలించగా 1,139 మందికి మలేరియా సోకినట్లు నిర్ధారణయింది. మలేరియా కేసులు వెలుగు చూసిన హైరిస్క్‌ ప్రాంతాలలో ఏటా ఇళ్లలో దోమల నిరోధం కోసం ఇండోర్‌ రెసిడ్యుయల్‌ (ఐఆర్‌ఎస్‌) కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోంది. గత ఏడాది మొత్తం 9.22 లక్షల జనాభా కలిగిన 3,027 గ్రామాలలో కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయిలో ప్రత్యేక అధికారులను నియమించారు.

మలేరియా కేసుల నిరోధక కృషిలో భాగంగా గత ఏడాది ప్రభుత్వం అన్ని ఆరోగ్య కేంద్రాలు, రెసిడెన్షియల్‌ స్కూళ్లు, హాస్టళ్లలో దోమల నియంత్రణకు తలుపులు, కిటికీలకు మెష్‌లను ఏర్పాటు చేసింది. ‘ఫ్రై డే–డ్రై డే’ పేరుతో అన్ని గ్రామ, వార్డు సచివాలయాలలో దోమల కట్టడి, మలేరియా నిరోధం కోసం వైద్య, మునిసిపల్, పంచాయతీరాజ్‌ శాఖలు సమన్వయంతో కృషి చేస్తున్నాయి. ఈ చర్యల ఫలితంగా ఏడాది ఇప్పటివరకూ కేవలం 117 కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఇదే స్ఫూర్తితో రాష్ట్రాన్ని మలేరియా రహిత (కేటగిరీ–0) చేయడానికి కృషి చేస్తామని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్‌ జె.నివాస్‌ తెలిపారు.    

మరిన్ని వార్తలు